మ్యూచువల్‌ ఫండ్స్‌లో అమ్మకాల సెగ | In February 2025 debt mutual funds significant outflows with investors pulling out Rs 6526 cr | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌లో అమ్మకాల సెగ

Published Tue, Mar 18 2025 9:13 AM | Last Updated on Tue, Mar 18 2025 9:13 AM

In February 2025 debt mutual funds significant outflows with investors pulling out Rs 6526 cr

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫిబ్రవరి నెలలో నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. రూ.6,525 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. అంతకుముందు నెల జనవరిలో రూ.1.28 లక్షల కోట్లను డెట్‌ ఫండ్స్‌ ఆకర్షించడం గమనార్హం. మొత్తం 16 విభాగాలకు గాను 10 విభాగాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.

‘స్వల్పకాలానికి పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పటికీ పోర్ట్‌ఫోలియో పరంగా డెట్‌ ఫండ్స్‌ ఎంతో ముఖ్యమైనవి. మార్కెట్‌ పరిస్థితులు కుదుటపడితే రానున్న రోజుల్లో పెట్టుబడుల రాక స్థిరపడొచ్చు’ అని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ నేహల్‌ మెష్రామ్‌ తెలిపారు. నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినప్పటికీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం డెట్‌ పెట్టుబడుల విలువ (డెట్‌ ఏయూఎం) ఫిబ్రవరి చివరికి రూ.17.08 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. జనవరి చివరికి ఇది రూ.17.06 లక్షల కోట్లుగా ఉంది.

పాజిటివ్‌–నెగెటివ్‌

  • లిక్విడ్‌ ఫండ్స్‌లోకి నికరంగా రూ.4,977 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

  • కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ రూ.1,065 కోట్లు, షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ రూ.473 కోట్ల చొప్పున ఆకర్షించాయి.

  • మీడియం టు లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్, గిల్డ్‌ ఫండ్స్‌లోకి స్వల్పంగా పెట్టుబడులు పెరిగాయి.  

  • అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ నుంచి రూ.4,281 కోట్లు బయటకు వెళ్లిపోయాయి.  

  • మనీ మార్కెట్‌ ఫండ్స్‌ రూ.276 కోట్లు, లో డ్యురేషన్‌ ఫండ్స్, ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు రూ.2,264 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి నెల ఉపసంహరణల్లో ఈ నాలుగు విభాగాల నుంచే 90 శాతం ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..

వడ్డీ రేట్ల కోతపై అంచనాలు

‘ఆర్‌బీఐ రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నట్టున్నారు. దీనివల్ల లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల వృద్ధి జరుగుతుంది. తక్కువ క్రెడిట్‌ రిస్క్‌ కారణంగా గిల్ట్‌ ఫండ్స్‌కు ఆదరణ కొనసాగుతోంది. ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడులకు దీన్ని మెరుగైన విభాగంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారు’ అని మెష్రామ్‌ వివరించారు. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నికరంగా 26 శాతం తగ్గి (జనవరితో పోల్చి చూస్తే) రూ.29,303 కోట్లుగా ఉండడం గమనార్హం. అన్ని విభాగాలూ కలిపి ఫిబ్రవరిలో ఫండ్స్‌ పరిశ్రమ నికరంగా ఆకర్షించిన పెట్టుబడులు రూ.40,000 కోట్లుగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement