సెన్సెక్స్ 322 పాయింట్లు జంప్
Published Wed, Aug 16 2017 3:58 PM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లోనూ మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 322 పాయింట్ల మేర జంప్ చేసింది. నిఫ్టీ సైతం 100 పాయింట్లకు పైగా పైకి నమోదైంది. 321.86 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 31,770 వద్ద ముగియగా.. ఇంట్రాడేలో 9,900 పైకి ఎగిసిన నిఫ్టీ, చివర్లో ఆ మార్కుకు మూడు పాయింట్ల దూరంలో 9,897 వద్ద క్లోజైంది. నేటి మార్కెట్‌లో సిప్లా, టాటా మోటార్స్, టెక్ మహింద్రాలు ఎక్కువగా లాభపడగా.. ఎన్‌టీపీసీ, ఆసియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్‌లు బాగా నష్టపోయాయి. ఎఫ్‌సీజీ, బ్యాంకు స్టాక్స్ నేటి మార్కెట్లు మంచిగా లాభపడినట్టు విశ్లేషకులు చెప్పారు. బలహీనమైన తొలి త్రైమాసిక ఫలితాలతో కోల్ ఇండియా 2 శాతం మేర నష్టపోయింది.
కొరియా, అమెరికా భౌగోళిక రాజకీయ టెన్షన్లు కాస్త సద్దుమణగడంతో అటు యూరోపియన్ మార్కెట్లు పైకి ఎగిశాయి. అంతేకాక డాలర్ పైకి ఎగియడం ప్రారంభమైంది. డాలర్ పెరుగుతుండటంతో ఇటు బంగారం ధరలు సతమతమవుతున్నాయి. నేటి ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 246 రూపాయల నష్టంలో 28,834 రూపాయలుగా నమోదయ్యాయి. ఒక్క బంగారం మాత్రమే కాక ఇటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పడిపోయింది. మూడు వారాల కనిష్టానికి వెళ్లిన రూపాయి విలువ, ట్రేడింగ్ ఆఖరికి 5 పైసలు బలహీనపడి 64.17గా నమోదైంది.
Advertisement