
ఏ ప్రభుత్వం వచ్చినా ర్యాలీ ఆగదు
మార్కెట్లు నూతన శిఖరాలను దాటుకొని దూసుకుపోతున్నాయి. మార్కెట్లు ఇంకా పెరుగుతాయా లేక ఎన్నికల తర్వాత పడిపోతాయా అన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతుండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ర్యాలీకి దూరంగానే ఉన్నారు. అసలు ఇది ఎన్నికల ర్యాలీనా, ఫలితాల తర్వాత నిలబడే అవకాశం ఉందా లేదా అనే విషయాలపై ఇద్దరు మ్యూచువల్ ఫండ్ సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’ తో పంచుకున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఎల్‌ఐసీ నోమూరా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుతోష్ బోస్, హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ తుషార్ ప్రధాన్ ఏమంటున్నారో వారి మాటల్లోనే...
ప్రస్తుత ర్యాలీకి ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. మోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాకపోయినా, లేక అనిశ్చితి వాతావరణం ఏర్పడినా ఇవన్నీ స్వల్పకాలికమే. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటం, నాలుగైదేళ్ల నుంచి మార్కెట్ దూరంగా ఉన్న వాళ్లు కూడా ఆసక్తి చూపించడం వంటి అంశాలు మార్కెట్లను మరింత ముందుకు తీసుకెళ్తాయి.
ఆర్థిక వ్యవస్థ మందగమనంపై...
ఆర్థిక వ్యవస్థ పతనం ఆగడమే కాకుండా కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫండ్స్ పథకాల్లోకి పెరుగుతున్న నిధుల ప్రవాహమే దీనికి ఉదాహరణ. ప్రస్తుత మార్కెట్‌కి బయటి భయాలు లేవు కాని దేశీయంగా ఇంకా కొన్ని భయాలు ఉన్నాయి. పారిశ్రామిక వృద్ధితో పాటు, పెట్టుబడులకు దూరంగా ఉన్న వారిలో నమ్మకం పెంచటం తీసుకురావడం ప్రధానమైన ఛాలెంజ్.
సూచీలు ఎక్కడివరకూ...
ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థగా స్టాక్ సూచీల లక్ష్యాలను పేర్కొనకూడదు. కాని ఈ ఏడాది కూడా 12 శాతం పైనే రాబడిని అందిస్తాయని అంచనా వేస్తున్నాం. దీనికంటే రెండు మూడు శాతం అదనంగా మా ఈక్విటీ ఫండ్స్ లాభాలను అందించాలన్నది లక్ష్యం. గతేడాది మా ఈక్విటీ పథకాలు సగటున 20% రాబడిని అందించాయి.
ఏయే రంగాలు మక్కువ.. వేటికి దూరం...
ఫార్మా రంగం షేర్లు చాలా అధిక ధరలో ట్రేడ్ అవుతున్నాయి. కాని సన్, ర్యాన్‌బాక్సీ డీల్ ఈ రంగంలో ఇంకా వృద్ధికి అవకాశాలున్నాయన్న సంకేతాలను ఇచ్చింది. అందుకే రంగాల వారిగా కాకుండా షేర్లను బట్టి ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు అధిక ధరలో ఉన్నప్పటికీ వాటిలో కూడా కొన్ని షేర్లను ఇప్పటికీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే ఇన్‌ఫ్రా, ప్రభుత్వరంగ, క్యాపిటల్ గూడ్స్ వంటి రంగాలు మెరుగపడతాయి.
వడ్డీరేట్ల కదలికలపై....
ఈ ఏడాది వడ్డీరేట్ల కదలికలు భారీ మార్పులుంటాయనుకోవడం లేదు. ఒకవేళ ద్రవ్యోల్బణం ఏమైనా బాగా దిగొస్తే వడ్డీరేట్లు గరిష్టంగా పావు శాతానికి మించి తగ్గే అవకాశాలు లేవు.
రూపాయి కదలికలపై...
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.57 వద్ద స్థిర పడుతుందని అనుకుంటున్నా. ఒకవేళ పరిస్థితులు క్షీణిస్తే రూ.61.50 మించి తగ్గకపోవచ్చు. ఈ ఏడాది కూడా ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం కొనసాగుతుంది.
దేశీయ స్టాక్ సూచీలు చౌకగా ఉండటమే ప్రస్తుత ర్యాలీకి కారణం. దీనికి ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. 1993లో సెన్సెక్స్ 4,200 వద్ద ఉన్నప్పుడు సెన్సెక్స్ పీఈ రేషియో 42 శాతంగా ఉండేది. ఇప్పుడు సెన్సెక్స్ 22,000 దాటినా పీఈ మాత్రం 14.2 వద్ద ఆకర్షణీయంగా ఉంది. ఈ స్థాయికి వచ్చినప్పుడు ఎన్నికలు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మార్కెట్లు పెరుగుతాయి. మోడీ ప్రభుత్వం రాకున్నా లేక సుస్థిరమైన ప్రభుత్వం అధికారం రాకపోయినా మార్కెట్లు పట్టించుకోవు.
ఆర్థిక వ్యవస్థ మందగమనంపై
స్టాక్ మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తును ముందుగానే గ్రహిస్తాయి. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్న సమాచారం ఏమీ లేదు. కాని మార్కెట్ కదలికలను బట్టి పరిస్థితులు మెరుగుపడుతున్నాయనిపిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది వృద్ధిరేటు అధికంగా 5.5 శాతం ఉంటుందని భావిస్తున్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరగాల్సిన అవసరం ఉంది.
సూచీలు ఎక్కడివరకూ..
సెన్సెక్స్ ఎంత వరకు పెరుగుతుందని చెప్పను. మార్కెట్లు అందించే లాభాలు పూర్తిగా ఆర్థిక మూలాలుపైనే ఆధారపడి ఉంటుంది. కంపెనీల ఆదాయం 15 % వృద్ధి ఉండి, పీఈ రేషియో 14.2% ఉంటే సూచీలు సుమారు 15% రాబడిని ఇస్తాయి. ఒకవేళ పీఈ రేషియో పెరిగితే రాబడులు ఇంకా పెరుగుతాయి. ఆదాయం పెరిగినా పీఈ తగ్గితే సూచీలు అందించే లాభాలూ తగ్గుతాయి. ప్రస్తుత అంచనాలను బట్టి ఈ ఏడాది 15% లాభాలను ఆశించొచ్చు.
ఏయే రంగాలపై మక్కువ... వేటికి దూరం...
ఇలా రంగాలపై మేము దృష్టిసారించాం. ఒక రంగం పరిస్థితులు బాగుండకపోవచ్చు. కాని ఆ రంగంలో ఒక కంపెనీ ఆకర్షణీయంగా ఉం డొచ్చు. గతంలో ఎటువంటి రిస్క్‌లున్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
వడ్డీరేట్ల కదలికలపై....
వడ్డీరేట్లు పెరగడానికే కాని తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఏడాదంతా ప్రస్తుత రేట్ల వద్దే స్థిరంగా ఉంటాయి. ద్రవ్యోల్బణం భయం ఈ ఏడాది అధికమయ్యే అవకాశాలుండటంతో వడ్డీరేట్లు పావు శాతం పెరగొచ్చు. అంతేకాని తగ్గే అవకాశాలైతే కనిపించడం లేదు.
రూపాయి కదలికలపై...
ఆర్‌బీఐ డాలరు విలువ రూ.55 మించి తగ్గడానికి ఇష్టపడటం లేదు. రూ.58 మించి రూపాయి బలపడకపోవచ్చు. రూపాయి క్షీణతను తట్టుకునే శక్తి ఇప్పుడు ఆర్‌బీఐకి వచ్చింది. ఏడాది మొత్తం మీద రూ. 58-62 విస్తృత శ్రేణిలో కదలొచ్చు.