న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు 2022లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంపై పెద్ద ప్రభావమే చూపించింది. ఏకంగా రూ.2.3 లక్షల కోట్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు వెళ్లిపోయాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ ఏడాది నిదానిస్తుందన్న అంచనాలతో డెట్ ఫండ్స్ తిరిగి పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 2021లోనూ డెట్ విభాగం రూ.34,545 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. డెట్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం రెండో ఏడాది నమోదైంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. వడ్డీ రేట్ల పెంపు క్రమంతోపాటు ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం నికర పెట్టుబడుల ఉపసంహరణకు దారితీసింది.
తగ్గిన డెట్ ఫండ్స్ ఆస్తులు
► 2022లో మొత్తం మీద 5 నెలల్లో డెట్ పథకాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా మా ర్చిలో రూ.1,14,824 కోట్లు, జూన్‌లో రూ. 92, 248 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.
► షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.49,200 కోట్లను, కార్పొరేట్ బాండ్స్ నుంచి
రూ. 40,500 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.
► లిక్విడ్ ఫండ్స్‌లోకి గతేడాది నికరంగా రూ.17,940 కోట్లు వచ్చాయి.
► మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.9,250 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.1,021 కోట్ల చొప్పున వచ్చాయి.
► డెట్ మార్కెట్లో లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, మనీ మార్కెట్, ఓవర్‌నైట్ ఫండ్స్ పెట్టుబడులే 50 శాతానికి పైగా ఉన్నాయి.
► గతేడాది అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని డెట్ ఫండ్స్ ఆస్తులు 11 శాతం తగ్గి రూ.12.41 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. 2021 డిసెంబర్ నాటికి ఇవి రూ.14.06 లక్షల కోట్లుగా ఉన్నాయి.
► డెట్ ఫండ్స్‌కు సంబంధించి మొత్తం ఫోలియోలు 5 లక్షలు తగ్గి 73.38 లక్షలుగా ఉన్నాయి.
మార్కెట్ పరిస్థితుల్లో మార్పులు
‘‘ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, సమీప కాలంలో వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందోనన్న అస్పష్టత, రూపాయి పతనం ఇన్వెస్టర్లలో అప్రమత్తతకు దారితీసింది. దీని ఫలితమే డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం’’అని ఫెల్లో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మనీష్ మర్యాద తెలిపారు. ‘‘ఈక్విటీ మార్కెట్ల వ్యాల్యూషన్లు కాస్త విస్తరించి ఉన్నాయి. రిస్క్ రాబడుల దృష్ట్యా మెరుగైన రాబడులను ఇచ్చే మీడియం టర్మ్ డెట్ కేటగిరీల్లోకి ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించొచ్చు. జీసెక్‌లు, కార్పొరేట్ బాండ్ల మధ్య అంతరం పెరగడంతో క్రెడిట్ ఫండ్స్ కూడా పెట్టుబడులకు మంచి అవకాశం’’అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ (పరిశోధన) కవితా కృష్ణన్ తెలిపారు.
2022లో డెట్ ఫండ్స్‌కు అమ్మకాల సెగ
Published Sat, Jan 14 2023 5:38 AM | Last Updated on Sat, Jan 14 2023 5:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment