Central Road Transport Department
-
నాలుగేళ్లలో లక్ష ప్రమాదాలు.. 35 వేల మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో 2018–22 మధ్య నాలుగేళ్లలో ఒక లక్షా 5 వేల 906 ప్రమాదాలు జరగ్గా, 35,565 మంది మరణించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ పేర్కొంది. ఈ ప్రమాదాల్లో ఒక లక్షా 4వేల 589 మంది గాయాలపాలైనట్లు వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 74 వేలకు పైగా మంది మరణించినట్లు బుధవారం తెలిపింది.దేశవ్యాప్తంగా దాదాపు 7లక్షల 77 వేల 423మంది దుర్మరణం చెందిన ట్లు రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్క రీ ప్రకటించారు. అత్యధిక రోడ్డు ప్రమాదాలు తమిళనాడులో చోటుచేసుకోగా, తక్కువ ప్రమాదాలు జరిగిన ప్రాంతంగా లక్షదీ్వప్ నిలిచినట్లు తెలిపారు. జాతీయ రహదారులపై 32.94శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 36.22% మరణాలు సంభవిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు సదస్సులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర/జిల్లా స్థాయిల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ రీసెర్చ్, రీజనల్ డ్రైవింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం ఓ పథకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి
న్యూఢిల్లీ: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ వాహనాలను నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాల్లో 2021లో 1,040 మంది మృతి చెందారు. అదేవిధంగా, రెడ్‌లైట్ పడినా పట్టించుకోకుండా వాహనాలను ముందుకు పోనివ్వడంతో 555 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని, 222 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరగ్గా, 1,481 మంది మృత్యువాతపడ్డారు. 2021కి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ఇటీవల వెల్లడించిన నివేదిక ఈ అంశాలను పేర్కొంది. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 1,53,972 మంది చనిపోగా, 3,84,448 మంది గాయపడినట్లు ఆ నివేదిక తెలిపింది. -
సీటుబెల్ట్ ధరించక 16 వేల మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 16,397 మంది చనిపోయారు. వీరిలో 8,438 మంది సంబంధిత వాహనాల డ్రైవర్లు కాగా, 7,959 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించక పోవడం వల్ల 46,593 మంది మృతి చెందారు. వీరిలో 32,877 మంది వాహనచోదకులు, మిగతా 13,716 మంది ప్రయాణికులు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 2021లో దేశవ్యాప్తంగా జరిగిన 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది దుర్మరణం పాలవగా, 3,84,448 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో హెల్మెట్ ధరించని వారు 93,763 మంది, సీటు బెల్ట్ ధరించని వారు 39,231 మంది అని పేర్కొంది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 8.2% డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, జంపింగ్ రెడ్ లైట్, సెల్ ఫోన్ వాడకం వంటి కారణాలతోనే జరిగాయని తెలిపింది. జాతీయ రహదారులపై జరిగే 9.35% ప్రమాద మరణాలకు ఇవే కారణాలని తెలిపింది. 67.5% ప్రమాదాలు తిన్నగా ఉండే రహదారులపై జరుగుతున్నాయి. గుంతలు, ఇరుకుగా, ఏటవాలుగా ఉండే రోడ్లపై 13.9% ప్రమాదాలు జరుగుతున్నాయని విశ్లేషించింది. కూడళ్లలో 20% ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టి–జంక్షన్లలో జరిగే ప్రమాదాల్లోనే ఎక్కువ మంది చనిపోవడమో, గాయపడటమో జరుగుతోందని తెలిపింది. 2021లో అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే నాలుగింట మూడొంతుల ప్రమాదాలు సంభవించగా, మంచు, వర్షం, గాలుల తీవ్రత వల్ల 16% ప్రమాదాలు జరిగాయని వివరించింది. దేశంలో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్‌లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. -
4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి
న్యూఢిల్లీ: 2021లో దేశవ్యాప్తంగా 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించారు. 3,84,448 మంది గాయపడ్డారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తాజాగా ఒక నివేదికలో ఈ మేరకు వెల్లడించింది. 2019తో పోలిస్తే 2021లో ప్రమాదాలు 8.1 శాతం, బాధితుల సంఖ్య 14.8 శాతం తగ్గినట్టు చెప్పింది. ‘‘మృతుల సంఖ్య మాత్రం 1.9 శాతం పెరిగింది. 2020 కంటే 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం, మరణాలు 16.9 శాతం, గాయపడినవారి సంఖ్య 10.39 శాతం పెరిగాయి. దేశంలో రోజూ సగటున 1,130 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 422 మంది మరణిస్తున్నారు’’ అని తెలిపింది. ► 2021లో ప్రమాదాల మృతుల్లో 67.7 శాతం 18–45 ఏళ్లలోపు వారే! 18–60 ఏళ్లలోపు వారు 84.5 శాతం మంది. ► గతేడాది 4,12,432 రోడ్డు ప్రమాదాల్లో 31.2 శాతం జాతీయ రహదారులపై, 23.4 శాతం రాష్ట్ర రహదారులపై, 45.4 శాతం ఇతర రోడ్లపై జరిగాయి. ► 2021లో తమిళనాడులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ మంది మరణించారు. ► రోడ్డు ప్రమాద మరణాలకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రధాన కారణాలు. ► పమాదాల్లో ద్విచక్ర వాహనాలదే ప్రధాన వాటా. కార్లు, జీపులు తర్వాతి స్థానంలో ఉన్నాయి. -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..! పెరగనున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు..!
న్యూఢిల్లీ: వాహనాలకు థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. 1,000 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్ల ప్రీమియం రూ.2,074 నుంచి రూ.2,094కు పెరగనుంది. 1,000–1,500 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్లకు రూ.3,221 నుంచి రూ.3,416కు, 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉంటే ప్రీమియం రూ.7,890 నుంచి రూ.7,897కు చేరనుంది. 150–350 సీసీ ద్విచక్ర వాహనాలు రూ.1,366, 350 సీసీపైన ఉంటే రూ.2,804 చెల్లించాల్సి ఉంటుంది. గూడ్స్ వాహనాలు 12–20 వేల కిలోల సామర్థ్యముంటే రూ.33,414 నుంచి రూ.35,313కు, 40 వేల కిలోల పైన సామర్థ్యముంటే రూ.41,561 నుంచి రూ.44,242కు చేరనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు 15 శాతం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు 7.5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. థర్డ్ పార్టీ (టీపీ) మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ గతంలో నోటిఫై చేసేది. ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం రోడ్డు రవాణా శాఖ టీపీ రేట్లను ప్రకటించడం ఇదే తొలిసారి. -
హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం రూ.2లక్షలు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో (గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మరణం) బాధిత కుటుంబాలకు పరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. ప్రస్తుతం పరిహారం కింద కేవలం రూ.25,000 అందజేస్తున్నారు. ఒకవేళ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైతే బాధితులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా పథకాన్ని ఆగస్టు 2న నోటిఫై చేసింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి ప్రస్తుతం రూ.12,500 చొప్పున పరిహారం ఇస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2019లో దేశంలో 4,49,002 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 1,51,113 మంది ఈ ప్రమాదాల్లో మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు పరిహారం ఇవ్వడానికి, క్షతగాత్రులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం ‘మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ ఫండ్’ ఏర్పాటు చేయనుంది. -
వాహన కంపెనీల ‘రీకాల్స్’పై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: తయారీ లోపాల కారణంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాహనాలను తప్పనిసరిగా రీకాల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇకపై వాహనాల కంపెనీలు రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి రానుంది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా మోడల్ మొత్తం అమ్మకాల్లో నిర్దిష్ట స్థాయిలో వెహికల్ రీకాల్ పోర్టల్‌కు ఫిర్యాదులు వచ్చిన పక్షంలో తప్పనిసరిగా రీకాల్ చేయాలనే ఆదేశాలిచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాహనాల సంఖ్య, రకాలను బట్టి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా జరిమానా విధించేలా నోటిఫికేషన్లో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం సెంట్రల్ మోటర్ వెహికల్స్ చట్టంలోని వాహనాల టెస్టింగ్, తప్పనిసరి రీకాల్ నిబంధనల ప్రకారం తయారీ సంస్థలు లేదా దిగుమతి సంస్థలు స్వచ్ఛందంగా రీకాల్ చేయకపోతే పెనాల్టీ విధించడానికి అవకాశం ఉంది. కొత్త నిబంధనలు ఏడేళ్ల లోపు వాహనాలకు వర్తిస్తాయి. ఇక రహదారులపై భద్రతపరమైన రిస్కులు సృష్టించేలా వాహనంలో లేదా విడిభాగాల్లో లేదా సాఫ్ట్‌వేర్‌లో సమస్యలేమైనా ఉంటే లోపాలుగా పరిగణిస్తారు. ఆరు లక్షల పైగా ద్విచక్ర వాహనాలను, ఒక లక్ష పైగా నాలుగు చక్రాల వాహనాలను (కార్లు, ఎస్‌యూవీలు మొదలైనవి) తప్పనిసరిగా రీకాల్ చేయాలంటూ ఆదేశించిన పక్షంలో వాహన కంపెనీలు గరిష్టంగా రూ. 1 కోటి మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక, తొమ్మిది మంది ప్యాసింజర్లను తీసుకెళ్లే వాహనాలు, హెవీ గూడ్ వెహికల్స్‌ను 50,000 పైచిలుకు రీకాల్ చేయాల్సి వస్తే రూ. 1 కోటి దాకా పెనాల్టీ ఉంటుంది. మూడు లక్షల పైగా త్రిచక్ర వాహనాలను రీకాల్ చేయాల్సి వచ్చినా గరిష్టంగా ఈ స్థాయి జరిమానా వర్తిస్తుంది. ఇక, ఎన్ని ఫిర్యాదులు వస్తే రీకాల్‌కు ఆదేశించేదీ కూడా కేంద్రం తెలిపింది. ఉదాహరణకు కార్లు లేదా ఎస్‌యూవీలు ఏటా 500 యూనిట్లు అమ్ముడవుతున్న పక్షంలో 20 శాతం లేదా 100 ఫిర్యాదులు వస్తే తప్పనిసరి రీకాల్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు. ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్ .. వాహనదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేస్తుంది. ఫిర్యాదుల ఆధారంగా ఆటోమొబైల్ కంపెనీలకు నోటీసులు పంపిస్తారు. స్పందించేందుకు 30 రోజుల గడువిస్తారు. తప్పనిసరి రీకాల్‌కు ఆదేశించడానికి ముందు నిర్దిష్ట ఏజెన్సీ ఆయా ఫిర్యాదులపై కూలంకషంగా విచారణ జరుపుతుంది. ఇక, రీకాల్ ఆదేశాలపై తయారీ సంస్థలు, దిగుమతిదారులు, రెట్రోఫిటర్‌లకు అభ్యంతరాలేమైనా ఉంటే నోటీసు అందుకున్న 90 రోజూల్లోగా హైకోర్టును ఆశ్రయించవచ్చు. -
యమపురికి ఈ రహదారులు
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 2016లో అత్యధికమంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించారు. ఇందులో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లోనే అత్యధిక మంది మృత్యువాత పడ్డారు. దేశంలో 2016లో మొత్తం 4,80,652 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 1,50,785 మంది మరణించారు. ఈ లెక్కన రోజుకి 1,317 యాక్సిడెంట్లు జరుగుతోంటే ఈ ప్రమాదాల్లో రోజుకి కనీసం 413 మంది మరణిస్తున్నారు. మనదేశంలో గంటకి 55 యాక్సిడెంట్లు జరుగుతోంటే అందులో 17 మంది మరణిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి నూరు యాక్సిడెంట్లకీ మరణాల సంఖ్యను బట్టి చూస్తే 2015లో ప్రమాదాల తీవ్రత 29.1 గానూ, 2016లో 31.4 గానూ ఉంది. ఈ రిపోర్టు ప్రకారం జాతీయ రహదారుల్లో 34.5 శాతం ప్రమాదాలు సంభవిస్తుంటే, రాష్ట్ర రహదారుల్లో సైతం 27.9 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇతర రోడ్లల్లో జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువగా నమోదౌతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులు మినహా మిగిలిన రోడ్లల్లో జరుగుతున్న ప్రమాదాలు 37.6 శాతం ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నింటిలో అతి వేగమే ప్రధాన కారణంగా రిపోర్టు వెల్లడించింది. ఆ తరువాత మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అతివేగం కారణంగా జరుగుతున్నవి 66.5 శాతం. వీటిలో 61 శాతం మంది మరణిస్తున్నారు. మొబైల్ ఫోన్లు వాడటం వల్ల జరిగిన ప్రమాదాలు 5000 అయితే ఈ కారణంగా మరణించిన వారు 2000 మంది. ప్రభుత్వ అంచనా ప్రకారం నగరాలకు సంబంధించి చెన్నై రోడ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. 2016లో 7,486 యాక్సిడెంట్లు ఒక్క చెన్నైలోనే జరిగాయి. దాని తరువాతి స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీలో 2016లో 7,375 ప్రమాదాలు జరిగాయి. బెంగుళూరు, ఇండోర్, కలకత్తాలు ప్రమాదాల్లో మొదటి ఐదు స్థానాల్లో చెన్నై, ఢిల్లీల సరసన చేరాయి. రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 12.8 శాతం రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. తమిళనాడులో 11.4 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మహారాష్ట్రలో 8.6, కర్నాటకలో 7.4 శాతం రోడ్డు ప్రమాదాలు రికార్డయ్యాయి. 2017లో 1.47 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఇది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ జనాభాతో సమానం. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఇంకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2016తో పోల్చుకుంటే 2017లో రోడ్డు ప్రమాదాలు 3.27 శాతం తగ్గినా 2018 తొలి మూడు నెలల్లోనే 1.68 శాతం పెరగడం గమనార్హం . అత్యధిక మంది యువకులే... 2016లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 60 (69,851 మంది) శాతం మంది 18–35 ఏళ్ళ లోపువారే. దాదాపు వీరంతా ఆయా కుటుంబాలను పోషిస్తున్న వారు. 35–45 ఏళ్ళ వయస్సు వారు –33,558 మంది. 45–60 ఏళ్ళ మధ్య వయస్సు వారు 22,174 మంది. 18 ఏళ్ల లోపు వయస్సు వారు 10,622 మంది. 60 ఏళ్ళు పైబడిన వారు 8,814 మంది. వయస్సు తెలియని వారు 5,766 మంది. ఏఏ కారణాలతో ఎంతెంత మంది మరణించారు... అతివేగం కారణంగా 73,896 మంది మరణించారు. ఓవర్టేక్ చేయడం వల్ల 9,562 మంది మృతి చెందారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు 6,131 మంది మరణించారు. రాంగ్‌సైడ్ లో వెళ్ళడం కారణంగా 5,705 మంది మరణించారు. రెడ్ లైట్ సిగ్నల్ జంప్ చేసినందువల్ల 4,055. డ్రైవర్ల తప్పిదం, లేదా డ్రైవర్ల అనారోగ్యం, ఫిట్నెస్ లేకపోవడం వల్ల 1,796 మంది మరణించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల 10,135 మంది. సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల 5,638 మంది మృత్యువాత పడ్డారు. -
రాష్ట్రంలో హైవేల అభివృద్ధికి రూ. 4,494 కోట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) రూ.4,494 కో ట్లు కేటాయించింది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం 188.51 కిలోమీటర్ల మేర 4 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీచేసినట్లు బుధవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ వెల్లడించింది. 161వ జాతీయ రహదారిలో కంది నుంచి రామసానిపల్లె వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధి కోసం రూ.1201.62 కోట్లు, రామసానిపల్లె నుంచి మంగ్లూ ర్ గ్రామం వరకు 46.6 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్డు కోసం మరో రూ.1,220 కోట్లు మంజూరు చేసింది. మంగ్లూర్ గ్రామం నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కి.మీ. మేర 4 లైన్ల రోడ్డు కోసం రూ.1,082 కోట్లు, రేపల్లె్లవాడ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ. 4 లైన్ల రోడ్డు కోసం రూ.988 కోట్లు కేటాయించినట్లు ఆ శాఖ వెల్లడించింది. -
5 కోట్ల నకిలీ డ్రైవింగ్ లెసైన్సులు
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే రోడ్డు రవాణా భద్రతా బిల్లు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా నకిలీ డ్రైవింగ్ లెసైన్స్లున్నాయని.. డ్రైవింగ్ లెసైన్స్ పొందేందుకు చాలామంది నకిలీ డాక్యుమెంట్లను ఇస్తున్నారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఆదివారం రాజ స్తాన్ రవాణా శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసిన రవాణా మంత్రుల సమావేశంలో గడ్కారీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా నకిలీ డ్రైవింగ్ లెసైన్స్‌లను, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రైవింగ్ లెసైన్స్ నకిలీదని తేలితే సదరు వ్యక్తులకు గరిష్టంగా ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించనున్నారు. నకిలీ లెసైన్స్‌దారుల ఆటకట్టించేందుకు కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ టెస్ట్‌లను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా భద్రతా బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నట్లు గడ్కారీ తెలిపారు. ఇకనుంచి డ్రైవింగ్ లెసైన్స్‌కు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.