అత్యాధునిక టెక్నాలజీతో ట్రిపుల్ ఆర్ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: వాహనాలు పరిమితికి మించిన వేగంతో దూసుకుపోయినా అదుపు తప్పకుండా ఉండేలా రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్)ను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల మీద గరిష్ట వేగాన్ని కేంద్ర ప్రభుత్వం గంటకు 120 కి.మీ.లకు పరిమితం చేసిన విషయం తెలిసిందే. కానీ, కొన్నిచోట్ల దీన్ని లెక్కచేయకుండా పరిమితికి మించిన వేగంతో వాహనాలు దూసుకుపోతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ఆర్‌ను గంటకు 180 కి.మీ నుంచి 200 కి.మీ. వేగాన్ని కూడా తట్టుకునే స్థాయిలో నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ నిర్మాణం ఇలా..
ట్రిపుల్ ఆర్‌ను 8 వరసలకు ప్రతిపాదించినా.. ప్రస్తుతం నాలుగు వరసలతోనే నిర్మిస్తారు. భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగాక మలిదశలో మిగతా నాలుగు లేన్లను నిర్మిస్తారు.
రోడ్డు మీద సెంట్రల్ మీడియన్ 15 మీటర్లుగా ఉంటుంది. దానిని ఆనుకుని ఉండే (రెండువైపులా కలిపి) నాలుగు వరసలను తదుపరి దశలో నిర్మిస్తారు. రోడ్డు చివరి వైపు నాలుగు వరసలను (2 ప్లస్ 2) ప్రస్తుతం నిర్మిస్తారు.
– ఈ నాలుగు వరసలు ఒక్కో వైపు 11 మీటర్లు ఉంటుంది. రెండు వైపులా కలిపి 22 మీటర్లు. ఇందులో 3 ప్లస్ 3 మీటర్లు పేవ్డ్ షోల్డర్ ఏరియా ఉంటుంది. ఏదైనా కారణంతో వాహనాలను నిలపాల్సి వస్తే.. పేవ్డ్ షోల్డర్ పరిధిలో నిలుపుతారు. ప్రధాన క్యారేజ్ వే 15 మీటర్లు ఉంటుంది.
150 ఎంఎంతో తారు వరసలు
రోడ్డు మీద తారు లేయర్లు 150 ఎంఎం మందంతో వేస్తారు. ఇందులో మొదట 100 ఎంఎం మందంతో డెన్స్ బిటమినస్ కాంక్రీట్ ఉంటుంది. ఇది రోడ్డుకు పటుత్వాన్ని అందిస్తుంది. తారుతోపాటు వివిధ మిశ్రమాలను ఇందులో కలుపుతారు. దీని జీవితకాలం 20 సంవత్సరాలు. ఆ తర్వాత పాత లేయర్‌ను మిల్లింగ్‌తో తొలగించి కొత్త లేయర్ వేయాల్సి ఉంటుంది. దాని మీద 50 ఎంఎం మందంతో డెన్స్ బిటమినస్ మెకడం (డీబీఎం)ను పరుస్తారు. ఇది సర్ఫేస్ లేయర్.
చాలా నునుపుగా ఉంటుంది. వాహనాలు వేగంగా వెళ్లినప్పుడు జారకుండా ఇది నియంత్రిస్తుంది. దీని జీవితకాలం కనిష్టంగా నాలుగేళ్లు. ఆ తర్వాత పైభాగంలో పటుత్వం కోల్పోతుంది. అప్పుడు మిల్లింగ్ ద్వారా దాన్ని తొలగించి కొత్త లేయర్ పరవాల్సి ఉంటుంది.
రోడ్డు కేంబర్ కీలకం
వాహనాలు వేగంగా ప్రయాణించే రోడ్లకు రోడ్ కేంబర్ చాలా కీలకం. కేంబర్ అంటే రోడ్డు వాలు. నేల సమాంతరంగా ఉన్నప్పుడు వాలు ఎంత ఉండాలి? మలుపుల వద్ద ఎంత ఉండాలి? అన్నది దీనిపై ఆధారపడి ఉంటుంది. తారుకు ప్రధాన శత్రువు నీరు. నీళ్లు నిలిస్తే తారు కణాలు విడిపోయి రోడ్డు మీద గుంతలు ఏర్పడతాయి. అందువల్ల నీళ్లు నిలువకుండా నిర్ధారిత వాలును అనుసరించాల్సి ఉంటుంది.
మలుపుల్లో సూపర్ ఎలివేషన్
మలుపుల వద్ద వేగంగా తిరిగినప్పుడు వాహనం అదుపుతప్పి బోల్తాపడే ప్రమాదం ఉంటుంది. దాన్ని నియంత్రించేందుకు రోడ్డు చివరలు కాస్త ఎత్తుగా ఉండేలా డిజైన్ చేస్తారు. దాన్నే సూపర్ ఎలివేషన్ అంటారు. ఎత్తు పల్లాల్లో ఉండే మలుపుల్లో ఈ ఎలివేషన్ వేర్వేరుగా ఉంటుంది. రోడ్డు వెడల్పు, వాహనాల వేగం, ఎత్తు పల్లాలు... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎన్ని డిగ్రీల కోణంలో తిరగాలి? ఎంత ఎత్తు ఉండాలి? అన్న లెక్కలుంటాయి.
దాన్ని కచ్చితంగా అనుసరించాలని నిర్ణయించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి కచ్చితత్వంతో రోడ్డును డిజైన్ చేస్తున్నారు. మలుపు 700 మీటర్ల నిడివితో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అప్పుడు వాహనం మలుపు తిరిగిన ఫీలింగ్ రాదు.
అతి వేగం ప్రమాదకరమే..
‘ఎక్స్‌ప్రెస్‌వేల మీద గంటకు 200 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకుపోయినా చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరగటం లేదు. అలా అని 200 కి.మీ. వేగంతో దూసుకుపోయేందుకు ఆ రోడ్డు సురక్షితమని అనుకోకూడదు. మన ప్రమాణాల ప్రకారం 120 కి.మీ. వేగంతో వెళ్లినప్పుడు వాహనంలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా రోడ్డు నియంత్రిస్తుంది.
అంతకు మించితే పరిస్థితులు చేయిదాటిపోతాయి. 180 –200 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా రోడ్డు ఉన్నా.. వాహనం తయారీ పరిమితులు, డ్రైవింగ్ మెళకువలు, వాతావరణం వంటివన్నీ ప్రభావితం చేస్తాయి. రోడ్డు బాగుంది కదా అని అంత వేగంగా దూసుకుపోతే ప్రమాదాలకు అవకాశాలెక్కువ’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment