vehicles recall
-
వాహన కంపెనీల ‘రీకాల్స్’పై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: తయారీ లోపాల కారణంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాహనాలను తప్పనిసరిగా రీకాల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇకపై వాహనాల కంపెనీలు రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి రానుంది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా మోడల్ మొత్తం అమ్మకాల్లో నిర్దిష్ట స్థాయిలో వెహికల్ రీకాల్ పోర్టల్‌కు ఫిర్యాదులు వచ్చిన పక్షంలో తప్పనిసరిగా రీకాల్ చేయాలనే ఆదేశాలిచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాహనాల సంఖ్య, రకాలను బట్టి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా జరిమానా విధించేలా నోటిఫికేషన్లో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం సెంట్రల్ మోటర్ వెహికల్స్ చట్టంలోని వాహనాల టెస్టింగ్, తప్పనిసరి రీకాల్ నిబంధనల ప్రకారం తయారీ సంస్థలు లేదా దిగుమతి సంస్థలు స్వచ్ఛందంగా రీకాల్ చేయకపోతే పెనాల్టీ విధించడానికి అవకాశం ఉంది. కొత్త నిబంధనలు ఏడేళ్ల లోపు వాహనాలకు వర్తిస్తాయి. ఇక రహదారులపై భద్రతపరమైన రిస్కులు సృష్టించేలా వాహనంలో లేదా విడిభాగాల్లో లేదా సాఫ్ట్‌వేర్‌లో సమస్యలేమైనా ఉంటే లోపాలుగా పరిగణిస్తారు. ఆరు లక్షల పైగా ద్విచక్ర వాహనాలను, ఒక లక్ష పైగా నాలుగు చక్రాల వాహనాలను (కార్లు, ఎస్‌యూవీలు మొదలైనవి) తప్పనిసరిగా రీకాల్ చేయాలంటూ ఆదేశించిన పక్షంలో వాహన కంపెనీలు గరిష్టంగా రూ. 1 కోటి మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక, తొమ్మిది మంది ప్యాసింజర్లను తీసుకెళ్లే వాహనాలు, హెవీ గూడ్ వెహికల్స్‌ను 50,000 పైచిలుకు రీకాల్ చేయాల్సి వస్తే రూ. 1 కోటి దాకా పెనాల్టీ ఉంటుంది. మూడు లక్షల పైగా త్రిచక్ర వాహనాలను రీకాల్ చేయాల్సి వచ్చినా గరిష్టంగా ఈ స్థాయి జరిమానా వర్తిస్తుంది. ఇక, ఎన్ని ఫిర్యాదులు వస్తే రీకాల్‌కు ఆదేశించేదీ కూడా కేంద్రం తెలిపింది. ఉదాహరణకు కార్లు లేదా ఎస్‌యూవీలు ఏటా 500 యూనిట్లు అమ్ముడవుతున్న పక్షంలో 20 శాతం లేదా 100 ఫిర్యాదులు వస్తే తప్పనిసరి రీకాల్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చు. ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్ .. వాహనదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేస్తుంది. ఫిర్యాదుల ఆధారంగా ఆటోమొబైల్ కంపెనీలకు నోటీసులు పంపిస్తారు. స్పందించేందుకు 30 రోజుల గడువిస్తారు. తప్పనిసరి రీకాల్‌కు ఆదేశించడానికి ముందు నిర్దిష్ట ఏజెన్సీ ఆయా ఫిర్యాదులపై కూలంకషంగా విచారణ జరుపుతుంది. ఇక, రీకాల్ ఆదేశాలపై తయారీ సంస్థలు, దిగుమతిదారులు, రెట్రోఫిటర్‌లకు అభ్యంతరాలేమైనా ఉంటే నోటీసు అందుకున్న 90 రోజూల్లోగా హైకోర్టును ఆశ్రయించవచ్చు. -
పెద్ద మొత్తంలో మారుతి కార్ల రీకాల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ వినియోగదారులకు షాకిచ్చిందింది. తన వాహనాల్లో కొన్ని మోడళ్ల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 'పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్' వేరియంట్ల కార్లలోని మోటారు జనరేటర్ యూనిట్లలో సమస్య కారణంగా వేలాది వాహనాలను రీకాల్ చేస్తోంది. 63,493 మారుతి సుజుకి సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 కార్లును వెనక్కి తీసుకుంటోంది. జనవరి1నవంబర్ 21మధ్య తయారైన సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 మోడళ్ల స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లను పరిశీలిస్తామని భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థమారుతి తెలిపింది. ఈ మేరకు మారుతి సుజుకి మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. విదేశీ గ్లోబల్ పార్ట్ సప్లయర్ తయారు చేయడం వలన ఎంజీయూలో లోపం ఏర్పడి వుండవచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆయా వాహనదారులు ఈ రోజునుంచే మారుతి సుజుకి డీలర్లను సంప్రదించవచ్చని తెలిపింది. ఆయా వాహనాలను తనిఖీ చేయించు కోవడంతోపాటు లోపభూయిష్టమైన పార్ట్‌లను ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా తమ రీకాల్‌కు సంబంధించిన ప్రచారాన్ని చేపట్టినట్టు మారుతి తెలిపింది. -
టాయోటా కార్ల భారీ రీకాల్
టోక్యో : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ఎయిర్ బ్యాగ్ లో సాంకేతిక లోపం కారణంగా ఇటీవల భారీ ఎత్తున కార్లను వెనక్కి తీసుకుంటున్న సంస్థ మరోసారి పెద్ద ఎత్తున రీకాల్ చేపట్టింది. సుమారు 5 లక్షలకు పైగా వెహికల్స్ ను వెనక్కి తీసుకోనుంది. జపాన్ టకట కార్పొరేషన్ చేసిన లోపభూయిష్ట ఎయిర్ బ్యాగ్స్ కారణంగా అమెరికాలో 5,43,000 వాహనాలను రీకాల్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2006-2012 మధ్య తయారు చేసిన వివిధ మోడల్ కార్లలో సెడాన్ మరియు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలున్నట్టు చెప్పింది. అలాగే 2008-2009 సియోన్ ఎక్స్ బి , 2009 - 2012 కరోలా, కరోలా మ్యాట్రిక్స్ , యారిస్,సియన్నా , లెక్సస్ ఇతర వాహనాలు ఉన్నట్టు ప్రకటించింది. కాగా ఎయిర్ బ్యాగుల తయారీలో ఉపయోగించిన అమ్మోనియం నైట్రేట్ రసాయనం మూలంగా గతంలో అనేక పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 16 మంది చనిపోగా, 180 మందికి పైగా గాయపడ్డారు.