సెబీ ఛైర్మన్‌పై ప్రభుత్వ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ : క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ సెబీ ఛైర‍్మన్ పదవికాలంపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తదుపరి సెబీ చీఫ్ అజయ్ త్యాగి (58)పదవీకాలంలో కోత పెట్టింది. సాదారణంగా అయిదేళ్లు ఉండే సెబీ ఛైర‍్మన్ పదవీకాలానికి భిన్నంగా త్యాగిపదవీకాలంలో రెండేళ్లను తగ్గించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంవెనక కారణాలను మాత్రం వెల్లడించలేదు. సెబీ చీప్‌గా త్యాగి పేరును ప్రకించిన వారం తరువాత ప్రభుత‍్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో సెబీ చీఫ్‌గా త్యాగి మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన త్యాగి, అర్థశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ 1984 బ్యాచ్ ఐఎఎస్ కేడర్ కు చెందిన ఈయన ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (పెట్టుబడి) గా పనిచేస్తున్నారు. అలాగే స్వల్పం కాలం పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో సభ్యుడుగా కూడా ఉన్నారు. త్వరలోనే ఆయన సెబీ చీఫ్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఫిబ్రవరి 10న త్యాగి నియామకానికి ఆమోదం తెలిపింది.
యూపీఏ ప్రభుత‍్వం ఆధ‍్వర్యంలో 2011 ఫిబ్రవరి 18న నియమితుడైన ప్రస్తుత చీఫ్ యుకె సిన్హా పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగించడంతో ఆరు సంవత్సరాలకు పైగాపదవిలో కొనసాగారు. అంతేకాదు డి.ఆర్. మెహతా (1995 -2002) తర్వాత ఎక్కువ కాలంలో సెబీ చీఫ్ పదివిలో వున్న రెండవ వ్యక్తిగా నమోదయ్యారు. యుకె సిన్హా పదవీకాలం మార్చి 1,2017 న ముగియనుంది.
కాగా సెబీ, స్టాక్ ఎక్సేంజ్ లనునియంత్రించడంతోపాటు, వేల లిస్టెడ్ కంపెనీలు, బ్రోకర్లు సహా వివిధ మార్కెట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐలు ,రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను సెబీ పర్యవేక్షిస్తుంది.