‘‘గాన కోకిల ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అమ్మాళ్ అంటే నాకు వల్లమాలిన ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆమె కమనీయ కంఠస్వరాన్ని వింటూ పెరిగాను. మా అమ్మ ద్వారా నాకు సుబ్బులక్ష్మి అమ్మ సుప్రభాతం వినడం అలవాటైంది. ఇప్పటికీ నా దినచర్యప్రారంభమయ్యేది ఆ అమ్మ గాంధర్వ గానం వినడంతోనే. ఆమె 108వ జయంతి సందర్భంగా ఆ భారతరత్నానికి నేను సమర్పించగల చిరు కానుక ఇదే’’ అంటూ విద్యాబాలన్ భావోద్వేగపూరితమైనపోస్ట్ పెట్టారు. ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని తలపించేలా నాలుగు రకాల చీరల్లో విద్యాబాలన్ ఫొటోషూట్ చేయించుకున్నారు. ఈ చీరల గురించి ఆమె ఆపోస్ట్‌లో... ‘‘1960–80ల మధ్య ఎమ్మెస్ అమ్మ ఈ తరహా చీరలు ధరించారు. అప్పట్లో ఈ చీరలకు చాలా ప్రాచుర్యం ఉంది.
ఎమ్మెస్ అమ్మ హుందాతనానికి చీరలది సగ భాగం అయితే మిగతా సగం ఆమె నుదుటి పైన కుంకుమ, విభూది, రెండు వైపులా ముక్కు పుడకలు, కొప్పు, కొప్పు చుట్టూ మల్లెపువ్వులకు దక్కుతుంది’’ అని పేర్కొన్నారు విద్యాబాలన్. కాగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా తయారు కావడానికి ఆమె మనవరాలు, ప్రఖ్యాత ఫ్లూటిస్ట్ సిక్కీ మాలా సహాయం చేశారట. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘‘నేను మనస్ఫూర్తిగా సంకల్పించుకున్న ఈ ప్రయత్నానికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సిక్కీమాలా మేడమ్. అలాగే నా ఈ కల సాకారం కావడానికి కారణమైన అనూపార్థసారథి (కాస్ట్యూమ్ డిజైనర్)కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా చాలదు.
భారతీయ గానకోకిల, భారతరత్న డా. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి విలక్షణమైన శైలికి నివాళిగా ఈ చిత్రమాలికను విడుదల చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు విద్యాబాలన్. కాగా ఎమ్మెస్‌గా విద్య చక్కగా ఒదిగి΄ోయారంటూ ఈ ఫొటోషూట్‌కి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే... ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా సినిమా రూపొందించడానికి బాలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ గాన కోకిలగా ఫలానా తార నటించనున్నారంటూ వచ్చిన వార్తల్లో విద్యాబాలన్ పేరు కూడా ఉంది. తాజా ఫొటోషూట్ చూస్తే ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్ న్యాయం చేయగలరనిపించక మానదు. మరి... వెండితెర సుబ్బులక్ష్మిగా ఎవరు కనిపిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment