సాక్షి, బెంగళూరు (బనశంకరి): కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌లోనూ బెంగళూరు ప్రజలు మామూలుగానే సంచరిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు కఠిన చర్యలకు దిగారు. రోజూ ఉదయం 10 గంటల అనంతరం నగర ప్రముఖ రోడ్లలో బ్యారికేడ్లు అమర్చి తనిఖీ చేయడం, అకారణంగా బయటకు వచ్చారని తేలితే వాహనం సీజ్ చేసి జరిమానా, కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల లాక్‌డౌన్ ఉల్లంఘనులకు బస్కీలు, గుంజీలు తీయడం, లాఠీలతో పోలీసులు పాఠం చెబుతుంటే కొన్నిచోట్ల మర్యాదగా బైక్ సీజ్ చేయడం జరుగుతోంది. బెంగళూరు పీణ్యా పోలీసులు బయట తిరిగేవారికి గులాబీ పువ్వు అందించి బైక్ స్వాధీనం చేసుకుంటున్నారు.
జరిమానాల వల్ల సర్కారుకు రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఫైన్లపై పలుచోట్ల ప్రజలు– పోలీసులతో గొడవలకు దిగడం వల్ల ఉద్రిక్తతలూ చోటు చేసుకుంటున్నాయి. మాగడిరోడ్డు, నాగరబావి, మైసూరురోడ్డు, యశవంతపుర, హెబ్బాల, తుమకూరురోడ్డు, శివాజీనగర, శాంతినగర, కార్పొరేషన్ సర్కిల్, కేఆర్.మార్కెట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో వాహనాల సంచారం అధికంగా ఉంటోంది.
ఏదో కారణంతో బయటకు..
యథాప్రకారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు సడలింపు ఉంటోంది. ఆ తరువాత కూడా రద్దీ తగ్గడం లేదు. ఎక్కువమంది మెడికల్ షాపులు, వ్యాక్సినేషన్ అనే కారణాలు చెబుతున్నారు. లేదా.. కరోనా టెస్టుకు, ఆసుపత్రికి, వంటగ్యాస్ తీసుకురావడానికి వెళుతున్నాము అని చెబుతారు. అయినప్పటికీ పోలీసులు వాహనాల సీజ్ చేస్తుండడంతో వాహనదారులు లబోదిబోమనడం పరిపాటైంది.
31 వేల వాహనాలు సీజ్..
ఇప్పటివరకు నగర పరిధిలో 31,515 వాహనాలను జప్తుచేసి రూ.3.50 కోట్లు జరిమానా వసూలు చేశారు. ఇందులో బైకులు 25,658, ఆటోలు 1,308, కార్లు తదితరాలు 1,549 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment