outflow
-
భారత్ నుంచి వలసలు పోతున్న కుబేరులు
భారత దేశంలో ప్రభుత్వం సంపన్నులకు అండగా నిలుస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతుంటే వారు మాత్రం ఇక్కడ సరిపడా సంపాదించుకున్నాక మూట ముల్లె సర్దుకుని పరాయి దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఇది కొంత ఆందోళనకరమైన విషయమే అయినప్పటికీ ఈ సంఖ్య గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కుబేరుల వలసల్లో చైనా ఈ ఏడాది 13,500 వలసలతో అగ్రస్థానంలో ఉండగా భారత దేశం 6,500 మంది కుబేరుల వలసలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తగ్గారండోయ్.. హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం 6,500 మంది అధిక నికర విలువ ఉన్న సంపన్నులు ఈ ఏడాది దేశం విడిచి వెళ్తున్నట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కుబేరుల వలసలు గణనీయంగా తగ్గాయని, గత ఏడాది 7,500 మంది కుబేరులు దేశాన్ని విడిచి వెళ్లగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్యలో వెయ్యి మంది తగ్గారని తెలిపింది హెన్లీ వెల్త్ మైగ్రేషన్ సంస్థ. నష్టమే లేదు.. న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధనాధికారి ఆండ్రూస్ అమాయిల్స్ మాత్రం ఈ వలసల సంఖ్యలతో పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదని, కొందరు వెళ్లిపోయినా వారికి రెట్టింపు సంఖ్యలో భారత దేశం కుబేరులను పుట్టిస్తూ ఉందని అన్నారు. క్లిష్టమైన నిషేధిత పన్ను చట్టాలు, కఠినమైన విదేశీ చెల్లింపుల నిబంధనలే ప్రధానంగా ఈ వలసలకు కారణాలుగా తెలుస్తోంది. నిజమే మరి... సంపాదన ఉంటే సరిపోతుందా దాన్ని దాచుకోవాలి కదా. చైనానే టాప్.. ఇక కుబేరుల వలసల్లో చైనా దేశం అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత దేశం రెండో స్థానంలో ఉంది. చైనా నుండి ఈ ఏడాది భారీగా 13,500 మంది సంపన్నులు ఆ దేశాన్ని విడిచి వెళ్తున్నట్లు నివేదిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కుబేరుల వలసలు గత ఏడాది 1,22,000 గా ఉండగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 1,28,000 కు చేరుకోనున్నట్లు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సీఈవో డాక్టర్ జుర్గ్ స్టీఫెన్ తెలిపారు. ఎక్కడికి పోతున్నారు.. హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా 5200 మంది కుబేరులు ఆస్ట్రేలియా చేరుకోనున్నారు. తర్వాత యూఏఈ 4500 మందిని ఆహ్వనించనుంది. ఇక సింగపూర్ 3200 మందిని అమెరికా 2100 మందిని తమ కుబేరుల జాబితాలో కలుపుకోనున్నాయి. స్విట్జర్లాండ్ , కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, న్యూజిలాండ్ దేశాలు కుబేరులను ఆహ్వానించడంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇది కూడా చదవండి: లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం! -
ఈక్విటీ పథకాల్లో కొనసాగిన పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక డిసెంబర్లో బలంగా నమోదైంది. రూ.7,303 కోట్లను ఈక్విటీ ఫండ్స్ ఆకర్షించాయి. అంతకుముందు నవంబర్ నెలలో వచ్చిన రూ.2,224 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి ఫండ్స్ సంస్థల గ ణాంకాలను యాంఫి విడుదల చేసింది. డెట్ మ్యూ చువల్ ఫండ్స్ నికరంగా రూ.21,947 కోట్లను కో ల్పోయాయి. 2022 సంవత్సరం మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తు లు (ఏయూఎం) 5.7 శాతం (రూ.2.2 లక్షల కోట్లు ) వృద్ధి చెంది రూ.39.88 లక్షల కోట్లకు చేరాయి. 2021లో 7 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గింది. పథకాల వారీగా.. ► ఈక్విటీ విభాగంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,245 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.26 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.203 కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి. ► 24 ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ల రూపంలో (నూతన పథకాలు/ఎన్‌ఎఫ్‌వోలు) ఫండ్స్ సంస్థలు డిసెంబర్లో ఇన్వెస్టర్ల నుంచి రూ.6,954 కోట్లను సమీకరించాయి. ► 12 క్లోజ్ ఎండెడ్ ఎన్‌ఎఫ్‌వోలు రూ1,532 కోట్లను సమీకరించాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.676 కోట్లు రాగా, లా ర్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1189 కోట్లు ఆకర్షించా యి. మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,962 కో ట్లు వచ్చా యి. ► వ్యాల్యూ ఫండ్స్‌లోకి రూ.648 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.564 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.403 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ విభాగంలో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.13,852 కోట్లు బయటకు వెళ్లాయి. ► మల్టీ అస్సెట్ అలోకేషన్ పథకాలు రూ.1,711 కోట్లను ఆకర్షించాయి. సిప్ రూపంలో రూ.13,573 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి డిసెంబర్ నెలలో రూ.13,573 కోట్లు వచ్చాయి. అంతకుముందు నెల నవంబర్‌లో సిప్ పెట్టుబడులు రూ.13,307 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. సిప్ వరుసగా వృద్ధి చూపించడం ఇది మూడో నెల. డిసెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఫోలియోల సంఖ్య 14.11 కోట్లకు చేరింది. ఒక పథకంలో ఇక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపును ఫోలియోగా చెబుతారు. పెట్టుబడులు కొనసాగుతాయి.. ‘‘ఇన్వెస్టర్లు సమీప భవిష్యత్తులోనూ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో పెట్టుబడులు కొనసాగిస్తారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇది మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించనుంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలన్న ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు విస్మరించలేదు. సిప్ ఖాతాలు పెరగడం దీన్నే సూచిస్తోంది. కొత్తగా డిసెంబర్లో 24 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. ఈ సాధనంపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది’’అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
2022లో డెట్ ఫండ్స్‌కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు 2022లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంపై పెద్ద ప్రభావమే చూపించింది. ఏకంగా రూ.2.3 లక్షల కోట్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వెళ్లిపోయాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ ఏడాది నిదానిస్తుందన్న అంచనాలతో డెట్ ఫండ్స్ తిరిగి పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 2021లోనూ డెట్ విభాగం రూ.34,545 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. డెట్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం రెండో ఏడాది నమోదైంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. వడ్డీ రేట్ల పెంపు క్రమంతోపాటు ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం నికర పెట్టుబడుల ఉపసంహరణకు దారితీసింది. తగ్గిన డెట్ ఫండ్స్ ఆస్తులు ► 2022లో మొత్తం మీద 5 నెలల్లో డెట్ పథకాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా మా ర్చిలో రూ.1,14,824 కోట్లు, జూన్‌లో రూ. 92, 248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ► షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.49,200 కోట్లను, కార్పొరేట్ బాండ్స్ నుంచి రూ. 40,500 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ► లిక్విడ్ ఫండ్స్‌లోకి గతేడాది నికరంగా రూ.17,940 కోట్లు వచ్చాయి. ► మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.9,250 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.1,021 కోట్ల చొప్పున వచ్చాయి. ► డెట్ మార్కెట్లో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ ఫండ్స్ పెట్టుబడులే 50 శాతానికి పైగా ఉన్నాయి. ► గతేడాది అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని డెట్ ఫండ్స్ ఆస్తులు 11 శాతం తగ్గి రూ.12.41 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. 2021 డిసెంబర్ నాటికి ఇవి రూ.14.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. ► డెట్ ఫండ్స్‌కు సంబంధించి మొత్తం ఫోలియోలు 5 లక్షలు తగ్గి 73.38 లక్షలుగా ఉన్నాయి. మార్కెట్ పరిస్థితుల్లో మార్పులు ‘‘ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, సమీప కాలంలో వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందోనన్న అస్పష్టత, రూపాయి పతనం ఇన్వెస్టర్లలో అప్రమత్తతకు దారితీసింది. దీని ఫలితమే డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం’’అని ఫెల్లో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మనీష్ మర్యాద తెలిపారు. ‘‘ఈక్విటీ మార్కెట్ల వ్యాల్యూషన్లు కాస్త విస్తరించి ఉన్నాయి. రిస్క్ రాబడుల దృష్ట్యా మెరుగైన రాబడులను ఇచ్చే మీడియం టర్మ్ డెట్ కేటగిరీల్లోకి ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించొచ్చు. జీసెక్‌లు, కార్పొరేట్ బాండ్ల మధ్య అంతరం పెరగడంతో క్రెడిట్ ఫండ్స్ కూడా పెట్టుబడులకు మంచి అవకాశం’’అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ (పరిశోధన) కవితా కృష్ణన్ తెలిపారు. -
డెట్ మ్యూచువల్ ఫండ్ నుంచి రూ.92,248 కోట్లు ఉపసంహరణ!
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు జూన్ నెలలో అమ్మకాల ఒత్తిడిని చూశాయి. ఇన్వెస్టర్లు ఏకంగా రూ.92,248 కోట్లను డెట్ పథకాల నుంచి ఉపసంహరించుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగే క్రమం కావడం, అధిక కమోడిటీల ధరలు, వృద్ధి మందగమనం ఇవన్నీ పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలోనూ డెట్ పథకాల నుంచి రూ.32,722 కోట్లు బయటకు వెళ్లగా.. ఏప్రిల్ నెలలో రూ.54,756 కోట్ల పెట్టుబడులు రావడం గమనించాలి. డెట్‌లో మొత్తం 16 విభాగాలకు గాను, 14 విభాగాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఓవర్‌నైట్, లిక్విడ్, అల్ట్రా షార్ట్‌టర్మ్ డ్యురేషన్ ఫండ్స్ ఎక్కువ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఓవర్‌నైట్ ఫండ్స్ నుంచి రూ.20,668 కోట్లు, లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.15,783 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి 10,058 కోట్లు బయటకు వెళ్లాయి. 10 ఏళ్ల గిల్ట్ ఫండ్స్, లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి మాత్రమే నికరంగా పెట్టుబడులు వచ్చాయి. మే చివరికి డెట్ పథకాల పరిధిలోని నిర్వహణ ఆస్తులు రూ.13.22 లక్షల కోట్లుగా ఉంటే, జూన్ చివరికి రూ.12.35 లక్షల కోట్లకు తగ్గాయి. ఇందులోనూ 50 శాతం మేర ఆస్తులు లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ పథకాల్లోనే ఉన్నాయి. అనిశ్చితుల వల్లే.. రెపో రేటు, ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, ఇన్వెస్టర్ల స్వల్పకాల అవసరాల కోసం పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కారణాలై ఉండొచ్చని ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతిరాతి గుప్తా తెలిపారు. మహిళల కోసమే ఉద్దేశించిన ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ ఎల్‌ఎక్స్‌ఎంఈ. మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ కవిత కృష్ణన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకే అంకె రాబడికితోడు పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, పెరిగే ద్రవ్యోల్బణం వల్ల.. ఇతర పెట్టుబడి సాధనాలకు ఉన్న అనుకూలతలతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికితోడు కార్పొరేట్ సంస్థలు, వ్యాపారస్థులు తమ స్వల్పకాల నిధుల అవసరాల కోసం ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడాన్ని ఎంపిక చేసుకుని ఉండొచ్చన్నారు. జూన్ నెలలో ఈక్విటీ పథకాలు నికరంగా రూ.15,498 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం తెలిసిందే. సాధారణంగా డెట్ పథకాలు తక్కువ రిస్క్‌తో ఉంటాయి. స్వల్పకాల అవసరాల కోసం ఇన్వెస్టర్లు వీటినే ఎంపిక చేసుకుంటారు. రాబడి తగ్గడం, ఈక్విటీ మార్కెట్లు దిద్దుబాటుకు గురై ఆకర్షణీయ అవకాశాలు అందుబాటులోకి రావడం కూడా పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం చూపి ఉంటాయి. -
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) సుదీర్ఘకాలం తర్వాత అమ్మకాల ఒత్తిడిని చూశాయి. 2021 జూలై నెలలో నికరంగా రూ.61 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. ఈక్విటీ, డెట్ సాధనాలవైపు పెట్టుబడులను మళ్లించడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం. అయినప్పటికీ ఫోలియోల సంఖ్య (పెట్టుబడుల గుర్తింపు సంఖ్య) 19.13 లక్షలకు పెరిగింది. జూన్ చివరికి ఫోలియోలు 18.32 లక్షలుగానే ఉన్నాయి. 2019 ఆగస్ట్ నుంచి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల రాక సానుకూలంగానే నమోదవుతోంది. 2020 ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో మాత్రమే పెట్టుబడులు వరుసగా రూ.195 కోట్లు, రూ.141 కోట్ల చొప్పున వెనక్కి వెళ్లాయి. ఇక ఈ ఏడాది జూన్‌లో రూ.360 కోట్లు, మే నెలలో రూ.288 కోట్ల చొప్పున బంగారం ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇన్వెస్టర్లు రూ.3,107 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
మ్యూచువల్ ఫండ్స్‌కి బ్రేక్!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఆలోచనా ధోరణి మారినట్టుంది. దీనికి ప్రతిబింబంగా నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.2,480 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ప్రచారం కారణంగా ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహనతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి ప్రతీ నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్న పరిస్థితి చూశాము. కానీ కరోనా రాకతో ఈ పరిస్థితి మారిపోయింది. తగ్గిపోయిన ఆదాయాలు, అత్యవసర ఖర్చుల కోసమో లేక, ఈక్విటీ పథకాల పనితీరు నచ్చక ఇటీవల ర్యాలీ తర్వాత వచ్చినంత చాలనుకునే ధోరణితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. జూలై నెల గణాంకాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్ల తీరు ప్రస్ఫుటమవుతుంది. జూలైలో ఈక్విటీ పథకాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,480 కోట్లను ఉపసంహరించుకున్నారు. 2016 మార్చి నెలలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాల నుంచి రూ.1,370 కోట్లను వెనక్కి తీసుకోగా, ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది జూలైలో అదే పరిస్థితి కనిపించింది. అంతక్రితం జూన్ నెలలో ఈక్విటీ స్కీమ్ ల్లోకి రూ.240 కోట్ల మేర నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. ఇక అంతకుముందు నెలల్లో.. మేలో రూ.5,256 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.6,213 కోట్లు, మార్చిలో రూ.11,723 కోట్లు, ఫిబ్రవరిలో రూ.10,796 కోట్లు, జనవరిలో రూ.7,877 కోట్ల చొప్పున ఈక్విటీ పథకాలు నికరంగా పెట్టుబడులను ఆకర్షించాయి. అంటే 2020లో మొదటి ఐదు నెలలు ఈక్విటీ పథకాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు గత రెండు నెలల్లో అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. ► జూలై మాసంలో ఫండ్స్ పరిశ్రమలోకి నికరంగా రూ.89,813కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. జూన్ నెలలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే రూ.7,625 కోట్లు అదనంగా వచ్చినట్టు. ప్రధానంగా డెట్ ఫండ్స్ లోకి భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. ఇందులో లిక్విడ్, లో డ్యురేషన్ ఫండ్స్ అధిక పెట్టుబడులను ఆకర్షించాయి. ► మల్టీక్యాప్ ఫండ్స్ నుంచి రూ.1,033 కోట్లు, మిడ్ క్యాప్ ఫండ్స్ నుంచి రూ.579 కోట్లు, వ్యాల్యూ ఫండ్ విభాగం నుంచి రూ.549 కోట్ల చొప్పున బయటకు వెళ్లాయి. ► స్థిరాదాయ పథకాలు లేదా డెట్ ఫండ్స్ లోకి జూన్ నెలలో కేవలం రూ.2,862 కోట్లు పెట్టుబడులే రాగా, జూలైలో రూ.91,392 కోట్ల మేర భారీగా ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్ లోకి కుమ్మరించారు. ఇందులో డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.14,219 కోట్లు, లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.14,055 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ లోకి రూ.11,910 కోట్లు, బ్యాంకింగ్ అండ్ పీఎస్ యూ ఫండ్స్ లోకి రూ.6,323 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి రూ.670 కోట్లు బయటకు వెళ్లాయి. ► గోల్డ్ ఈటీఎఫ్ ల్లోకి రూ.921 కోట్లు నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ► జూలై ఆఖరుకు 45 సంస్థలతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహలోని పెట్టుబడుల విలువ రూ.27.12 లక్షల కోట్లుగా ఉంది. లాభాల స్వీకరణే.. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ విభాగంలో ఈఎల్ఎస్ఎస్, ఫోకస్డ్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని విభాగాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చోటు చేసుకుంది. అయితే, దీన్ని లాభాల స్వీకరణగా యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. మల్టీక్యాప్, లార్జ్ క్యాప్ విభాగంలో లాభాలు స్వీకరించినట్టు చెప్పారు. తగ్గిన వడ్డీ రేట్ల కారణంగా మెరుగైన రాబడులతో డెట్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ‘‘మల్టీక్యాప్ ఫండ్స్ నుంచి ఎక్కువగా పెట్టుబడుల ఉపసంహరణ నెలకొనగా, ఆ తర్వాత మిడ్‌క్యాప్, వ్యాల్యూ ఫండ్ విభాగాల్లో ఈ పరిస్థితి కనిపించింది’’ అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరగడంతో లాభాలు స్వీకరించినట్టు చెప్పారు. ‘‘ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనం అనంతరం ఇన్వెస్టర్లు వచ్చిన లాభాలతో బయటకు వెళ్లిపోవడం సాధారణంగా కనిపించే ధోరణే. అయితే పరిణతి చెందిన ఇన్వెస్టర్లు మాత్రం తమ సిప్ పెట్టుబడులను కొనసాగించడంతో వాటి రాక పెరిగింది’’అని గ్రోవ్ సహ వ్యవస్థాపకుడు,సీవోవో జైన్ పేర్కొన్నారు. -
మాతృదేశం వీడి వెళుతున్న మిలియనర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మాతృదేశాన్ని విడిచి పొరుగుదేశాలకు వెళ్లే ధనిక వలసదారుల స్థానంలో భారత్ రెండో స్థానంలో ఉంది. గడిచిన పద్నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు 61 వేలమంది భారత మిలియనర్లు విదేశాలపై మోజుతో మాతృదేశాన్ని విడిచి వెళ్లి ఏదో ఒకరకంగా అక్కడే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నరంట. న్యూ వరల్డ్ వెల్త్, లియో గ్లోబల్ అనే రెండు సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆ వివరాలను ప్రచురించాయి. దాని ప్రకారం మిలియనీర్లుగా మారిన భారతీయులంతా వెంటనే భారత దేశంలో విధిస్తున్న పన్నులు, రక్షణ, పిల్లల చదువు అనే సాకులతో విదేశాలకు వెళ్లిపోతున్నారని, ఇప్పటికే 61 వేలమంది మిలియనీర్లను భారత్ కోల్పోయిందని సర్వే చెప్పింది. కాగా, 91 వేలమంది మిలియనర్లు విదేశాలకు తరలిపోవడం ద్వారా చైనా తొలిస్థానంలో నిలిచింది. భారతీయులంతా ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాకు తరలి వెళుతుండగా.. చైనా వాళ్లు మాత్రం అమెరికా, హాంగ్ కాంగ్, సింగపూర్, బ్రిటన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారంట. కాగా, ప్రపంచ దేశాల నుంచి అత్యధికంగా బ్రిటన్‌కే 1.25 లక్షలమంది వెళ్లినట్లు సర్వే వెళ్లడించింది. -
తుంగభద్రకు కొనసాగుతున్న వరదనీరు
మహబూబ్‌నగర్ : తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 97 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 1632 అడుగులుకు ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,66,706 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1,89254 క్యూసెక్కులు ఉంది. సుంకేశుల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 0.33 టీఎంసీలు ఉండగా, నీటిమట్టం 289 అడుగులకు ఉంది. మరోవైపు తుంగభద్రలోకి ఒకేసారి 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో రాజోలి సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వరకు బ్యాక్ వాటర్ చేరుకున్నాయి. దీంతో పాత గ్రామంలోని మాలగేరి, ఎస్సీ కాలనీ, మార్లబీడు ప్రజలు భయాందోళనకు గురయ్యారు.