న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానా కట్టకుంటే మరో 2 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. మాల్యా తీరును ఖండిస్తూ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘మాల్యా తన ప్రవర్తన పట్ల ఎన్నడూ పశ్చాత్తాపం వెలిబుచ్చలేదు. క్షమాపణలూ చెప్పలేదు. కాబట్టి కోర్టు గౌరవాన్ని కాపాడేందుకు ఆయనకు ఈ శిక్ష విధించడ తప్పనిసరి’’ అని న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
శిక్ష అనుభవించేందుకు వీలుగా మాల్యాను తక్షణం భారత్ రప్పించాలని కేంద్ర హోం శాఖకు సూచించింది. మాల్యాపై రూ.9,000 కోట్లకు పైగా రుణాల ఎగవేత కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 4 కోట్ల డాలర్లను ఆయన తన పిల్లలకు బదిలీ చేశారు. ఇది కోర్టు ధిక్కరణేనంటూ 2017 మేలో కోర్టు తీర్పు ఇచ్చింది. 4 కోట్ల డాలర్లను 8 శాతం వార్షిక వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ ఆఫీసర్ వద్ద జమ చేయాలని మాల్యాను, ఆయన పిల్లలను ఆదేశించింది. లేదంటే రికవరీకి ఆఫీసర్ చర్యలు చేపడతారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment