వరుస లాభాలకు బ్రేక్..
♦ 257 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
♦ నిఫ్టీ 69 పాయింట్లు డౌన్
♦ అంతర్జాతీయ ట్రెండ్ ప్రభావం
♦ ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు
ముంబై: అంతర్జాతీయ ట్రెండ్ ప్రభావంతో భారత్ మార్కెట్ వరుసలాభాలకు బ్రేక్‌పడింది. గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 257 పాయింట్లు పతనమై 26,763 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంత భారీగా క్షీణించడం మూడు వారాల్లో ఇదే ప్రధమం. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 69 పాయింట్ల క్షీణతతో 8,204 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వచ్చేవారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమీక్షా సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు బలహీనపడినందున, ఇక్కడ లాభాల స్వీకరణ జరిగిందని విశ్లేషకులు చెప్పారు. ప్రధాన ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, తైవాన్‌లకు సెలవుకాగా, జపాన్, సింగపూర్ సూచీలు క్షీణతతో ముగియడం, యూరప్ సూచీలు 1 శాతం తగ్గుదలతో ప్రారంభంకావడం భారత్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.
ఇన్ఫోసిస్ దెబ్బ...
ప్రపంచ ట్రెండ్‌కు తోడు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లాభాలపై వార్నింగ్ ఇవ్వడం కూడా సూచీల భారీ క్షీణతకు కారణం. ఆ షేరు గ్యాప్‌డౌన్‌తో మొదలుకావడంతో మిగతా ఐటీ షేర్లు కూడా బలహీనపడ్డాయి. అధిక వీసా వ్యయాలు, వేతనాల భారంతో క్యూ1లో తమ లాభాల మార్జిన్లు 2% వరకూ తగ్గవచ్చంటూ ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీంతో ఈ షేరు 4 శాతంపైగా క్షీణించి రూ. 1,185 వద్ద ముగిసింది. టీసీఎస్ 1.5 శాతం తగ్గింది. మరోవైపు ఇటీవల జోరుగా పెరిగిన ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దాంతో ఐటీసీ, హిందుస్తాన్ యూనీలీవర్‌లు 2-3% మధ్య తగ్గాయి. డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ,బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-2% మధ్య పడిపోయాయి. ఇక కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, సిప్లాలు 1-2% మధ్య పెరిగాయి.