విద్య విలువ గురించి విద్యా బాలన్ ఎప్పుడూ చెబుతుంటారు. చెప్పడమే కాదు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని పిల్లలకు సహాయం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి మరో మంచి ప్రయత్నం చేశారు విద్యా బాలన్. దీనికోసం తన చీరను వేలానికి పెట్టారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బు ఢిల్లీకి చెందిన ఓ కమ్యూనిటీ లైబ్రరీకి అందుతుంది. పరిధులను విస్తరించే పుస్తకాలు, అవగాహన కలిగించే పుస్తకాలు కొనుక్కోలేని పిల్లలకు ఈ ఉచిత లైబ్రరీ అవి సమకూరుస్తుంది. కరోనా నేపథ్యంలో లైబ్రరీకి నిధుల కొరత ఏర్పడటంతో విద్యా బాలన్‌లాంటి కొందరు ప్రముఖులను నిర్వాహకులు సంప్రదించారు. వేలం వేయడానికి ఏదైనా వ్యక్తిగత వస్తువు ఇవ్వాల్సిందిగా విద్యాని నిర్వాహకులు కోరగా, తన చీరను ఇచ్చారామె.
‘‘నాకు చీరలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చేనేత చీరలంటే చాలా చాలా ఇష్టం. నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ‘ప్యూర్ టస్సర్’ చీరను ఇచ్చాను’’ అన్నారు విద్యా బాలన్. ఇంకా మాట్లాడుతూ– ‘‘పుస్తకాలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. తరగతి గదిలో మనం నేర్చుకున్నవన్నీ గొప్ప పాఠాలే. తరగతి గది బయట మనం కలిసే వ్యక్తులు, వాళ్లతో మాట్లాడినప్పుడు తెలుసుకునే విషయాలు, పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం ఇవన్నీ మనకు వెలకట్టలేని జీవిత పాఠాలు అవుతాయి. ఇక లైబ్రరీకి వెళితే ప్రపంచాన్ని మరచిపోవచ్చు. లైబ్రరీలో ఉండే సౌలభ్యమే అది. మన దేశంలో ఉచిత లైబ్రరీలు మరిన్ని రావాలి. కానీ దానికి చాలా నిధులు కావాలి. నా వంతుగా నేను చేసిన చిన్న ప్రయత్నం ఇది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment