సెల్ఫీల మోజులో ఆపదలను కొని తెచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. ప్రపంచంలో ప్రతీ ఏటా నమోదు అవుతున్న సెల్ఫీ మరణాల్లో.. మన దేశం వాటా ఎక్కువగానే ఉంటోంది. పైగా వర్షాకాలం సీజన్‌లో టూరిస్ట్ ప్రాంతాలకు క్యూ కడుతుండడం వల్ల ఇవి మరింత ఎక్కువగా నమోదు అవుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ జిల్లాలో సెల్ఫీలపై పూర్తి నిషేధం విధించారు.
సూరత్: గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాత్పుర లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆ నోటిఫికేషన్‌లో అధికారులు హెచ్చరించారు. ఈమేరకు జూన్ 23నే అదనపు కలెక్టర్ పేరిట పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీటి ప్రవాహాల ప్రాంతాలను సెల్ఫీ బ్యాన్ ఏరియాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వర్షాకాలం కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున.. బట్టలు ఉతకడం, ఈత, స్నానం చేయడం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
గతంలో 2019లో వాఘై-సాపుతరా హైవేపై సెల్ఫీలను దిగడం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావిస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడమనే వంకతో.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కరోనా నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో ప్రస్తుతం దంగ్ టూరిస్ట్ ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ నిషేధాజ్ఞలు జారీ కావడం కొసమెరుపు. ఇక ఈ స్ఫూర్తితో తమ దగ్గర ఇలాంటి ఇలాంటి చట్టం తేవాలని కేరళలోని టూరిస్ట్ ప్రాంతాల ఊర్లు కొన్ని డిమాండ్ చేస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment