Selfie Ban
-
సెల్ఫీలు దిగితే క్రిమినల్ కేసు.. నోటిఫికేషన్ విడుదల
సెల్ఫీల మోజులో ఆపదలను కొని తెచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. ప్రపంచంలో ప్రతీ ఏటా నమోదు అవుతున్న సెల్ఫీ మరణాల్లో.. మన దేశం వాటా ఎక్కువగానే ఉంటోంది. పైగా వర్షాకాలం సీజన్లో టూరిస్ట్ ప్రాంతాలకు క్యూ కడుతుండడం వల్ల ఇవి మరింత ఎక్కువగా నమోదు అవుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ జిల్లాలో సెల్ఫీలపై పూర్తి నిషేధం విధించారు. సూరత్: గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాత్పుర లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆ నోటిఫికేషన్లో అధికారులు హెచ్చరించారు. ఈమేరకు జూన్ 23నే అదనపు కలెక్టర్ పేరిట పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీటి ప్రవాహాల ప్రాంతాలను సెల్ఫీ బ్యాన్ ఏరియాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వర్షాకాలం కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున.. బట్టలు ఉతకడం, ఈత, స్నానం చేయడం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో 2019లో వాఘై-సాపుతరా హైవేపై సెల్ఫీలను దిగడం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావిస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడమనే వంకతో.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కరోనా నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో ప్రస్తుతం దంగ్ టూరిస్ట్ ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ నిషేధాజ్ఞలు జారీ కావడం కొసమెరుపు. ఇక ఈ స్ఫూర్తితో తమ దగ్గర ఇలాంటి ఇలాంటి చట్టం తేవాలని కేరళలోని టూరిస్ట్ ప్రాంతాల ఊర్లు కొన్ని డిమాండ్ చేస్తుండడం విశేషం. చదవండి: ఫోన్ చోరీ.. సెల్ఫీలు చూసి వ్యక్తి షాక్! -
సెల్ఫీ కాదు సెల్ఫిష్
స్మార్ట్ ఫోన్ యుగంలో అందరికీ ఫాస్ట్‌గా కనెక్ట్ అయిన ట్రెండ్ సెల్ఫీ. ఇదివరకు సెలబ్రిటీలు కనిపిస్తే ఆటోగ్రాఫ్‌లు అడిగేవారు. ఇప్పుడంతా సెల్ఫీమయం. కానీ స్టార్ సింగర్ ఏసుదాస్‌కి ఈ సెల్ఫీ ట్రెండ్ నచ్చినట్టు లేదు. అందుకేనేమో ‘సెల్ఫీ కాదు సెల్ఫిష్’ అన్నారాయన. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు ఏసుదాస్. ఆయన కనపడటంతో మీడియా, అభిమానులు చుట్టుముట్టారు. ఆ సమయంలో ఓ అభిమాని తన ఫేవరెట్ సింగర్‌తో ఓ సెల్ఫీ తీసుకుందాం అనుకుని సెల్ఫీ తీసుకున్నాడు. వెంటనే ఏసుదాస్ ఆ సెల్ఫీ తీసుకున్న అభిమానిని ఫొటో డిలిట్ చేయమని అడిగారు. అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని ఆ ఫొటో డిలిట్ చేస్తూ ‘ఇది సెల్ఫీ కాదు సెల్ఫిష్’ అన్నారు. దీన్నిబట్టి ఏసుదాస్‌కి సెల్ఫీ అంటే ఏమాత్రం ఇష్టం లేదని అర్థం చేసుకోవచ్చు. -
జాగ్రత్త.. అక్కడ సెల్ఫీ తీసుకోకూడదు!
ముంబై: దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరం బీచ్‌లకు కూడా ప్రసిద్ధి. నగరంలోని ప్రముఖ మెరైన్ డ్రైవ్, చౌపత్తి బీచ్‌లకు ఈసారి వెళితే.. ప్రశాంతంగా సముద్రం అందాల్ని ఆస్వాదించండి. కాళ్లను తాకే అలలను ప్రేమించండి. అంతేకానీ ఆ పరిసరాల్ని చూసి.. ముచ్చటపడి సెల్ఫీలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఈ రెండు బీచుల్లో ఇప్పుడు సెల్ఫీలు తీసుకోవడం నిషేధం. ఇటీవల ముంబైలోని ఓ బీచ్‌లో తన స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకోబోయి ఒక అమ్మాయి సముద్రంలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా సముద్ర కెరటాల్లో కొట్టుకుపోయారు. ఇలా ఓ సెల్ఫీ మోజు ఇద్దరి ప్రాణాలను తీసిన నేపథ్యంలో ముంబై పోలీసులు నగరంలోని 15 ప్రదేశాలను ప్రమాదకరమైన సెల్ఫీ స్పాట్లుగా గుర్తించారు. ఆ ప్రదేశాల్లో పొరపాటును కూడా సెల్ఫీ తీసుకోకూడదని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. సెల్ఫీలు నిషేధించిన ప్రదేశాల్లో దాదర్, జుహూ బీచ్‌ల్లోని ముందలి ప్రదేశాలు, బాంద్రా బ్యాండ్‌స్టాండ్, వర్లి, బాంద్రాలోని చారిత్రక కోటలు ఉన్నాయి. 'ఈ ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోరాదని, సెల్ఫీలకు ఇవి ప్రమాదకరమైనవని పేర్కొంటూ ఆయా పర్యాటక ప్రాంతాల్లో సైన్‌బోర్డులు, హెచ్చరికలు పెట్టాల్సిందిగా కోరుతూ మేం ముంబై మున్సిపాలిటీకి లేఖ రాయనున్నాం' అని ముంబై పోలీసు అధికార ప్రతినిధి ధనంజయ్ కులకర్ణి తెలిపారు. అయితే ఈ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి సెల్ఫీలు తీసుకొనే వాళ్లపై ఇప్పటికిప్పుడు జరిమానాలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే నిషేధాజ్ఞలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ట్విట్టర్, సోషల్ మీడియాలోని తమ ఖాతాలను వినియోగించుకుంటామని తెలిపారు.