మీరు ఎంతో ఇష్టపడి ఓ జాబ్ చేస్తున్నారు. అలా అని హాలిడేస్‌లో కుటుంబ సభ్యులతో గడిపే సమయంలో ఆఫీస్‌లో ఆ వర్క్ ఉంది.. ఈ వర్క్ ఉంది అని కొలీగ్స్ నుంచి లేదంటే బాస్ నుంచి పొద్దస్తమానం ఫోన్స్, ఈమెయిల్స్, ఫోన్ నోటిఫికేషన్లు వస్తుంటే చిరాకుగా ఉంటుంది కదా. ఇదిగో ఇకపై ఉద్యోగుల్ని ఇలాంటి ఇబ్బందులు పడకుండా.. తోటి సహచర ఉద్యోగులు ఇబ్బంది పెట్టకుండా ఉండేలా సంస్థలు కొత్త కొత్త పాలసీలను అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి.
ఇంతకీ ఆ పాలసీ ఏంటని అనుకుంటున్నారా? సెలవుల్లో ఉన్న ఉద్యోగికి.. తోటి సహచర ఉద్యోగులు ఆఫీస్ వర్క్ విషయంలో ఇబ్బంది పెట్టకూడదు. అలా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకునేందుకు పాలసీలపై కసరత్తు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్ 11 కొత్త పాలసీని తన సంస్థ ఉద్యోగులకు అమలు చేసింది. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే?.. ఆఫీస్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆఫీస్ నుంచి అతని కొలీగ్స్ కానీ, బాస్‌లు కానీ ఎవరైనా సరే ఆఫీస్ వర్క్ అని ఇబ్బంది పెట్టకూడదు. ఒక వేళ ఇబ్బంది పెడితే డిజిగ్నేషన్‌తో సంబంధం లేకుండా బాస్‌తో సహా అందరికి లక్షరూపాయిలు జరిమానా విధిస్తున్నాం’ అంటూ కొత్త పాలసీ గురించి లింక్డిన్‌లో పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా డ్రీమ్ 11 కంపెనీ ఫౌండర్ హర్ష్ జైన్, భవిత్ శేట్‌లు మాట్లాడుతూ..లీవ్‌లో ఉన్న ఉద్యోగికి వారం రోజుల పాటు ఆఫీస్‌తో సంబంధం ఉండకూడదు. మెయిల్స్, మెసేజెస్, వాట్సాప్ గ్రూప్ మెసేజెస్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అసలు ఇంట్లో ఉంటే ఆఫీస్ వర్క్ అనే మాటే ఊసెత్తకూడదు.
ఇలా కొత్త పాలసీని అమలు చేయడం వల్ల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విశ్రాంతి తీసుకోవచ్చు. తద్వారా మానసిక స్థితి, జీవన ప్రమాణాల నాణ్యత, వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని అర్ధం చేసుకున్నాం. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment