ముంబై : ప్రపంచ మార్కెట్ల సానుకూల ప్రభావంతో లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, చివరికి చతికిల పడ్డాయి. రోజంతా అస్థిరంగా ట్రేడ్ అయి, నష్టాలతో స్థిరపడ్డాయి. ప్రారంభంలో లాభాల సెంచరీని తాకిన సెన్సెక్స్, చివరికి 99 పాయింట్ల క్షీణతతో 34,346 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో 28 పాయింట్లు నష్టంలో 10,554 వద్ద క్లోజైంది. పీఎన్‌బీలో చోటుచేసుకున్న నీరవ్ మోదీ భారీ కుంభకోణంలో రూ.11,400 కోట్ల అక్రమాలు మాత్రమే కాక, మరో రూ.1300 కోట్ల అక్రమ లావాదేవీలు చోటుచేసుకున్నాయని పీఎన్‌బీ వెల్లడించింది. దీంతో ప్రభుత్వ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి.
ఈ కుంభకోణం మరింత విస్తరించడంతో దేశీయంగా సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు చెప్పారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ 3.5 శాతం పతనమైంది. పీఎస్‌యూ బ్యాంక్స్‌తో పాటు రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్ రంగాలు కూడా 1.7-1 శాతం మధ్య క్షీణించాయి. పీఎన్‌బీ భారీగా 13 శాతం పడిపోయి రూ. 98 దిగువన ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో టాప్ లూజర్లుగా ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంకు, అంబుజా సిమెంట్స్ నష్టాలు గడించగా.. భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లాభ పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment