భారత దేశంలో ప్రభుత్వం సంపన్నులకు అండగా నిలుస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతుంటే వారు మాత్రం ఇక్కడ సరిపడా సంపాదించుకున్నాక మూట ముల్లె సర్దుకుని పరాయి దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఇది కొంత ఆందోళనకరమైన విషయమే అయినప్పటికీ ఈ సంఖ్య గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కుబేరుల వలసల్లో చైనా ఈ ఏడాది 13,500 వలసలతో అగ్రస్థానంలో ఉండగా భారత దేశం 6,500 మంది కుబేరుల వలసలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
తగ్గారండోయ్..
హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం 6,500 మంది అధిక నికర విలువ ఉన్న సంపన్నులు ఈ ఏడాది దేశం విడిచి వెళ్తున్నట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కుబేరుల వలసలు గణనీయంగా తగ్గాయని, గత ఏడాది 7,500 మంది కుబేరులు దేశాన్ని విడిచి వెళ్లగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్యలో వెయ్యి మంది తగ్గారని తెలిపింది హెన్లీ వెల్త్ మైగ్రేషన్ సంస్థ.
నష్టమే లేదు..
న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధనాధికారి ఆండ్రూస్ అమాయిల్స్ మాత్రం ఈ వలసల సంఖ్యలతో పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదని, కొందరు వెళ్లిపోయినా వారికి రెట్టింపు సంఖ్యలో భారత దేశం కుబేరులను పుట్టిస్తూ ఉందని అన్నారు. క్లిష్టమైన నిషేధిత పన్ను చట్టాలు, కఠినమైన విదేశీ చెల్లింపుల నిబంధనలే ప్రధానంగా ఈ వలసలకు కారణాలుగా తెలుస్తోంది. నిజమే మరి... సంపాదన ఉంటే సరిపోతుందా దాన్ని దాచుకోవాలి కదా.
చైనానే టాప్..
ఇక కుబేరుల వలసల్లో చైనా దేశం అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత దేశం రెండో స్థానంలో ఉంది. చైనా నుండి ఈ ఏడాది భారీగా 13,500 మంది సంపన్నులు ఆ దేశాన్ని విడిచి వెళ్తున్నట్లు నివేదిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కుబేరుల వలసలు గత ఏడాది 1,22,000 గా ఉండగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 1,28,000 కు చేరుకోనున్నట్లు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సీఈవో డాక్టర్ జుర్గ్ స్టీఫెన్ తెలిపారు.
ఎక్కడికి పోతున్నారు..
హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా 5200 మంది కుబేరులు ఆస్ట్రేలియా చేరుకోనున్నారు. తర్వాత యూఏఈ 4500 మందిని ఆహ్వనించనుంది. ఇక సింగపూర్ 3200 మందిని అమెరికా 2100 మందిని తమ కుబేరుల జాబితాలో కలుపుకోనున్నాయి. స్విట్జర్లాండ్ , కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, న్యూజిలాండ్ దేశాలు కుబేరులను ఆహ్వానించడంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం!
Comments
Please login to add a commentAdd a comment