న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో (ఏప్రిల్) డెట్ మ్యాచువల్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. రూ.1.06 లక్షల కోట్లను డెట్ మ్యూచువల్ ఫండ్ విభాగం ఆకర్షించింది. అంతక్రితం మార్చిలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.56,884 కోట్లు బయటకు వెళ్లగా, మరుసటి నెలలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లిక్విడ్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో 60 శాతాన్ని ఆకర్షించాయి. వీటిల్లోకి రూ.63,219 కోట్లు వచ్చాయి.
క్రెడిట్ రిస్క్, బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్ విభాగాలను మినహాయిస్తే, డెట్‌లో మిగిలిన అన్ని విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. స్వల్పకాల పథకాలకు ఎక్కువ ఆదరణ లభించింది. ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై పన్ను ప్రయోజనం తొలగిపోయినందున పెట్టుబడులు రానున్న రోజుల్లో క్షీణించొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించే వెసులుబాటును కేంద్ర సర్కారు ఇటీవల తొలగించడం తెలిసిందే. మార్చి నెలలో డెట్ విభాగం నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లడం సాధారణమేనని ఫిన్ ఎడ్జ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయాంక్ భట్నాగర్ పేర్కొన్నారు. అయితే ఒక్కసారిగా లిక్విడ్ ఫండ్స్‌లోకి ఏప్రిల్ నెలలో అంత భారీ పెట్టుబడులు రావడానికి కారణం నిర్ధారించడం కష్టమన్నారు.
మనీ మార్కెట్ ఫండ్స్‌కూ డిమాండ్
ఏప్రిల్ నెలలో భారీ పెట్టుబడుల రావడం వల్ల ఫండ్స్ నిర్వహణలోని డెట్ ఆస్తుల విలువ మార్చి చివరికి ఉన్న రూ.11.81 లక్షల కోట్ల నుంచి రూ.12.98 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. లిక్విడ్ ఫండ్స్ తర్వాత మనీ మార్కెట్ ఫండ్స్ అత్యధికంగా రూ.10,663 కోట్లను ఆకర్షించాయి. అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.10,663 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫ్లోటర్స్ ఫండ్స్‌లోకి రూ.3,991 కోట్లు వచ్చాయి. ఇక క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి రూ.356 కోట్లకు బయటకు వెళ్లాయి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.150 కోట్లను ఉపసంహరించుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలకు కాల వ్యవధితో సంబంధం లేకుండా స్వల్పకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దీంతో తమ శ్లాబు రేటు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పెట్టుబడుల రాకపై ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం ఫండ్స్ పరిశ్రమ నుంచి వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment