న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) సుదీర్ఘకాలం తర్వాత అమ్మకాల ఒత్తిడిని చూశాయి. 2021 జూలై నెలలో నికరంగా రూ.61 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. ఈక్విటీ, డెట్ సాధనాలవైపు పెట్టుబడులను మళ్లించడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం. అయినప్పటికీ ఫోలియోల సంఖ్య (పెట్టుబడుల గుర్తింపు సంఖ్య) 19.13 లక్షలకు పెరిగింది. జూన్ చివరికి ఫోలియోలు 18.32 లక్షలుగానే ఉన్నాయి. 2019 ఆగస్ట్ నుంచి గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల రాక సానుకూలంగానే నమోదవుతోంది. 2020 ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో మాత్రమే పెట్టుబడులు వరుసగా రూ.195 కోట్లు, రూ.141 కోట్ల చొప్పున వెనక్కి వెళ్లాయి. ఇక ఈ ఏడాది జూన్‌లో రూ.360 కోట్లు, మే నెలలో రూ.288 కోట్ల చొప్పున బంగారం ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇన్వెస్టర్లు రూ.3,107 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment