బ్రెజీలియా: చట్టం ముందు అందరూ సమానులే అనే నిబంధనను బ్రెజిల్ కచ్చితంగా అమలు చేసింది. ఎందుకంటే రూల్స్ పాటించలేదని ఆ దేశ అధ్యక్షుడి మీదే కేసు పెట్టారు అక్కడి అధికారులు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా బ్రెజిల్ దేశం అల్లాడిన సంగతి తెలిసిందే. గతంలో విపరీతంగా కరోనా కేసులు, మరణాలు పెరగడంతో ఆ దేశ అధ్యక్షుడు ఏం చేయలేని పరిస్థితి అంటూ కంటతడి కూడా పెట్టుకున్నారు. అంతటి విధ్వంసం జరిగనప్పటికీ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు కోవిడ్ రూల్స్ పాటించకపోవడం అక్కడి అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిబంధనలు పాటించకపోవడం ఫలితంగా ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది.
'చబ్బీ డిక్టేటర్' అంటూ సంబోధించారు
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని మారన్‌హవో రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం వందమందికిపైగా పాల్గొనే సమావేశాల జరపకూడదని నిషేధం ఉంది. వీటితో పాటు మాస్క్ ధరించని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మారన్‌హవో రాజధాని సావో లూయిస్ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాస్క్ కూడా ధరించలేదు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ అధినేతను 'చబ్బీ డిక్టేటర్' అంటూ సంబోధించారు.
దీనిపై మారన్‌హవో రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో స్పందించారు. ఆ ప్రాంతంలో ఉన్న కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు గాను అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని గవర్నర్ స్పష్టంచేశారు. అయితే, అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినప్పటికీ దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు 15రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Ryanair: ‘కిటికీ తెరిచే అవకాశం ఉంటే, కిందకి దూకేవాడేమో’
Comments
Please login to add a commentAdd a comment