
క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ కోకా కోలా బాటిల్ వ్యవహారం ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది. ప్రెస్ మీట్‌లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ రొనాల్డ్ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే రొనాల్డో చర్య తర్వాత మరికొందరు ఆటగాళ్లు.. అతన్నే అనుకరిస్తూ, అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఫుట్‌బాల్ అసోషియేషన్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది.
ఇకపై ఆటగాళ్లు బాటిళ్లను జరపడం, పక్కనపెట్టడం చాలా చేష్టలకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కేవలం బాటిళ్లలోనే కాదు.. స్పానర్‌లుగా వ్యవహరిస్తున్న కంపెనీల ప్రొడక్టుల విషయంలోనూ ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘టోర్నమెంట్ నిర్వాహణ కోసం ఆయా బ్రాండ్‌లతో ఒప్పందాలు జరిగాయని ఆటగాళ్లు గమనించాలి. వాళ్ల భాగస్వామ్యంతోనే యూరప్ దేశాల్లో ఫుట్‌బాల్ పురోగతికి కృషి జరుగుతోందని గుర్తించాలి’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది యూఈఎఫ్‌ఏ.
ఇక పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చర్యను పరోక్షంగా తప్పుబట్టిన టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కల్లెన్.. ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా చేసిన పనిని కూడా పరోక్షంగానే సమర్థించాడు. మత విశ్వాసానికి ముడిపడిన అంశం కావడంతో ఆ విషయంలో అతన్ని(పోగ్బా) తప్పుబట్టలేమని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లకు జరిమానా విధించే విషయంలో యూఈఎఫ్‌ఏ నేరుగా జోక్యం చేసుకోదని, ఆయా ఆటగాళ్ల ఫుట్‌బాల్ ఫెడరేషన్లే చూసుకుంటాయని మార్టిన్ స్పష్టం చేశాడు.
చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు-రొనాల్డో
Comments
Please login to add a commentAdd a comment