ముగింపులో నష్టాలు..
ముంబై: అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల మధ్య జరిగిన చర్చాగోష్టిలో డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌దే పైచేయికావడంతో మంగళవారం ఉదయం ఆసియా ట్రెండ్‌ను అనుసరించిన లాభాల్లో ప్రారంభమైనా, చివరకు నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ తొలిదశలో 130 పాయింట్లవరకూ పెరిగి 28,433 పాయింట్లస్థాయికి సెన్సెక్స్ ఎగిసింది.
మధ్యాహ్న సమయంలో యూరప్ మార్కెట్లు నష్టపోవడంతో 28,179 పాయింట్ల వద్దకు క్షీణించింది. చివరకు 71 పాయింట్ల నష్టంతో నెలరోజుల కనిష్టస్థాయి 28,224 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 8,769 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి క్రమేపీ తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఒకదశలో 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 17 పాయింట్ల నష్టంతో 8,706 పాయింట్ల వద్ద ముగిసింది.
డెరివేటివ్స్ ముగింపు ప్రభావం....
మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా మార్కెట్లో ఒడుదుడుకులు చోటుచేసుకున్నాయని విశ్లేషకులు చెప్పారు. రోలోవర్స్ కూడా తక్కువగా వున్నాయని, ఇన్వెస్టర్లు రిస్క్‌కు దూరం జర గడమే ఇందుకు కారణమని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. అదాని పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్‌లు 2 శాతం క్షీణించాయి. ఐటీ, ఫార్మా షేర్లు స్వల్పంగా పెరిగాయి.