సాక్షి, హైదరాబాద్: ‘‘ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఓ ప్రమాద హెచ్చరిక. కరోనా మొదటి, రెండో వేవ్‌లలో ఎలాంటి హెచ్చరికలు రాలేదు. కానీ ఇది హెచ్చరికలు చేసింది. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుందాం. తద్వారా కొత్త వేరియంట్‌ను తరిమికొడదాం. మూడో వేవ్ రాకుండా చూసుకుందాం’’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కరోనా కొత్త వేరియంట్, రాష్ట్రంలో జాగ్రత్తలు తదితర అంశాలపై గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోందని.. ఆంక్షలు పెట్టినా కొద్దిరోజుల్లోనే నాలుగు దేశాల నుంచి 24 దేశాలకు పాకిందని తెలిపారు. అందువల్ల అందరూ మాస్కులు పెట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని స్పష్టం చేశారు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. తక్కువ వ్యాక్సిన్లు వేసిన జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని.. రెండు మూడు రోజుల్లో ఉన్నతస్థాయి అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుందని చెప్పారు.
మన ప్రవర్తన మీదనే కొత్త వేరియంట్ల వ్యాప్తి ఆధారపడి ఉందన్నారు. పండుగలు, ఫంక్షన్లను జాగ్రత్తల నడుమ చేసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో 48 మంది, ఖమ్మం జిల్లాలో 28 మంది విద్యార్థులకు కరోనా వచ్చిందని.. ఒక జిల్లా వైద్యాధికారికీ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
యూకే నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్
బుధవారం యూకే, సింగపూర్ దేశాల నుంచి 325 మంది రాష్ట్రానికి వచ్చారని.. అందులో తెలంగాణకు చెందినవారు 239 మంది ఉన్నారని శ్రీనివాసరావు తెలిపారు. యూకే నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆమెను టిమ్స్ ఆస్పత్రికి తరలించామని.. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని వివరించారు. ఆమె శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని, రెండు మూడు రోజుల్లో ఫలితం వస్తుందని వెల్లడించారు. మిగతా ప్రయాణికులకు నెగెటివ్ వచ్చిందని.. అయినా వారందరికీ మరో ఏడెనిమిది రోజుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తామని తెలిపారు.
శంషాబాద్‌లో పకడ్బందీగా పరీక్షలు
‘ఒమిక్రాన్’ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులందరినీ స్క్రీనింగ్ చేస్తున్నారు. కొత్త వేరియంట్ ఉన్న దేశాల నుంచి వస్తున్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. వాటి ఫలితాలు వచ్చేదాకా ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే.. గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
♦రాష్ట్రంలో 25 లక్షల మందికిపైగా రెండో డోస్ తీసుకోలేదు. అందులో 15 లక్షల మందికిపైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నారు. వారంతా రెండో డోస్ తీసుకోవాలి.
వ్యాక్సిన్ వేసుకోకపోవడం ఆత్మహత్యతో సమానం
రాష్ట్రంలో 80 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం మనకుందని.. కానీ రెండున్నర లక్షలకు మించి తీసుకోవడం లేదని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోకపోవడం ఆత్మహత్యతో సమానమని వ్యాఖ్యానించారు.
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ రావడానికి అక్కడ వ్యాక్సినేషన్ సరిగా జరగకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజలంతా విధిగా మాస్కులు పెట్టుకోవాలని.. ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించాలని పోలీసు శాఖను కోరామని తెలిపారు. రాష్ట్రంలో రెండు మూడు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment