
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తూ సస్పెండ్ అవుతుంటే, మరి కొందరు నిబద్ధతతో పని చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోసలిన్ అరోకియా మేరీ తన పని తీరుతో అందరి మన్ననలు పొందుతోంది. ఇటీవల ఆమె రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ప్రశంసలు అందుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
రోసలిన్ అరోకియా మేరీ.. ఆమె తన విధుల్లో ఎంతో కచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఆమె చేతికి చిక్కితే ఇక వారి పని అయినట్టే, ముక్కు పిండి మరీ వారి నుంచి జరిమానా వసూలు చేస్తుంది. ఇలా టికెట్ లేని ప్రయాణికులు, నిబంధనలు పాటించని ప్యాసింజర్ల నుంచి రోసలిన్ రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేసింది. పనిలో నిజాయతీగా ఖచ్చితత్వం ప్రదర్శిస్తూ తోటి ఉద్యోగులకు ఆదర్శంగా మారిన ఈ మహిళా టికెట్ ఇన్ స్పెక్టర్ కు కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రశంసలు దక్కాయి.
‘‘విధుల నిర్వహణ పట్ల ఆమె అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి రోసలిన్ అరోకియా మేరీ.. భారతీయ రైల్వేలో రూ.1.03 కోట్ల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టికెట్ చెకింగ్ ఉద్యోగి’’ అని తెలిపింది. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది, ఎందుకంటే టికెట్ తనిఖీ సిబ్బందిలో ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన మొదటి మహిళ ఆమె గుర్తింపు పొందింది. ఉద్యోగాన్ని సిన్సియర్ గా చేస్తున్న మేరీకి నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment