న్యూఢిల్లీ: రుణం పూర్తి చెల్లింపుల తర్వాత రుణానికి సంబంధించి తనఖాగా ఉంచిన ఒరిజినల్ స్థిర లేదా చర ఆస్తి పత్రాలు అన్నింటినీ రుణగ్రహీతకు 30 రోజుల లోపు తిరిగి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు స్పష్టం చేసింది. ఏదైనా ఆలస్యం జరిగితే రోజుకు రూ. 5 వేలు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన చార్జీలను అన్నింటినీ నిర్దేశిత 30 రోజుల్లో తీసివేయాలని కూడా ఒక నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఈ తరహా పలు ఫిర్యాదుల నమోదు నేపథ్యంలో బ్యాంకింగ్ రెగ్యులేటర్ తాజా ఆదేశాలు ఇచి్చంది. డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వడంలో నెల రోజులు దాటితే ఈ జాప్యానికి స్పష్టమైన కారణాలను రుణగ్రహీతకు తెలియజేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడానికి సంబంధించిన విధివిధానాల వివరాలను బ్యాంకింగ్ లేదా ఆర్థిక సంస్థలు తమ తమ వెబ్‌సైట్‌లో ఉంచాలని సూచించింది.
నష్టం జరిగితే.. మరో 30 రోజులు
ఒరిజినల్ చర లేదా స్థిర ఆస్తి పత్రాలు కనబడకుండా పోవడం లేదా ఏదైనా నష్టం జరిగితే అటువంటి పత్రాల డూప్లికేట్ లేదా సరి్టఫైడ్ కాపీలను పొందడంలో రుణగ్రహీతకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పూర్తిగా సహాయపడాలని కూడా ఆర్‌బీఐ నిర్దేశించింది. ఇందుకు మరో 30 రోజుల సమయాన్ని తీసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాతే (60 రోజుల తర్వాత) జాప్యానికి రోజుకు రూ.5 వేల పరిహారం నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. కాగా, ఈ పరిహారం... ఇతర ఏదైనా (వర్తించే) చట్టం ప్రకారం ఏదైనా ఇతర పరిహారం పొందేందుకు రుణగ్రహీత కు ఉండే హక్కులకు ఎటువంటి భంగం కలిగించబోదని ఆర్‌బీఐ స్పష్టం చేయడం గమనార్హం. 2023 డిసెంబరు 1 తర్వాత ఒరిజినల్ చర లేదా స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ తాజా ఆదేశాలు వర్తిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment