ఐపీఓ జోష్‌ భద్రం బాస్‌! | Retail Investors Initial Public Offer Investments in Stock Markets | Sakshi
Sakshi News home page

ఐపీఓ జోష్‌ భద్రం బాస్‌!

Published Mon, Mar 8 2021 6:40 AM | Last Updated on Mon, Mar 8 2021 6:46 AM

Retail Investors Initial Public Offer Investments in Stock Markets - Sakshi

గడిచిన పది నెలలుగా స్టాక్‌ మార్కెట్లు భారీ ర్యాలీ చేస్తుండడం.. ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) మార్కెట్‌కు జోష్‌నిస్తోంది. కొత్త కొత్త కంపెనీలు బుల్‌ మార్కెట్‌ అండతో, భారీగా నిధులు సమీకరించుకునేందుకు... స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్‌ అయ్యేందుకు ఐపీవో బాట పడుతున్నాయి. లిస్టింగ్‌తోనే రెట్టింపునకు పైగా లాభాలు కురిపిస్తుండడంతో (కొన్ని ఇష్యూలు) రిటైల్‌ ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. కానీ, ప్రతీ ఐపీవో లాభాలు కురిపిస్తుందన్న ఆశతో వెళితే చేతులు కాలే ప్రమాదం ఉందని గత అనుభవాలు చెబుతున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు తగిన అధ్యయనం తర్వాతే ఐపీవోల్లో పాల్గొనడం ద్వారా ఆశించిన లాభాలను కళ్ల చూడగలరని అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టర్లకు బుట్టెడు లాభాలను పంచినవే కాదు.. పెట్టుబడిని ఆసాంతం హరించేసిన ఇష్యూలు కూడా ఉన్నాయి. కనుక ఐపీవో మార్కెట్లో చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేయడంపై అవగాహన కల్పించే ప్రాఫిట్‌ ప్లస్‌ కథనమే ఇది...

2020 రెండో అర్ధభాగంలో 14 ఐపీవోలు ప్రజల నుంచి సుమారు రూ.16,272 కోట్లను సమీకరించాయి. ఇక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఐదు ఐపీవోలు మార్కెట్‌ను పలకరించాయి. మరెన్నో సంస్థలు త్వరలో ఐపీవోలకు వచ్చేందుకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తుండగా.. ఇంకొన్ని సంస్థలు ఐపీవో ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఐపీవోల పట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎంత వేలంవెర్రిగా ఉన్నారంటే.. ఇటీవలే ముగిసిన నురేకా ఐపీవోలో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటాకు ఏకంగా 166 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. కానీ, అన్ని ఐపీవోలు ఇన్వెస్టర్లకు రాబడులు కురిపిస్తాయన్న గ్యారంటీ లేదనే విషయాన్ని ఎక్కువ మంది పట్టించుకోవడం లేదు.  

2015 నుంచి 2021 జనవరి వరకు 142 ఐపీవోలు ప్రజల నుంచి నిధులు సమీకరించగా.. అందులో 55 స్టాక్స్‌ ఇప్పటికీ వాటి ఐపీవో జారీ ధర కంటే తక్కువలోనే ట్రేడవుతున్నాయి. అయితే, ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఎన్నో రెట్లు వృద్ధి చేసిన ఇష్యూలు కూడా ఉన్నాయి. అందుకే ఆణిముత్యాల్లాంటి ఐపీవోలను ఇన్వెస్టర్లు గుర్తించగలగాలి. అప్పుడే వారి కష్టార్జితాన్ని కరిగిపోకుండా చూసు కోవచ్చు. 49 ఇష్యూలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెట్టింపు అంతకు మించి వృద్ధి చేశాయి. వాటిల్లో ఐఆర్‌సీటీసీ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, సీడీఎస్‌ఎల్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్, హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్, రూట్‌మొబైల్‌ ఉన్నాయి. ముఖ్యంగా డిక్సన్‌ టెక్, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌(డీమార్ట్‌), ఐఆర్‌సీటీసీ అయితే వాటి ఐపీవో ధరలతో పోలిస్తే.. ఐదింతల కంటే ఎక్కువే ఇప్పటి వరకు పెరిగాయి. మరి ఇన్వెస్టర్ల పెట్టుబడులను కరిగించేసిన వాటిల్లో ఆర్టెల్‌ కమ్యూనికేషన్స్, యాడ్‌ల్యాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర కంపెనీలు కూడా ఉన్నాయని మర్చిపోవద్దు. ఈ రెండూ 2015లో ఐపీవో ముగించుకోగా, నాటి నుంచి నేటి వరకు ఇన్వెస్టర్ల పెట్టుబడులను 95 శాతం తుడిచిపెట్టేశాయి. ఇక మన్‌పసంద్‌ బెవరేజెస్‌ తదితర కొన్ని కంపెనీలు ట్రేడింగ్‌ నుంచి కనుమరుగైపోయాయి. కారణం కార్పొ రేట్‌ గవర్నెన్స్‌ అంశాలే. అందుకే మెరుగైన ఇష్యూలను గుర్తించగలిగితేనే ఇన్వెస్టర్లు ఆశించిన లక్ష్యాలను చేరుకోగలరు.

అనుకరించడం తెలియాలి..
ఇటీవలి బర్గర్‌ కింగ్, ఇండిగో పెయింట్స్‌ పబ్లిక్‌ ఇష్యూలకు సంస్థాగత ఇన్వెస్టర్లు (ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు), అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల (హెచ్‌ఎన్‌ఐ) నుంచి అధిక స్పందన లభించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లూ వీరికేమీ తీసిపోలేదు లేండి. కానీ, తెలివిగా మసలుకోకపోతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా పరిస్థితి మారుతుంది. ఎందుకంటే ఇనిస్టిట్యూషన్స్, హెచ్‌ఎన్‌ఐల స్పందన ఆధారంగా ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేసిన రిటైల్‌ ఇన్వెస్టర్లు.. వారికి మాదిరే ఆయా కౌంటర్ల నుంచి ఎప్పుడు బయటపడాలన్నది తప్పకుండా తెలిసి ఉండాలి. ఉదాహరణకు.. 2017లో వచ్చిన కెపాసిట్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ఐపీవోను చెప్పుకోవాలి. నాడు ఈ ఐపీవో 130 రెట్లు అధికంగా స్పందన అందుకుంది. క్యూఐబీ, ఎఫ్‌ఐఐల కోటా 52 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది.

ఇష్యూ ధరపై 37 శాతం అధిక స్థాయిలో లిస్ట్‌ అయింది. కానీ, మూడు నెలల్లోనే ఇనిస్టిట్యూషనల్‌ కొనుగోలుదారులు తమ వాటాలను సగం మేర తగ్గించేసుకున్నారు. దీనికి రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితులు కూడా కారణం. 2017 సెప్టెంబర్‌ నాటికి 26.9 శాతంగా ఉన్న వాటా.. అదే ఏడాది డిసెంబర్‌ చివరికి 13.2 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ స్టాక్‌ 30 శాతానికి పైగా నష్టపోయింది. ఇప్పటికీ ఈ స్టాక్‌ ధర నాటి ఐపీవో ధరతో పోలిస్తే 13 శాతం తక్కువలోనే ట్రేడవుతోంది. హడ్కో ఇష్యూ కూడా ఇదే పాఠం చెబుతోంది. హడ్కో ఐపీవోకు ఇనిస్టిట్యూషనల్‌ (క్యూఐబీ) విభాగం నుంచి 50 రెట్ల కంటే అధిక స్పందన వచ్చింది. లిస్టింగ్‌ రోజే స్టాక్‌ ధర 20% లాభపడడంతో ఇనిస్టిట్యూషన్స్‌ లాభాల స్వీకరణ చేశాయి. కానీ, రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రం హడ్కో మరింత రాబడులు ఇస్తుందని కొనసాగగా.. ఐపీవో ధరతో పోలిస్తే ఇప్పటికీ షేరు ధర దిగువనే ట్రేడవుతోంది. బర్గర్‌ కింగ్‌ ఐపీవోలోనూ పెద్ద ఎత్తున పాల్గొన్న హెచ్‌ఎన్‌ఐలు, క్యూఐబీలు లిస్టింగ్‌ తర్వాత కొంతమేర లాభాలను తీసుకున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

నియంత్రణ అంశాల ప్రభావం
ప్రభుత్వం ఆదేశాలు, నియంత్రణ సంస్థల ఆదేశాలూ కొన్ని కంపెనీల భవిష్యత్తును మార్చేయగలవు. వీటి పట్ల కూడా ఇన్వెస్టర్లు అవగాహనతో ఉండాలి. ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల పరంగా బ్యాంకుల స్టాక్స్‌ కదలికలు ఉంటుంటాయి. 2015లో ఆర్‌బీఐ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు లైసెన్స్‌లను 10 ఎన్‌బీఎఫ్‌సీలకు జారీ చేసినప్పుడు.. రూ.500 కోట్ల నికర విలువ సంతరించుకున్న మూడేళ్లలోగా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాలన్న నిబంధన విధించింది. ఈ ఆదేశాల కారణంగానే గడిచిన ఐదేళ్లలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఐపీవోలకు రావాల్సి వచ్చింది. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు గతేడాది ఐపీవోకు ముగించుకుంది. ఈ తరహా నిబంధన మాతృ సంస్థ ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ షేర్లపై ప్రభావం చూపించింది.

బంధన్‌ బ్యాంకు కూడా ఆర్‌బీఐ ఆదేశాల కారణంగా ప్రభావితమైనదే. ప్రమోటర్ల వాటాలను నిబంధనల మేరకు తగ్గించుకోవాల్సి రావడం స్టాక్‌ ధరలపై ప్రభావం పడేలా చేసింది. లిస్ట్‌ అయిన ఏడాదిలోనే ప్రమోటర్లు తమ వాటాలను 40%కి తగ్గించుకోవాల్సి వచ్చింది. తమ వాటాలు తగ్గించుకునేందుకు అదనపు సమయం ఇవ్వాలని బంధన్‌ బ్యాంకు ప్రమోటర్లు కోరగా, ఆర్‌బీఐ తిరస్కరించడంతోపాటు జరిమానాలను విధించి, బ్యాంకు శాఖల విస్తరణపై కొంత కాలం పాటు ఆంక్షలను కూడా అమలు చేసింది. కనుక విధానపరమైన నిర్ణయాల ప్రభావం స్టాక్స్‌పై ఉంటుందని అర్థం చేసుకోవాలి. కనుక ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి

కంపెనీ మూలాలు, స్టాక్స్‌ విలువలు
వచ్చిన ప్రతీ నూతన ఇష్యూకు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకోవడం కాకుండా.. ఆ కంపెనీ బలా, బలాలు, విలువను తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2017 బుల్‌ మార్కెట్‌ సమయంలో ప్రతాప్‌ స్నాక్స్‌ ఐపీవోకు వచ్చింది. 2016–17 ఆర్థిక సంవత్సరం లాభాలతో పోలిస్తే ఇష్యూ ధరను 200 రెట్లు అధిక స్థాయిల వద్ద నిర్ణయించింది. లిస్టింగ్‌ రోజు అయితే 25 శాతం లాభం ఇచ్చింది కానీ, ఏడాది కాలంలో స్టాక్‌ ధర నికరంగా 12.6 శాతం తక్కువకు పడిపోయింది. ఇప్పటికీ ఈ షేరు ధర నాటి ఇష్యూ ధరతో పోలిస్తే 29 శాతం తక్కువకు లభిస్తోంది. అంటే మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను ఈ కంపెనీ ప్రమోటర్లు క్యాష్‌ చేసుకోవడంలో సఫలమైనట్టు తెలుస్తోంది.

2016 మేలో వచ్చిన పరాగ్‌ మిల్క్‌ ఫుడ్‌ ఐపీవో కూడా మరో ఉదాహరణ. 2015–16 సంవత్సరపు లాభాల కంటే ఒక్కో షేరును 44 రెట్ల అధిక విలువకు కంపెనీ ఆఫర్‌ చేసింది. కానీ, లిస్టింగ్‌ రోజు 15% లాభాలను చూపించిన ఈ షేరు.. తర్వాతి సంవత్సరంలో పతనమైంది. ఎందుకంటే కంపెనీ లాభాలు 2016–17లో 80% క్షీణించడమే కారణం. నాడు ఐపీవోలో షేర్లను పొంది, అలాగే కొనసాగి ఉంటే ఇప్పటికి పెట్టుబడి నికరంగా 50% తగ్గిపోయి ఉంటుంది.  ఆర్‌బీఎల్‌ బ్యాంకు కూడా ఇందుకేమీ తీసిపోలేదు. గతేడాది కరోనా తర్వాత ఎన్‌పీఏలు పెరిగిపోతాయంటూ బ్యాంకు యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు, రుణ ఆస్తుల నాణ్యత, వసూళ్ల సామర్థ్యాలు క్షీణించడం వల్ల షేరు ధర ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి భారీగా పతనమైంది. తర్వాత కోలుకున్నప్పటికీ.. ఐపీవో ధర కంటే ఇంకా దిగువనే ట్రేడవుతోంది. కనుక కంపెనీల ఆర్థిక మూలాలు, అంతకుముందు కొన్నేళ్లలో వాటి పనితీరు, మేనేజ్‌మెంట్‌ సామర్థ్యం, రంగం, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, పనితీరులో పురోగతి వీటన్నింటినీ చూసి ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. షేర్ల ఎంపికే లాభాలను నిర్ణయించగలవని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి.

పరిస్థితులు మారిపోనూవచ్చు..
ఆయా రంగాల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పుల కారణంగా కంపెనీల లాభాలు దూసుకుపోవచ్చు. అందుకే కంపెనీ వ్యాపార మూలాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మోదీ సర్కారు మొదటి విడతలో మౌలిక రంగ కంపెనీల్లో జోరు కనిపించింది. భారత్‌ మాల, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాలు ఇందుకు మద్దతునిచ్చాయి. దీంతో 2015–17 కాలంలో ఇన్‌ఫ్రా కంపెనీల ఐపీవోల్లో కదలికలు పెరిగాయి. అదే సమయంలో వచ్చిన కెపాసిట్‌ ఇన్‌ఫ్రా ఇష్యూ అయితే భారీ స్పందనను దక్కించుకుంది. 2015లో పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, 2016లో దిలీప్‌బిల్డ్‌కాన్‌ పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చి జారీ ధరతో పోలిస్తే రెట్టింపునకు పైగా ఇన్వెస్టర్లకు లాభాలను తినిపించాయి. కానీ, ఇప్పుడు చూస్తే.. వాటిల్లో కెపాసిట్‌ ఇన్‌ఫ్రా, సద్బావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్, పవర్‌మెక్‌ కంపెనీలు ఐపీవో ధర కంటే 13–84 శాతం తక్కువలో కోట్‌ అవుతున్నాయి. 2020లో చైనా వ్యతిరేక సెంటిమెంట్‌ కూడా కెమికల్, ఫార్మా కంపెనీలకు బాగా కలిసొచ్చింది. కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్, రోసారి బయోటెక్‌ సంస్థల ఐపీవోలకు మంచి స్పందన రావడమే కాకుండా, లిస్టింగ్‌తో గణనీయంగా లాభపడ్డాయి కూడా. కాకపోతే ఈ తరహా ధోరణలు స్వల్పకాలమా.. లేక దీర్ఘకాలం పాటు కొనసాగుతాయా అన్న అంశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement