సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛనగరం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) అధికారులు సరికొత్త చర్యలు చేపట్టనున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. చెత్త వేసేవారిని గుర్తించి చలానాలు విధించనున్నారు. దీనిపై త్వరలో కార్యాచరణ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టినా, పలు ర్యాంకులు సాధించినా నగరంలో ‘చెత్త’శుద్ధి కనిపించడంలేదు. తడి–పొడి చెత్తలు వేరుచేసి వేసేందుకు ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలు పంపిణీ చేసినా ప్రయోజనం కనిపించడంలేదు. వ్యక్తులు, గృహిణులే కాక పలు కంపెనీలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, మాల్స్ నిర్వాహకులు ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన చెత్త కుమ్మరిస్తున్నారు.
నానా రకాల వ్యర్థాల్ని నాలాల్లో విసురుతున్నారు. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు దిండ్లు , దుప్పట్లు తదితరమైనవి వాటిల్లో వేస్తుండటంతో వర్షపునీరు పారే దారి లేక పొంగిపొర్లుతోంది. ఇకపై ఇలాంటి వాటికి తావులేకుండా అధికారులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక యాప్‌ను కూడా త్వరలో వినియోగంలోకి తేనున్నారు. జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందికి ట్యాబ్‌లు లేదా స్మార్ట్‌ఫోన్లు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారబోస్తున్న వ్యక్తులు, వాహనాల ఫొటోలను నిఘా సిబ్బంది తీసి సంబంధిత యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. వాటిని ఆన్‌లైన్ ద్వారా జోనల్ కార్యాలయాల్లోని అధికారులు గుర్తిస్తారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్త, వ్యర్థాలు వేసిన వారికి చలానాలు జారీ చేస్తారు. అవి నేరుగా వారి చిరునామాలకు చేరుతాయి.
తొలిదశలో హోటళ్లు,ఫంక్షన్‌హాళ్లపై నజర్
చెత్త వేసే వ్యక్తులను గుర్తించడం కష్టం కనుక తొలిదశలో హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసే ఇతర సంస్థలను గుర్తిస్తారు. వాటికి చలానాలు జారీ చేస్తారు. ఇందుకుగాను ఆస్తిపన్ను గుర్తింపు నంబర్(పీటీఐఎన్) వంటి వాటిని కూడా వినియోగించుకుంటారు. చలానాలు చెల్లించనిపక్షంలో సదరు మొత్తాన్ని ఆస్తిపన్నులో కలిపే ఆలోచనలోనూ అధికారులున్నారు. తొలిదశలో ఎక్కువ చెత్తను వెలువరించే సంస్థలు, హోటళ్లపై దృష్టి సారించనున్నారు. చెత్తతోపాటు నిర్మాణవ్యర్థాలు వేసేవారిని, రోడ్లపై వ్యర్థజలాలు వదిలేవారిని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ఫొటోలతోసహా పట్టుకుంటారు. పోస్టర్లతో భవనాలను పాడుచేసేవారిని, గోడలపై రాతలు రాసేవారిని కూడా గుర్తిస్తారు.
వీరికి మలిదశలో చలానాలను జారీ చేయనున్నారు. ఉల్లంఘనలను గుర్తించేందుకు ఒక్కో సర్కిల్‌లో 5 నుంచి 10 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందిని నియమించనున్నారు. వీటితోపాటు పోలీసుల సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఉల్లంఘనులకు కూడా చలానాలు జారీ చేసే వీలుంది. బహిరంగ మూత్ర విసర్జన, ప్లాస్టిక్ వినియోగం, అనుమతి లేని బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాతలు తదితరమైన వాటికి కూడా చలానాలు విధించనున్నారు. జరిమానాలిలా.. జీహెచ్‌ఎంసీ యాక్ట్, నిబంధనల మేరకు ఏ ఉల్లంఘనలకు ఎంత జరిమానా విధించవచ్చో స్పష్టంగా ఉంది. వాటిల్లో స్వల్పమార్పులు చేసి ఈ చలానాల విధానాన్ని అధికారులు అందుబాటులోకి తేనున్నారు.
ఉల్లంఘనలకు విధించనున్న జరిమానాలు
Comments
Please login to add a commentAdd a comment