breaking news
library books
-
ఇల్లే గ్రంథాలయం..! హోమ్ లైబ్రరీ కోసం..
ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్రదేశం ఎంచుకుంటున్నారు. అక్కడ ఒక పుస్తకాల రాజ్యం ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో నగరవాసులు తమ సొంతింట్లో ఇలాంటి హోమ్ లైబ్రరీల ఏర్పాటుపై విశేషమైన ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి వద్ద ఎక్కువ సమయం గడిపే అలవాటు పెరగడంతో జీవనశైలిలో వచ్చిన మార్పుల్లో ఒకటిగా హోమ్ లైబ్రరీని చెప్పొచ్చు. నిజానికి పఠనాసక్తిని తగ్గించే కారణాల్లో ఒకటైన సోషల్ మీడియా మరోవైపు దాని పెరుగుదలకూ దోహదం చేస్తోంది. తరచూ పుస్తకాల రివ్యూలతో పాటు తాము చదివిన పుస్తకాల విశేషాలను అనేక మంది పంచుకుంటుండటంతో అది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతేకాకుండా నగరంలో తరచూ ఏర్పాటవుతున్న పుస్తక ప్రదర్శనలు కూడా కొని తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోవాల్సిన పుస్తకాలను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి అనేకానేక కారణాలతో హోమ్ లైబ్రరీల అవసరాన్ని నగరవాసులు గుర్తిస్తున్నారు. నా ఇల్లే.. నా లైబ్రరీ.. పఠనాసక్తి ఉన్న నగరవాసులు తమ ఇంట్లో ఎవరి స్థాయిలో వారు పుస్తకాల కోసం ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నారు. ఆయా ఇళ్లలో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ‘రీడింగ్ కార్నర్’ అనో, లేక ‘బుక్ నుక్’, లేదా ‘పర్సనల్ లైబ్రరీ’.. తదితర పేర్లతో పలు రూపాల్లో ప్రత్యేక స్థలాన్ని ఇంటి డిజైన్‌లో భాగంగా చేర్చడం ఓ కొత్త ట్రెండ్ అయింది. ఐటీ ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా హౌస్‌వైఫ్‌లు, స్టూడెంట్లు కూడా తమ అభిరుచులు, అవసరాల మేరకు పుస్తకాలను చదువుకోడానికి ఓ ప్రశాంతమైన ప్రదేశాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటుండటం కనిపిస్తోంది. వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి హోమ్ లైబ్రరీ ఏర్పాటుకు నగరవాసులు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ఒక మోస్తరు స్థలంలో తగిన వసతులతో హోమ్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.30 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతోందని ఇంటీరియర్ డిజైనర్స్ చెబుతున్నారు. వీటిలో ఉండే పుస్తకాల బుక్ షెల్వ్‌లు, చదువుకునేందుకు టేబుల్, సౌకర్యవంతమైన కురీ్చలు, మంచి లైటింగ్, వాల్ డెకార్ ఇవన్నీ కలిపి హోమ్ లైబ్రరీని ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. ఇక ఖరీదైన విల్లాలలో, అపార్ట్‌మెంట్స్‌లో అయితే రూ.3 లక్షల వరకు ఖర్చుతో లగ్జరీ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. మొబైల్‌కి బై చెప్పేస్తూ.. పుస్తకాల పట్ల అమిత ప్రేమ కలిగిన వారు మాత్రమే కాకుండా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని దూరం చేయడం కోసం పలువురు తల్లిదండ్రులు దీనిని ఒక తెలివైన మార్గంగా మార్చుకుంటున్నారు. పిల్లలలో చదువు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు తమస్థాయిలో తాము హోమ్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు బిల్డర్లు ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్టుల్లో కామన్ లైబ్రరీలను కూడా తమ ప్లాన్స్‌లో భాగం చేస్తున్న సంగతి గమనార్హం. ప్రశాంతత కోసం.. ఇంటర్నెట్, ఈ–బుక్స్ విస్తృతంగా ఉన్నా, ఫిజికల్ బుక్స్‌తో గడిపే అనుభూతి అపూర్వం అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. గతంలో పుస్తకం అంటే జ్ఞానం పెంచుకోవడానికి మార్గంగా ఉంటే ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంటర్నెట్ ఆక్రమించింది. దాంతో.. పుస్తకం ఇప్పుడో సైకలాజికల్ థెరపీగా మారిపోయింది. ‘ప్రపంచ జ్ఞానం కోసం కాకుండా, ప్రశాంతత కోసం చదువు’ అనే ఆలోచనలతో హోమ్ లైబ్రరీ ట్రెండ్ ఊపందుకుంటోంది. రూ.వేల నుంచి రూ.3 లక్షల దాకా ఖర్చుచదవడం పట్ల పెరుగుతున్న ఆసక్తి ఇళ్లలో వ్యక్తిగతీకరించిన, మేధోపరమైన స్థలాలను సృష్టిస్తోంది. చిన్న అపార్ట్మెంట్లలో కూడా లైబ్రరీలను నిర్మించడానికి మెట్ల కింద ప్రాంతాలు, లివింగ్ రూమ్ మూలలు, టీవీ యూనిట్లు వంటి ప్రదేశాలను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నారు. అధునాతన స్టైల్స్‌కు నిదర్శనంగా.. ముదురు రంగులు, క్లాసిక్ నమూనాలు కాలాతీత పుస్తక సేకరణలను కలిగి ఉన్న ప్రసిద్ధ డిజైన్ ట్రెండ్‌ను డార్క్ అకాడెమియా అని పిలుస్తున్నారు. లైబ్రరీలను లివింగ్ రూమ్‌లు లేదా హోమ్ ఆఫీస్‌ల వంటి ఇతర గదులతో కలిపి కుట్టేస్తూ ద్వంద్వ–ప్రయోజన ప్రదేశాలను ఆవిష్కరిస్తున్నారు. సౌకర్యవంతమైన సీటింగ్, మంచి లైటింగ్, అలంకార వస్తువులు వంటివి మేళవించి స్టైలిష్ రీడింగ్ నూక్స్‌ను డిజైన్ చేస్తున్నారు. అధునాతన స్టైల్స్‌కు నిదర్శనంగా.. ముదురు రంగులు, క్లాసిక్ నమూనాలు కాలాతీత పుస్తక సేకరణలను కలిగి ఉన్న ప్రసిద్ధ డిజైన్ ట్రెండ్‌ను డార్క్ అకాడెమియా అని పిలుస్తున్నారు. (చదవండి: ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను!) -
ఎట్టకేలకు తిరిగిచ్చారు.. 84 ఏళ్లకు గ్రంథాలయానికి చేరిన పుస్తకం
లండన్: పుస్తక పఠనంపై ఆసక్తితో గ్రంథాలయం నుంచి అద్దెకు తెచ్చుకున్న ఒక పుస్తకాన్ని ఓ పెద్దాయన తిరిగి ఇవ్వడం మరిచాడు. అలా అది 84 సంవత్సరాలు అల్మారాలో అలాగే ఉండిపోయింది. వారసత్వంగా తాత నుంచి వచ్చిన పాత వస్తువులను సర్దుతున్న మనవడికి లైబ్రరీ పుస్తకంపై దృష్టిపడింది. 1938 అక్టోబర్ 11న ఈ పుస్తకం తిరిగి ఇవ్వాలి అంటూ పుస్తకం ముందుపేజీపై ముద్రించి ఉండటం చూసి అవాక్కయ్యా. వెంటనే ఆ పుస్తకాన్ని లైబ్రరీలో అప్పజెప్పాడు. ఇంగ్లండ్‌లో ఇటీవల ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీ నగరం సమీపంలోని ఎర్లీస్డన్ ప్రాంతంలోని కోవెంట్రీ పబ్లిక్ లైబ్రరీ శాఖ నుంచి కెప్టెన్ విలియం హారిసన్ అనే వ్యక్తి రిచర్డ్ జెఫరీ రచించిన రెడ్ డీర్ అనే పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకున్నాడు. 1938 తొలినాళ్లలో ఈ పుస్తకం విలియం చేతికొచ్చింది. విలియం 1957లో మరణించారు. పుస్తకం విషయం తెలియక ఆయన కుమార్తె సైతం పుస్తకాన్ని గ్రంథాలయానికి పంపలేదు. ఆమె ఇటీవల కన్నుమూశారు. ఆమె కుమారుడు ప్యాడీ రియార్డన్ ఇటీవల తాత వస్తువుల్లో దీనిని కనుగొన్నాడు. వెంటనే లైబ్రరీకి తీసుకెళ్లి ఇచ్చేశాడు. 84 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి ఇవ్వడం చూసి లైబ్రరీ సిబ్బంది ఒకింత ఆశ్చర్యపడినా చాలా ఆలస్యంగా ఇచ్చారంటూ జరిమానా విధిస్తామన్నారు. అందుకు ప్యాడీ సిద్ధపడ్డాడు. 30,695 రోజుల ఆలస్యానికి లెక్కలు కట్టి, ప్రతి ఏడు రోజుల్లో ఒకరోజుకు జరిమానా విధిస్తూ ఫైన్‌ను 18.27 బ్రిటిష్ పౌండ్లుగా తేల్చారు. అది కట్టేసి ప్యాడీ బాధ్యత తీరిందని సంతోషపడ్డాడు. ఇన్ని రోజుల తర్వాత పుస్తకం తిరిగిఇవ్వడం రికార్డ్ అవుతుందని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు. వాస్తవానికి ఇలాంటి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ ఇంగ్లాండ్‌లోనే నమోదవడం విశేషం. గ్రేట్ బ్రిటన్ తొలి ప్రధానిగా పరిగణించబడే సర్ రాబర్డ్ వాల్పోలే తండ్రి కల్నల్ రాబర్ట్ 1668లో సిడ్నీ ససెక్స్ కాలేజీ నుంచి ఒక పుస్తకం తీసుకున్నారు. అది ఏకంగా 288 సంవత్సరాల తర్వాత తిరిగి కళాశాలకు చేరింది. -
విద్యా సాయం
విద్య విలువ గురించి విద్యా బాలన్ ఎప్పుడూ చెబుతుంటారు. చెప్పడమే కాదు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని పిల్లలకు సహాయం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి మరో మంచి ప్రయత్నం చేశారు విద్యా బాలన్. దీనికోసం తన చీరను వేలానికి పెట్టారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బు ఢిల్లీకి చెందిన ఓ కమ్యూనిటీ లైబ్రరీకి అందుతుంది. పరిధులను విస్తరించే పుస్తకాలు, అవగాహన కలిగించే పుస్తకాలు కొనుక్కోలేని పిల్లలకు ఈ ఉచిత లైబ్రరీ అవి సమకూరుస్తుంది. కరోనా నేపథ్యంలో లైబ్రరీకి నిధుల కొరత ఏర్పడటంతో విద్యా బాలన్లాంటి కొందరు ప్రముఖులను నిర్వాహకులు సంప్రదించారు. వేలం వేయడానికి ఏదైనా వ్యక్తిగత వస్తువు ఇవ్వాల్సిందిగా విద్యాని నిర్వాహకులు కోరగా, తన చీరను ఇచ్చారామె. ‘‘నాకు చీరలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చేనేత చీరలంటే చాలా చాలా ఇష్టం. నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ‘ప్యూర్ టస్సర్’ చీరను ఇచ్చాను’’ అన్నారు విద్యా బాలన్. ఇంకా మాట్లాడుతూ– ‘‘పుస్తకాలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. తరగతి గదిలో మనం నేర్చుకున్నవన్నీ గొప్ప పాఠాలే. తరగతి గది బయట మనం కలిసే వ్యక్తులు, వాళ్లతో మాట్లాడినప్పుడు తెలుసుకునే విషయాలు, పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం ఇవన్నీ మనకు వెలకట్టలేని జీవిత పాఠాలు అవుతాయి. ఇక లైబ్రరీకి వెళితే ప్రపంచాన్ని మరచిపోవచ్చు. లైబ్రరీలో ఉండే సౌలభ్యమే అది. మన దేశంలో ఉచిత లైబ్రరీలు మరిన్ని రావాలి. కానీ దానికి చాలా నిధులు కావాలి. నా వంతుగా నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది’’ అన్నారు. -
‘ఎన్నాప్పా.. సౌక్కియమా’..
సాక్షి, చెన్నై: పదో తరగతి కూడా చదవలేదు. బతుకు బండి లాగేందుకు అతను చేసేది క్షవరవృత్తి. అయితేనేం ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ అతడితో సంభాషించారు. ప్రశంసల వర్షం కురిపించారు. అతని జీవితంలోని భిన్నమైన కోణానికి మరింత స్పూర్తి నింపారు. వివరాల్లోకి వెళితే... తూత్తుకూడికి చెందిన పొన్ మారియప్పన్ జీవనోపాధి కోసం మిల్లర్‌పురంలో సెలూన్ ప్రారంభించాడు. కానీ లోలోపలే ఉన్నతవిద్య చదువుకోలేదనే అంతర్మధనంతో సతమతమయ్యేవాడు. చదువంటే పాఠ్యపుస్తకాలే కాదు లోకజ్ఞానం కూడా అని భావించాడు. పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. తనలాంటి వారి కోసం తన సెలూన్‌ను ఒక గ్రంథాలయంగా మార్చేశాడు. ఈ ప్రయత్నం స్థానికులనే కాదు ప్రధాని నరేంద్రమోదీనే ఆకర్షించింది. “మన్‌కీ బాత్’ కార్యక్రమంలో మారియప్పన్‌తో ఇటీవల పధాని మోదీ సంభాషించి మెచ్చుకోవడంతో అతని ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ ఆనందానుభూతి అతడి మాటల్లోనే... ‘తూత్తుకూడి ఆలిండియా రేడియో స్టేషన్ వారు ఒక రోజు నన్ను అకస్మాత్తుగా తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. నా గురించి అప్పటికే అందరికీ తెలిసి ఉండడంతో అరుదైన పుస్తకాలు ఇస్తారేమోననే ఆలోచనతో వెళ్లాను. అయితే రేడియో స్టేషన్ ఉన్నతాధికారులు నా వద్దకు వచ్చి ప్రధాని మోదీ మీతో మాట్లాడుతారని చెప్పడంతో బిత్తరపోయాను. మన్‌కీ బాత్ ద్వారా ప్రధాని మోదీ ముందుగా నా క్షేమ సమాచారాలు తమిళంలోనే అడిగి తెలసుకుని సంభాషించడంతో ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. సెలూన్‌ను పుస్తకాలతో గ్రంథాలయంగా మార్చడం ద్వారా ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నాను. అయితే ప్రధానితో మాట్లాడిన తరువాత ఇంకా ఎంతో సాధించాలనే తపన పెరిగింది. నీకు బాగా నచ్చిన గ్రంథం ఏదని మోదీ అడిగినప్పుడు తిరుక్కురల్ అని చెప్పాను. (విషమంగా వ్యవసాయశాఖ మంత్రి ఆరోగ్యం) 8వ తరగతితో చదువు మానేసి 2014లో సెలూన్‌ను ప్రారంభించాను. పుస్తక పఠనాన్ని పెంచాలనే ఉద్దేశంతో 2015లో సెలూన్లో గ్రంథాలయం పెట్టాను. గ్రంథాల్లోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ హెయిర్ కటింగ్, షేవింగ్ చేయడం ద్వారా పలు సామాజిక విషయాలపై ఎంతో మందిలో చైతన్యం తీసుకొచ్చాను. ప్రస్తుతం నా గ్రంథాలయంలో 1,500లకు పైగా పుస్తకాలున్నాయి. సెలూన్‌కు వచ్చే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగంగా మారింది. విద్యార్థులకు రాయితీపై సెలూన్ సేవలు అందిస్తున్నాను. నాకు అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉమ్మడి కుటుంబంగా అందరం ఒకే చోట ఉంటాం. నేను చేసిన ఒక సాధారణ ప్రయత్నానికి ప్రధాని ప్రశంస లభించడం ఎంతో ఆనందంగా ఉందని’ తెలిపాడు. -
లెక్కల్లో అన్నీ.. పరికరాలే కొన్ని..!
పాలమూరు, న్యూస్‌లైన్ : ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్.. కాకిలెక్కల పథకంలా మారింది. ప్రభుత్వ బడుల్లో గ్రంథాలయ పుస్తకాలు, ప్రయోగశాలల ఏర్పాటు తదితరాలు సమకూర్చి విద్యా ప్రమాణాలను పెంచడం.. రేపటి పౌరులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘ఆర్‌ఎంఎస్‌ఏ’ అమలు అధ్వానమవుతోంది. గతంలో ఈ పథకం ద్వారా 6,7,8 తరగతుల విద్యార్థులకోసం ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పటికీ చూపడం విశేషం. ఇప్పటి వరకు రూ.6.29 కోట్లు మంజూరై వాటిని వినియోగించినప్పటికీ.. పాఠశాలల్లో ఎక్కడా అంత మొత్తానికి తగ్గా పరికరాలుగాని, వస్తువులుగానీ కనపించడం లేదు. భవనాల నిర్మాణంతోపాటు పరికరాలు, ఇతరత్రా నిధులపై ఆజమాయిషీ లేకపోవడంతో కిందిస్థాయిలో ఆడిందే ఆటగా మారింది. నిధుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఏటా ఉద్యోగోన్నతులు, బదిలీలు, ఉద్యోగ విరమణ వంటి సమయాల్లో నోడ్యూస్ పత్రాలను తీసుకోక పోవడం, రికార్డుల నిర్వహణలో అవకతవకలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిధుల విడుదల ఇలా..! 2009-10లో 590 పాఠశాలలకు రూ.7,425 వంతున రూ.43.80లక్షలు ఇచ్చారు. ఇందులో దాదాపు 25 పాఠశాలల నుంచి వినియోగ ధ్రువీకరణ పత్రాలు ఇంకా ఇవ్వలేదు. 2010-11లో రూ.34,250 వంతున 590 పాఠశాలలకు రూ.2.02కోట్లు విడుదలయ్యాయి. ఆ నిధులను ఖర్చు పెట్టిన 45 పాఠశాలల నుంచి యూసీలు రాలేదు. 2011-12లో 590 పాఠశాలలకు రూ. 50వేల వంతున రూ.2,95 కోట్లు ఇచ్చారు. ఇంకా 60 పాఠశాలల నుంచి నిధులను ఖర్చు పెట్టినట్లు వినియోగతపత్రం ఇవ్వలేదు. 2012-13లో 590 పాఠశాలలకు రూ. 15వేల వంతున రూ. 88.50లక్షలు కేటాయించగా.. 2013-14కు గాను రూ.55 లక్షలు కేటాయించారు. ఇందుకు సంబంధించిన నిధుల వినియోగంపై ఎటువంటి సమాచారం లేదు. ఖర్చులకు లెక్కే లేదు..! ప్రయోగ శాలలకు ఇచ్చిన నిధులతో గణితం, సామాన్య శాస్త్రం పరికరాలు కొనుగోలు చేయడానికి నిర్దేశిత కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సిందే. ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక కిట్ ఉండాలి. వీటిలో రూ.20-30వేల వరకు వెచ్చించారు. ఆర్వీఎంలో 6-8 వరకు ప్రయోగశాలలకు నిధులు ఇచ్చారు. దాదాపుగా రూ. 25వేలను కేటాయించారు. చాలా వరకు కొనుగోలు చేశారు. అయినా ఈ కోటా నిధులు ఇవ్వడంతో వాటిని మళ్లీ చూపించే అవకాశం ఉంది. అలాగే చేస్తున్నారని సమాచారం. పుస్తకాల కొనుగోలులో తెలుగు అకాడమీ సూచించిన 23 రకాల పుస్తకాలు, జాతీయ పుస్తక ప్రచురణ సంస్థ, ఎన్సీఈఆర్టీ సూచించిన ఇరవై రకాల పుస్తకాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఆర్వీఎంలో కొనుగోలు చేసిన పుస్తకాలను ఈ పథకంలో చూపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కంప్యూటర్ విద్యకు ఐఈజీ (ఈ-గవర్నెన్స్)తో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. అయినా మళ్లీ ఇంటర్ నెట్ పెట్టుకోవడానికి ఈ పథకంలో అవకాశం ఇవ్వడంతో నిధుల దుబారాకు అవకాశం కలిగినటై ్లంది.