ముంబై: లాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే నాటికి బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభాలను నమోదుచేసింది. సెన్సెక్స్ 128.27 పాయింట్ల లాభంతో 27,915వద్ద, నిఫ్టీ 37.30 పాయింట్ల లాభంతో 8,365 దగ్గర ముగిసింది. ఫార్మా స్టాక్స్ కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాలను పండించాయి. గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్, అరబిందో ఫార్మా కంపెనీలకు కొత్త జెనరిక్ వెర్షన్ లో కొలెస్ట్రాల్ డ్రగ్ కు అమెరికాలో అనుమతి లభించడంతో, ఈ షేర్లు కొనుగోల జోరు కొనసాగించాయి.
నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.62 లాభపడగా.. గ్లెన్ మార్క్ 2.18శాతం, అరబిందో 3.52శాతం ఎగబాకింది. పిరామల్ ఎంటర్ ప్రైజస్, కాడిలా హెల్త్ కేర్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ లో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అయితే మంగళవారం ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాల్లో విప్రో షేర్లు 5.69శాతం మేర కుప్పకూలాయి. దేశంలోనే మూడో అతిపెద్ద సాప్ట్ వేర్ దిగ్గజంగా ఉన్న విప్రో, విశ్లేషకుల అంచనాలను తాకలేకపోవడంతో షేర్లు పడిపోయినట్టు విశ్లేషకులు చెప్పారు.
అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయ బలహీనంగానే ముగిసింది. 0.07 పైసల నష్టంతో రూ.67.18గా నమోదైంది. ఎంసీఎక్స్ లో 10 గ్రా. పుత్తడి ధర రూ.168 పడిపోయి, 30,926గా ట్రేడ్ అయింది.