
న్యూఢిల్లీ: ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఐదు పేజీల తీర్పును సవాలు చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు రూపంలో సుప్రీంకోర్టులో ఏకంగా 60 పేజీల సినాప్సిస్ (సారాంశం) సమర్పించాడో వ్యక్తి! దీనిపై విస్మయం వ్యక్తం చేయడం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం వంతయింది.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పిటిషన్‌దారుకు రూ.25 వేల జరిమానా కూడా విధించింది! ఆ మొత్తాన్ని ఏదన్నా స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆరోగ్య కారణాలతో అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి సుదీర్ఘ దరఖాస్తులపై సుప్రీంకోర్టు గతేడాది అసహనం వ్యక్తం చేసింది. వాటిలో పేజీల సంఖ్యపై తక్షణం పరిమితి విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.