జాగ్రత్త.. అక్కడ సెల్ఫీ తీసుకోకూడదు! | Beware: No Selfies By The Mumbai Sea! | Sakshi
Sakshi News home page

జాగ్రత్త.. అక్కడ సెల్ఫీ తీసుకోకూడదు!

Published Tue, Jan 12 2016 5:05 PM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM

జాగ్రత్త.. అక్కడ సెల్ఫీ తీసుకోకూడదు! - Sakshi

జాగ్రత్త.. అక్కడ సెల్ఫీ తీసుకోకూడదు!

ముంబై: దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరం బీచ్‌లకు కూడా ప్రసిద్ధి. నగరంలోని ప్రముఖ మెరైన్ డ్రైవ్, చౌపత్తి బీచ్‌లకు ఈసారి వెళితే.. ప్రశాంతంగా సముద్రం అందాల్ని ఆస్వాదించండి. కాళ్లను తాకే అలలను ప్రేమించండి. అంతేకానీ ఆ పరిసరాల్ని చూసి.. ముచ్చటపడి సెల్ఫీలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఈ రెండు బీచుల్లో ఇప్పుడు సెల్ఫీలు తీసుకోవడం నిషేధం.

ఇటీవల ముంబైలోని ఓ బీచ్‌లో తన స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకోబోయి ఒక అమ్మాయి సముద్రంలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా సముద్ర కెరటాల్లో కొట్టుకుపోయారు. ఇలా ఓ సెల్ఫీ మోజు ఇద్దరి ప్రాణాలను తీసిన నేపథ్యంలో ముంబై పోలీసులు  నగరంలోని 15 ప్రదేశాలను ప్రమాదకరమైన సెల్ఫీ స్పాట్‌లుగా గుర్తించారు. ఆ ప్రదేశాల్లో పొరపాటును కూడా సెల్ఫీ తీసుకోకూడదని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు.  

సెల్ఫీలు నిషేధించిన ప్రదేశాల్లో దాదర్, జుహూ బీచ్‌ల్లోని ముందలి ప్రదేశాలు, బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌, వర్లి, బాంద్రాలోని చారిత్రక కోటలు ఉన్నాయి. 'ఈ ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోరాదని, సెల్ఫీలకు ఇవి ప్రమాదకరమైనవని పేర్కొంటూ ఆయా పర్యాటక ప్రాంతాల్లో సైన్‌బోర్డులు, హెచ్చరికలు పెట్టాల్సిందిగా కోరుతూ మేం ముంబై మున్సిపాలిటీకి లేఖ రాయనున్నాం' అని ముంబై పోలీసు అధికార ప్రతినిధి  ధనంజయ్‌ కులకర్ణి తెలిపారు. అయితే ఈ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి సెల్ఫీలు తీసుకొనే వాళ్లపై ఇప్పటికిప్పుడు జరిమానాలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే నిషేధాజ్ఞలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ట్విట్టర్‌, సోషల్ మీడియాలోని తమ ఖాతాలను వినియోగించుకుంటామని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement