ఇక పర్యావరణ అనుమతులే తరువాయి
అవి కూడా వస్తే ఎక్స్‌ప్రెస్ వే నంబర్ కేటాయింపు!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరుకు గాని జనవరి మొదటి వారంలో గాని ఈ రోడ్డుకు టెండర్లు పిలిచేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధమవుతున్న సమయంలో అటవీ అనుమతులకు సంబంధించిన ఇబ్బంది తొలగిపోయినట్టయ్యింది. ఇక పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అవి కూడా వస్తే ఈ రోడ్డుకు ఎక్స్‌ప్రెస్ వే నంబర్ కేటాయింపు సులభవుతుంది.
ఆ నంబర్ వస్తేనే టెండర్లు తెరిచేందుకు వీలుంటుంది. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లాలో 8.511 హెక్టార్లు .. వెరసి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని ఉత్తర రింగు అలైన్‌మెంటులో భాగంగా సేకరించనున్నారు. ఇందుకు ప్రతిగా అటవీ శాఖకు వేరే ప్రాంతంలో అంతే మొత్తం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.
సేకరించే అటవీ భూమిలో కోల్పోయే చెట్లకు పరిహారంతో పాటు, కొత్తగా పొందే భూమిలో అటవీ శాఖ చెట్ల పెంపకానికి అయ్యే ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ భాగానికి కావాల్సిన భూమిలో 90 శాతం సేకరణ ప్రక్రియ పూర్తయింది. త్వరలో అవార్డులు పాస్ చేయటం ద్వారా భూ యజమానులకు పరిహారం చెల్లించనున్నారు.
అనుమతి లేఖ అందింది: మంత్రి కోమటిరెడ్డి
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 72.3536 హెక్టార్ల అటవీ భూమి స్వాధీనానికి అనుమతిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్‌రావ్ భవర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్తర భాగం రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి భారతమాల పరియోజన కింద అనుమతి ఇస్తున్నట్టుగా లేఖలో పేర్కొనట్టు వెల్లడించారు. పర్యావరణ నిబంధనలకు లోబడి భూసేకరణ చేస్తామని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు తెలిపామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment