
మార్కెట్‌కు దూరంగానే రిటైల్ ఇన్వెస్టర్లు..!
ముంబై: ఒకవైపు ఈక్విటీ సూచీలు లైఫ్ టైం హైలో ర్యాలీ జరుపుతున్నా, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్‌కు దూరంగానే ఉన్నారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మార్కెట్ భవిష్యత్ దిశానిర్దేశం అనిశ్చితిగా ఉండడమే ఇందుకు కారణమని ఫండ్ మేనేజర్లు అంటున్నారు. కొందరు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉందని, తద్వారా చెల్లింపులపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడప్పుడే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం తక్కువని.. మార్కెట్ స్థిరీకరణ కనబరిస్తే పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని బరోడా పయనీర్ మ్యూచువల్ ఫండ్ ఎండీ జైదీప్ భట్టాచార్య తెలిపారు. కాగా, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరుతో సెన్సెక్స్ శుక్ర ,ఆదివారాలు రికార్డు స్థాయికి పెరిగి ముగిసింది. ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో 35 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఫండ్స్ నుంచి పెట్టుబడులు వెనక్కితీసుకున్నారు. గతేడాది ఎఫ్‌ఐఐల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఏర్పడ్డ ర్యాలీ చివరలో ప్రవేశించి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్నారు. ఈ నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగానే ఉండే అవకాశం ఉందని, మూలధన రక్షణ కల్పించే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ వైపునకు మొగ్గుచూపొచ్చని ఎల్‌ఐసీ నోమురా ఎంఎఫ్ సీఈఓ నిలేష్ సేత్ తెలిపారు.