వాహన కంపెనీల ‘రీకాల్స్‌’పై కేంద్రం కొరడా | Auto firms may be fined up to Rs 1 crore under govt new vehicle recall policy | Sakshi
Sakshi News home page

వాహన కంపెనీల ‘రీకాల్స్‌’పై కేంద్రం కొరడా

Published Thu, Mar 18 2021 1:30 AM | Last Updated on Thu, Mar 18 2021 1:30 AM

Auto firms may be fined up to Rs 1 crore under govt new vehicle recall policy - Sakshi

న్యూఢిల్లీ: తయారీ లోపాల కారణంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాహనాలను తప్పనిసరిగా రీకాల్‌ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇకపై వాహనాల కంపెనీలు రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి రానుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా మోడల్‌ మొత్తం అమ్మకాల్లో నిర్దిష్ట స్థాయిలో వెహికల్‌ రీకాల్‌ పోర్టల్‌కు ఫిర్యాదులు వచ్చిన పక్షంలో తప్పనిసరిగా రీకాల్‌ చేయాలనే ఆదేశాలిచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

వాహనాల సంఖ్య, రకాలను బట్టి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా జరిమానా విధించేలా నోటిఫికేషన్‌లో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం సెంట్రల్‌ మోటర్‌ వెహికల్స్‌ చట్టంలోని వాహనాల టెస్టింగ్, తప్పనిసరి రీకాల్‌ నిబంధనల ప్రకారం తయారీ సంస్థలు లేదా దిగుమతి సంస్థలు స్వచ్ఛందంగా రీకాల్‌ చేయకపోతే పెనాల్టీ విధించడానికి అవకాశం ఉంది. కొత్త నిబంధనలు ఏడేళ్ల లోపు వాహనాలకు వర్తిస్తాయి. ఇక రహదారులపై భద్రతపరమైన రిస్కులు సృష్టించేలా వాహనంలో లేదా విడిభాగాల్లో లేదా సాఫ్ట్‌వేర్‌లో సమస్యలేమైనా ఉంటే లోపాలుగా పరిగణిస్తారు. 

ఆరు లక్షల పైగా ద్విచక్ర వాహనాలను, ఒక లక్ష పైగా నాలుగు చక్రాల వాహనాలను (కార్లు, ఎస్‌యూవీలు మొదలైనవి) తప్పనిసరిగా రీకాల్‌ చేయాలంటూ ఆదేశించిన పక్షంలో వాహన కంపెనీలు గరిష్టంగా రూ. 1 కోటి మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక, తొమ్మిది మంది ప్యాసింజర్లను తీసుకెళ్లే వాహనాలు, హెవీ గూడ్‌ వెహికల్స్‌ను 50,000 పైచిలుకు రీకాల్‌ చేయాల్సి వస్తే రూ. 1 కోటి దాకా పెనాల్టీ ఉంటుంది. మూడు లక్షల పైగా త్రిచక్ర వాహనాలను రీకాల్‌ చేయాల్సి వచ్చినా గరిష్టంగా ఈ స్థాయి జరిమానా వర్తిస్తుంది. ఇక, ఎన్ని ఫిర్యాదులు వస్తే రీకాల్‌కు ఆదేశించేదీ కూడా కేంద్రం తెలిపింది. ఉదాహరణకు కార్లు లేదా ఎస్‌యూవీలు ఏటా 500 యూనిట్లు అమ్ముడవుతున్న పక్షంలో 20 శాతం లేదా 100 ఫిర్యాదులు వస్తే తప్పనిసరి రీకాల్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు.  

ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్‌ ..
వాహనదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్‌ ఏర్పాటు చేస్తుంది. ఫిర్యాదుల ఆధారంగా ఆటోమొబైల్‌ కంపెనీలకు నోటీసులు పంపిస్తారు. స్పందించేందుకు 30 రోజుల గడువిస్తారు. తప్పనిసరి రీకాల్‌కు ఆదేశించడానికి ముందు నిర్దిష్ట ఏజెన్సీ ఆయా ఫిర్యాదులపై కూలంకషంగా విచారణ జరుపుతుంది. ఇక, రీకాల్‌ ఆదేశాలపై తయారీ సంస్థలు, దిగుమతిదారులు, రెట్రోఫిటర్‌లకు అభ్యంతరాలేమైనా ఉంటే నోటీసు అందుకున్న 90 రోజూల్లోగా హైకోర్టును ఆశ్రయించవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement