ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు 8 శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటానికి ప్రధాన కారణమైన ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధరించకపోవడం వంటి కేటగిరీల్లో అయితే ఏకంగా పది నుంచి 15 శాతం వరకు ఉల్లంఘనలు తగ్గిపోయాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసి పక్కాగా అమలు చేస్తుండటమే ఇందుకు కారణమని రవాణా శాఖ పేర్కొంటోంది. ఉల్లంఘనలు ఇంకా తగ్గుముఖం పడితే రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గిపోతాయని అధికారులు అంటున్నారు. గత నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు, అలాగే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 17 వరకు నమోదైన ఉల్లంఘనల్ని రవాణా శాఖలోని ట్రాఫిక్ రీసెర్చి వింగ్ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది.
ఉల్లంఘనలతో రోజుకు 9మంది మృతి
⇔ రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తేల్చింది.
⇔ ఈ కారణంగా రోజుకు 9మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 36 మంది దుర్మరణం పాలవుతున్నారు.
⇔ ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానాలు భారీగా పెంచింది.
⇔ 2019లో మొత్తం 21,992 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 15,303 ప్రమాదాలు డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 1,262 ప్రమాదాలు లెర్నింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 2,576 రోడ్డు ప్రమాదాలు అసలు డ్రైవింగ్ లైసెన్సు లేనివారి వల్ల జరిగాయి. కాగా నిబంధనల ఉల్లంఘనల కారణంగా 2,851 ప్రమాదాలు జరిగాయి.
⇔ ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నెలకు సగటున 7 వేల వరకు నమోదు అయ్యేవి. జరిమానాల పెంపుతో దాదాపు నెల రోజుల్లో 6,400 మాత్రమే నమోదయ్యాయి. అంటే 8 శాతం వరకు తగ్గాయన్న మాట.
⇔ ఇక భారీ జరిమానాలు విధిస్తుండటంతో హెల్మెట్ ధరించే వారి సంఖ్య 15 శాతానికి పెరిగింది.
⇔ గతంలో హెల్మెట్ ధరించకపోతే రూ.100 జరిమానా విధించే వారు. ఇప్పుడు రూ.1,000కి పెంచడం సత్ఫలితాన్నిచ్చింది.. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు హెల్మెట్ ధరించని కేసులు 1,947 నమోదు కాగా.. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 17 మధ్య 1,650 కేసులు నమోదయ్యాయి. అంటే 15 శాతం మేర కేసులు తగ్గాయన్న మాట.
⇔ ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలకు జరిమానా రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు పెంచడంతో ఈ కేసులు 10 శాతం తగ్గిపోయాయి. జరిమానా పెంచక మునుపు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు 900 వరకు మాత్రమే నమోదవుతున్నాయి.
పదే పదే ఉల్లంఘిస్తే జైలే
జరిమానాల పెంపుతో సత్ఫలితాలు వస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల సంఖ్య తగ్గిపోతోంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు 20 శాతం తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జైలుకు పంపేలా ఆలోచన చేస్తున్నాం. -ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment