చిన్న షేర్లు.. కిర్రాకు! | Research and Markets | Sakshi
Sakshi News home page

చిన్న షేర్లు.. కిర్రాకు!

Published Tue, Jan 14 2014 12:57 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

Research and Markets

దేశీ స్టాక్ మార్కెట్లలో మళ్లీ చిన్న షేర్ల హవా మొదలైంది. గత రెండేళ్లలో మార్కెట్లలో కనిపించిన ట్రెండ్‌కు పూర్తి భిన్నంగా ఇటీవల చిన్న, మధ్య తరహా షేర్లు లాభాలతో దూసుకెళుతున్నాయి. నిజానికి గడిచిన రెండేళ్లలో మార్కెట్ల నడకను ప్రతిబింబించే సెన్సెక్స్, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు సమీపంలోనే కదిలినప్పటికీ మధ్య, చిన్న తరహా షేర్లు ఏరోజుకారోజు కొత్త కనిష్టాలను చవిచూస్తూ వచ్చాయి. దీంతో దీపావళికి సెన్సెక్స్ 21,300 పాయింట్లను దాటినా మిడ్, స్మాల్ క్యాప్స్ షేర్లు నేలచూపులు చూడటంతో మార్కెట్ల మొత్తం విలువ కూడా దిగజారింది. మార్కెట్ల నుంచి కనుమరుగయ్యే పరిస్థితులు కూడా తలెత్తాయి. బ్రోకింగ్ సంస్థలు సైతం వ్యాపారాల్లేక మూతపడే స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ ట్రెండ్‌కు చెక్ పెడుతూ గత నాలుగు నెలల్లో మిడ్, స్మాల్ క్యాప్స్‌లో కొనుగోళ్ల సందడి ఊపందుకుంది. గడిచిన 4 నెలల్లో సెన్సెక్స్  17% పుంజుకోగా, మిడ్ క్యాప్ 26%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 28% చొప్పున దూసుకెళ్లడం గమనార్హం.
 
 కొన్ని షేర్లు 410% వరకూ...
 సెన్సెక్స్‌ను మించి హైజంప్ చేస్తున్న కంపెనీల షేర్లలో రాష్ట్రానికి చెందినవీ ఉన్నాయ్. వీటిలో డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్ షేరు 230% లాభాలను అందిస్తే, అల్ఫాజియో 200% ఎగసింది. ఇక అరబిందో ఫార్మా, ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రెజైస్ 100% పైగా పురోగమించగా, జీఎంఆర్, జీవీకే, ల్యాంకో 50% స్థాయిలో లాభపడ్డాయి. ఇతర షేర్లలో బీఎప్‌యుటిలిటీస్ 410% దూసుకెళ్లగా,  వినతీ ఆర్గానిక్స్ పెట్రాన్, డిష్‌మ్యాన్, టాటా ఎలక్సీ, ఇండొకో, అబాన్ ఆఫ్‌షోర్, డెల్టా కార్ప్, అరవింద్ వంటి షేర్లు 100-150% మధ్య జంప్‌చేశాయి. ఈ ట్రెండ్‌లో సింటెక్స్ సైతం 90% లాభపడటం విశేషం!
 
 జరిగిందేమిటి?
 కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగించడం, ముడిసరుకుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, వినియోగం పడిపోవడం వంటి పలు అంశాలు... చిన్న, మధ్య తరహా కంపెనీల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ వచ్చాయి. మరోవైపు ప్రపంచానికి దిక్సూచిగా నిలిచే అమెరికాతోపాటు, యూరప్, చైనా ఆర్థిక వ్యవస్థలు డీలాపడటం కూడా దెబ్బకొట్టింది. ఫలితంగా పలు కంపెనీలు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. బ్యాంకుల మొండిబకాయిలు కొండలా పెరుగుతూ వచ్చాయి. దీంతో గత మూడేళ్లలో అటు ఎఫ్‌ఐఐలు, ఇటు దేశీయ ఫండ్స్ కేవలం సెన్సెక్స్, నిఫ్టీలకు ప్రాతినిధ్యం వహించే కొద్దిపాటి బ్లూచిప్స్‌కే పెట్టుబడులను పరిమితం చేశాయి. ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో పెట్టేందుకు వీలుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొన్నేళ్లుగా నెలకు 85 బిలియన్ డాలర్ల నిధులను వ్యవస్థలోకి పంప్ చేస్తూ వచ్చింది. ఈ నిధుల్ని  ఎఫ్‌ఐఐలు భారత్‌లోనూ కుమ్మరించారు. అయితే ఫెడ్ సహాయక ప్యాకేజీని త్వరలో నిలిపేస్తుందని, దీంతో ఎఫ్‌ఐఐల నిధులు వెనక్కి మళ్లుతాయని ఆందోళనలు చుట్టుముట్టడంతో గతేడాది మధ్యలో దేశీ మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆగస్ట్ చివరికి సెన్సెక్స్ 18,000 దిగువకు పడిపోయింది. అప్పటికే భారీగా పతనమైన పలు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు మరింత నీరసించాయి.
 
 మరి ర్యాలీ ఎందుకు?
 సహాయక ప్యాకేజీలో 10 బిలియన్ డాలర్లను మాత్రమే కోత పెట్టనున్నట్లు ఫెడ్ ప్రకటించడం దేశీ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. దీనికితోడు ఆర్‌బీఐ కొత్త గవర్నర్ రాజన్‌పై అంచనాలు పెరిగాయి. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం, లోక్‌సభ ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడొచ్చనే అంచనాలు... ఇన్వెస్టర్లకు కొత్త ఆశలు రేపాయి. కరెంట్ ఖాతా లోటు కట్టడి, సక్రమ రుతుపవనాలు ఎఫ్‌ఐఐలకూ, ఇటు దేశీ సంస్థలకు ఊపునిచ్చాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు వీటికి జత కలవటంతో సెప్టెం బర్ నుంచీ మిడ్, స్మాల్ క్యాప్స్‌లో కొనుగోళ్లు పుంజుకున్నాయి.


 - సాక్షి, బిజినెస్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement