లండన్: పుస్తక పఠనంపై ఆసక్తితో గ్రంథాలయం నుంచి అద్దెకు తెచ్చుకున్న ఒక పుస్తకాన్ని ఓ పెద్దాయన తిరిగి ఇవ్వడం మరిచాడు. అలా అది 84 సంవత్సరాలు అల్మారాలో అలాగే ఉండిపోయింది. వారసత్వంగా తాత నుంచి వచ్చిన పాత వస్తువులను సర్దుతున్న మనవడికి లైబ్రరీ పుస్తకంపై దృష్టిపడింది. 1938 అక్టోబర్ 11న ఈ పుస్తకం తిరిగి ఇవ్వాలి అంటూ పుస్తకం ముందుపేజీపై ముద్రించి ఉండటం చూసి అవాక్కయ్యా. వెంటనే ఆ పుస్తకాన్ని లైబ్రరీలో అప్పజెప్పాడు.
ఇంగ్లండ్‌లో ఇటీవల ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీ నగరం సమీపంలోని ఎర్లీస్‌డన్ ప్రాంతంలోని కోవెంట్రీ పబ్లిక్ లైబ్రరీ శాఖ నుంచి కెప్టెన్ విలియం హారిసన్ అనే వ్యక్తి రిచర్డ్ జెఫరీ రచించిన రెడ్ డీర్ అనే పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకున్నాడు. 1938 తొలినాళ్లలో ఈ పుస్తకం విలియం చేతికొచ్చింది. విలియం 1957లో మరణించారు. పుస్తకం విషయం తెలియక ఆయన కుమార్తె సైతం పుస్తకాన్ని గ్రంథాలయానికి పంపలేదు. ఆమె ఇటీవల కన్నుమూశారు.
ఆమె కుమారుడు ప్యాడీ రియార్డన్ ఇటీవల తాత వస్తువుల్లో దీనిని కనుగొన్నాడు. వెంటనే లైబ్రరీకి తీసుకెళ్లి ఇచ్చేశాడు. 84 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి ఇవ్వడం చూసి లైబ్రరీ సిబ్బంది ఒకింత ఆశ్చర్యపడినా చాలా ఆలస్యంగా ఇచ్చారంటూ జరిమానా విధిస్తామన్నారు. అందుకు ప్యాడీ సిద్ధపడ్డాడు. 30,695 రోజుల ఆలస్యానికి లెక్కలు కట్టి, ప్రతి ఏడు రోజుల్లో ఒకరోజుకు జరిమానా విధిస్తూ ఫైన్‌ను 18.27 బ్రిటిష్ పౌండ్లుగా తేల్చారు.
అది కట్టేసి ప్యాడీ బాధ్యత తీరిందని సంతోషపడ్డాడు. ఇన్ని రోజుల తర్వాత పుస్తకం తిరిగిఇవ్వడం రికార్డ్ అవుతుందని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు. వాస్తవానికి ఇలాంటి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ ఇంగ్లాండ్‌లోనే నమోదవడం విశేషం. గ్రేట్ బ్రిటన్ తొలి ప్రధానిగా పరిగణించబడే సర్ రాబర్డ్ వాల్పోలే తండ్రి కల్నల్ రాబర్ట్ 1668లో సిడ్నీ ససెక్స్ కాలేజీ నుంచి ఒక పుస్తకం తీసుకున్నారు. అది ఏకంగా 288 సంవత్సరాల తర్వాత తిరిగి కళాశాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment