
ఆర్‌ఈసీ ఇష్యూ 5 రెట్లు సబ్‌స్క్రిప్షన్
ప్రభుత్వ ఖజానాకు రూ. 1,550 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) ఆఫర్ ఫర్ సేల్‌కు భారీ స్పందన లభించింది. ఇష్యూ 5.5 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. దీంతో ఖజానాకు రూ. 1,550 కోట్లు రానున్నాయి. 5 శాతం వాటాల కింద మొత్తం 4.93 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కారణంగా 27.31 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరుకి రూ. 315 కనీస ధర ప్రకారం ప్రభుత్వానికి ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 1,550 కోట్లు లభించనున్నాయి. ఆఫర్ మొదలైన గంటలోపే పూర్తి స్థాయిలో సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం. ఆర్‌ఈసీ ఇష్యూకి మొత్తం రూ. 7,621 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయి.
ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 3,415 కోట్ల మేర, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 4,734 కోట్ల మేర బిడ్లు దాఖలు చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీల గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఉద్దేశించిన షేర్లు 9.02 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. సాధారణ కేటగిరీ 4.66 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఆర్‌ఈసీ ఇష్యూకి సంతృప్తికరమైన స్పందన లభించిందని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం సెక్రటరీ ఆరాధన జోహ్రి తెలిపారు. కంపెనీ షేరు బుధవారం బీఎస్‌ఈలో 2.61 శాతం బలపడి రూ. 330.05 వద్ద ముగిసింది. షేరు కేటాయింపు ధర రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 325.10గాను, సంస్థాగత ఇన్వెస్టర్లకు రూ. 324.73గాను ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా వాటాల విక్రయంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 60.64 శాతానికి తగ్గింది.