మీదైన స్టయిల్‌ ఉండాల్సిందే.. | Hundred Percent Success Multibagger is one of the 10 stocks says Kedia Securities Vijay Kedia Kedia Securities | Sakshi
Sakshi News home page

మీదైన స్టయిల్‌ ఉండాల్సిందే..

Published Mon, Jun 13 2022 4:31 AM | Last Updated on Mon, Jun 13 2022 4:31 AM

Hundred Percent Success Multibagger is one of the 10 stocks says Kedia Securities Vijay Kedia Kedia Securities - Sakshi

టీనేజీలోనే స్టాక్స్‌లో పెట్టుబడి ప్రారంభం. 30 ఏళ్ల అనుభవం. రూ.800 కోట్లకు పైగా నెట్‌వర్త్‌. ఇది ప్రముఖ ఇన్వెస్టర్, కేడియా సెక్యూరిటీస్‌ అధినేత విజయ్‌ కేడియా ఈక్విటీ ప్రస్థానం. ఆయన పట్టిందల్లా బంగారం కాలేదు. కానీ, ఈక్విటీల్లో రాబడులు ఒడిసి పట్టడం ఎలాగన్నది ఆయనకు తెలుసు. స్టాక్స్‌ ఎలా ఎంచుకోవాలో తెలుసు. ఎంపిక చేసుకున్నది బెడిసి కొడితే తదుపరి ఏ అడుగు తీసుకోవాలో తెలుసు. అయినా సరే.. గత అనుభవాలు, గత విజయాలకు దోహదపడిన సూత్రాల ఆధారంగా ఒక స్టాక్‌లో పెట్టుబడి పెడితే.. రేపు అది 100 శాతం సక్సెస్‌ అవుతుందన్న గ్యారంటీ లేదంటారు.

ఈక్విటీల్లో  అటువంటి రిస్క్‌ఎప్పుడూ ఉంటుందన్నది ఆయన స్వీయ అనుభవం. అవును ఈక్విటీలంటే అంతే.  ‘ఇన్నేళ్ల అనుభవం, ఇంత సంపద సృష్టి తర్వాత కూడా.. ‘నేను భయస్తుడిని. సామాన్యుడిని. అభద్రతా భావం ఉన్నవాడిని‘ అని తన గురించి కేడియా చెప్పుకోవడం వెనుక అంతరాన్ని అర్థం చేసుకోవాలి. ఒక పెట్టుబడి సక్సెస్‌ ఇచ్చిందని ‘అంతా నాకే తెలుసు’ అనుకుంటే కష్టం. అనుభవం, అధ్యయనం, విశ్లేషణ, విజ్ఞానం అన్నింటినీ జోడించి జాగ్రత్తగా వెళితే ఈక్విటీ ప్రయాణం సక్సెస్‌ను ఇస్తుంది. విజయ్‌ కేడియా తరహా ఇన్వెస్టర్ల విజయానికి దోహదం చేసిన అంశాలను తెలుసుకోవడం వల్ల మన అవగాహన మరికొంత విస్తృతమవుతుంది.   
  ∙
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, డాలీఖన్నా, విజయ్‌ కేడియా.. ఇలాంటి బడా ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లు చాలా మందే మన మార్కెట్లో ఉన్నారు. వీరంతా ఈక్విటీల్లో నిలిచి గెలిచినవారు. నష్టాలను పాఠాలుగా చేసుకుని, అనుభవంతో సంపద సృష్టించుకున్నారు. వీరిని గమనిస్తే కొన్ని లక్షణాలు ఒకే రీతిలో కనిపిస్తాయి. కనీసం మూడు దశాబ్దాలకు పైగా అనుభవం, మార్కెట్ల ఎత్తు పల్లాలను చూసి, వాటికి ఎదురీది, అనిశ్చితుల్లో ఏమి చేయాలో తెలిసిన వారు. ఇలా విజయవంతమైన బడా ఇన్వెస్టర్లలో కేడియా సెక్యూరిటీస్‌ అధినేత విజయ్‌ కేడియా కూడా ఒకరు. ఆయన ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెట్టుబడులు, తాను అనుసరించే సూత్రాలు తదితర సమాచారాన్ని పంచుకున్నారు. ఈక్విటీ ప్రయాణం చేసే, కొత్తగా ఈక్విటీల్లోకి వచ్చే రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ సమాచారం ఎంతో కొంత మార్గదర్శనం చేస్తుంది.

అన్నీ సక్సెస్‌ అవ్వాలని లేదు..
నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే రిటైల్‌ ఇన్వెస్టర్లు చాలా మందే ఉన్నారు. స్టాక్స్‌ ఎంపికలో చేసే పొరపాట్లతో ఎక్కువ మంది నష్టపోతుంటారు. ఏ ప్రయాణం అయినా కొన్ని అవరోధాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడంపైనే గమ్యస్థానం చేరుకోవడం ఆధారపడి ఉంటుంది. కనుక ఒకటి రెండు నష్టాలు ఇచ్చాయని కుదేలు కాకూడదు. ఆ అనుభవంతో తదుపరి పెట్టుబడుల్లో ఫెయిల్యూర్‌ అవకాశాలను తగ్గించుకోవాలి. విజయ్‌ కేడియా తన సక్సెస్‌ రేటు 50 శాతమే అని చెప్పారు. మరి ఆయనకేమైనా తక్కువ అనుభవం ఉందా..? 19 ఏళ్లకే ఈక్విటీ జర్నీ మొదలు పెట్టి, 30 ఏళ్లకు పైగా మార్కెట్‌తో కలసి నడుస్తున్న వ్యక్తి.

రిటైల్‌ ఇన్వెస్టర్‌గా మనం ఎంపిక చేసుకునే ప్రతీ స్టాక్‌ మల్టీబ్యాగర్‌ కావాలని భావిస్తాం. దీంతో కళ్ల ముందు స్వల్ప వ్యవధిలోనే రెండు మూడు రెట్లు పెరిగిన స్టాక్‌ను చూసి ఆకర్షితులవుతాం. రిస్క్‌ తీసుకుని అధిక ధర వద్ద కొనుగోలు చేస్తాం. కానీ, వాటిని ఎక్కువ కాలం పాటు అట్టి పెట్టుకుంటామా..? లేదు. అసలు ఏ అంశాలను చూసి ఇన్వెస్ట్‌ చేశామన్నది ప్రశ్నించుకోము. అన్నీ మర్చిపోయి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తాం. ఎంపిక చేసుకునే 10 స్టాక్స్‌లో ఒకటి లేదా రెండు మాత్రమే మల్టీబ్యాగర్లు అవుతాయన్నది విజయ్‌ కేడియా అనుభవసారం.

వైవిధ్యం..
విజయ్‌ కేడియా పోర్ట్‌ఫోలియోను గమనిస్తే 90 శాతం ఈక్విటీల్లోనే ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ఇక డెట్‌ సాధనాల్లో సున్నా. 8 శాతాన్ని రియల్‌ ఎస్టేట్‌పై పెట్టారు. మరో 2 శాతాన్ని బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టారు. పెట్టుబడులు అన్నీ ఒకే చోట పెట్టుకూడదన్నది ప్రాథమిక సూత్రం. ఎందుకంటే ఒకే విభాగంలో పెట్టినప్పుడు.. ఏదైనా సంక్షోభం వచ్చి ఆయా విభాగంపై ప్రభావం పడితే..? అదే సమయంలో పెట్టుబడులు వెనక్కి తీసుకోవాల్సి వస్తే..? అందుకుని ఈ రిస్క్‌ను తగ్గించుకునేందుకు కచ్చితంగా ఈక్విటీలతోపాటు డెట్, బంగారం ఇతర సాధనాలకు కేటాయించుకోవాలి.

విజయ్‌ కేడియా పోర్ట్‌ఫోలియోలో డెట్‌కు చోటు ఎందుకు లేదు...? అన్న సందేహం రావచ్చు. రాబడి, రిస్క్‌ కోణంలో ఆయనకు నచ్చని విభాగం అది. ‘‘నేను డెట్‌లో పెట్టుబడులు పెట్టను. నేను ఏవైనా షేర్లను విక్రయించాల్సి వస్తే ఆ మొత్తాన్ని లిక్విడ్‌ ఫండ్‌లో లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో 10–30 రోజుల కాలానికి ఉంచుతాను. నగదు రూపంలో ఉంటే నాకు నిద్ర పట్టదు’’ అని విజయ్‌కేడియా చెప్పారు. డెట్‌ ఆయనకు ఉద్వేగాన్ని ఇవ్వదట. పైగా రిస్క్‌ తీసుకోవడానికే తాను ఇష్టపడతానని చెప్పారు. అందుకే 90 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించారు. అదే సమయంలో 10 శాతాన్ని ఇతర సాధనాలకు కేటాయించడాన్ని గమనించాలి. దీన్నే అస్సెట్‌ అలోకేషన్‌ అని చెబుతారు.

పెట్టుబడి విధానం
స్నేహితుడో, సహచర ఉద్యోగి చెప్పాడనో.. లేదంటే అనలిస్ట్‌ సూచించాడనో బ్లైండ్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరికాదు. ప్రతి ఇన్వెస్టర్‌కు పెట్టుబడికి సంబంధించి ఒక విధానం ఉండాలి. దీన్నే స్టయిల్‌ అనో, మరొకటో అనుకోవచ్చు. ఎంత రాబడి ఆశిస్తున్నారు, ఎంత కాలం పాటు ఆ పెట్టుబడిని కొనసాగించగలరు? లేదంటే వారసులకు ఇవ్వడం కోసం స్టాక్స్‌ను పోగు చేస్తున్నారా..? ఏటా ఆయా కంపెనీల నుంచి ఎంత వృద్ధి ఆశిస్తున్నారు..? ఆయా కంపెనీలనే ఎందుకు ఇష్టపడుతున్నారు..? నష్టం వస్తే వెంటనే అమ్మేస్తారా..? లేదంటే దీర్ఘకాలం పాటు ఓపిక పడతారా..? ఇలా ఎన్నో అంశాలను ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది.  వీటి ఆధారంగానే స్టాక్స్‌ ఎంపిక ఉంటుంది. విజయ్‌ కేడియా స్టాక్స్‌ ఎంపికకు ‘స్మైల్‌’ (టఝజీ ్ఛ) అనే సూత్రాన్ని అనుసరిస్తారు.

ఎంపిక చేసుకునే కంపెనీ చిన్నది అయి ఉండాలి. కంపెనీకి ఆయా వ్యాపారంలో మధ్యస్థ అనుభవం అయినా ఉండాలి. కంపెనీకి ఎంతో ఎత్తుకు ఎదగాలన్న బలమైన ఆకాంక్షలు ఉండాలి. దీనికి తగ్గట్టు మార్కెట్‌ అవకాశాలు అపారంగా ఉండాలి. వీటికి టిక్‌ పడితే ఆయన ఆ స్టాక్‌లో పెట్టుబడి పెట్టేస్తారు. అందుకే విజయ్‌ కేడియా పోర్ట్‌ఫోలియోలో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ కనిపిస్తాయి. తాను పెట్టుబడి పెట్టినప్పుడు చిన్నగా ఉండి.. ఆ తర్వాత మల్టీబ్యాగర్‌ రిటర్నులతో లార్జ్‌ క్యాప్‌గా మారిందనుకోండి. అప్పుడు విజయ్‌ కేడియా మళ్లీ స్మాల్‌క్యాప్‌ జెమ్స్‌ అన్వేషణలో పడతారు. తాను అనుకున్న క్వాలిటీలతో కంపెనీ కనిపించిందనుకోండి.. వెంటనే అందులోకి పెట్టుబడి బదిలీ చేస్తారు. ‘‘నేను స్మాల్, మిడ్‌క్యాప్‌ విభాగంలో ఆసక్తికరమైన కంపెనీ ఉందేమో చూస్తున్నాను. అవకాశం గుర్తిస్తే వెంటనే అందులోకి పెట్టుబడులు మార్చేస్తా’’అని చెప్పారు.

స్వల్ప కాలం ఫలితం ఇవ్వదు
మన చుట్టూ ఉన్న రిటైల్‌ ఇన్వెస్టర్లను గమనిస్తే.. ఒక్కటి గుర్తించొచ్చు. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వెంటనే పెరిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. కొనుగోలు ధర నుంచి కిందకు పడిపోతే వారిలో ఆందోళన మొదలవుతుంది. నష్టాల్లోనే ఆ కంపెనీ కొంత కాలం పాటు కొనసాగితే ఇక ఉండబట్టలేక ఎంతో కొంతకు అమ్మేస్తారు. అందుకే పెట్టుబడికి ముందు అధ్యయనం అవసరం. కంపెనీ వ్యాపారం, పనితీరు తదితర అంశాల ఆధారంగానే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. స్టాక్‌ ధరను చూసి కాదు. ఇలా చేస్తే కనుక అది తప్పుడు మార్గమే అవుతుంది.

పైగా, ఈక్విటీ పెట్టుబడికి స్వల్పకాలం ఫలితమివ్వదు. దీర్ఘకాలమే రాబడులకు మార్గం అవుతుంది. విజయ్‌ కేడియా పోర్ట్‌ఫోలియో గడిచిన ఏడాది కాలంలో రూపాయి లాభాన్ని ఇవ్వలేదు. గత ఏడాది కాలంలో ఆయనకు తేజాస్‌ నెట్‌వర్క్స్‌ షేరు మంచి రాబడినిచ్చింది. అదే సమయంలో అంబికా కాటన్‌ మిల్స్‌ ఫలితమివ్వలేదు. ‘‘నేను రాబడులను ఏటా చూసుకోను. నా పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్‌ మంచి రాబడినిచ్చినవే. 2020లో నేను కొన్న కొన్ని స్టాక్స్‌ అయితే 10 రెట్లు పెరిగాయి. కానీ 2021 మే నుంచి మార్కెట్‌ పరిస్థితుల వల్ల స్టాక్స్‌ ఏ మాత్రం వృద్ధి లేకుండా అక్కడే ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి’’అని విజయ్‌ కేడియా తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌ కూడా అంతే..
రియల్‌ ఎస్టేట్‌ రాబడులను కూడా కేడియా ఎప్పటికప్పుడు పరిశీలించుకోరు. ‘‘రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి అన్నది దీర్ఘకాలం పాటు అంటే 10–40 ఏళ్ల కోసం. నేను అయితే రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిని సందర్భోచితంగా చేస్తుంటాను’’అని ఆయన చెప్పారు. పైగా రియల్‌ ఎస్టేట్‌ అంటే ఏదో ఒక ప్లాట్‌ కొనుగోలు చేయడం కాదు. దానిపై రాబడి వచ్చేలా చూసుకుంటారు. నెలవారీగా ఆదాయాన్ని తెచ్చి పెట్టే రెండు గోదాములు ఆయన రియల్టీ పెట్టుబడిలో భాగం. కేవలం స్టాక్‌ మార్కెట్‌ రాబడినే ఆయన నమ్ముకోరు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కోసం ఆయన రియల్‌ ఎస్టేట్‌లో 8% పెట్టుబడులు పెట్టారు.  

భవిష్యత్తు పెట్టుబడి ఆలోచనలు..
ఈక్విటీలకు పెట్టుబడులు పెంచుకునేందుకు విజయ్‌ కేడియా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకానీ, మార్కెట్లలో అస్థిరతలు ఉన్నాయని చెప్పి పెట్టుబడులను కొంత విక్రయించి నగదు నిల్వలు పెంచుకోవాలని అనుకోవడం లేదు. 2022 స్తబ్ధుగా ఉండడం వల్ల భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్ల పతనాలను చూసి భయంతో విక్రయాలు చేస్తుంటారు. నిజానికి ఈ తరహా అనిశ్చితులు పెట్టుబడులు పెంచుకునేందుకు అను కూలం.  ఈక్విటీ పెట్టుబడులను భౌగోళికంగా భిన్న ప్రాంతాల మధ్య వైవిధ్యీకరించుకోవాలని చెబుతుంటారు.

కానీ, విజయ్‌ కేడియా ఈక్విటీ పెట్టుబడులు అన్నీ కూడా మన మార్కెట్లలోనే ఉన్నాయి. కాకపోతే గూగుల్‌ (ఆల్ఫాబెట్‌)లో మొదటిసారి ఆయన ఇన్వెస్ట్‌ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇది మినహా అమెరికా మార్కెట్లో మరే ఇతర టెక్నాలజీ షేరులో ఇన్వెస్ట్‌ చేయాలని ఆయన అనుకోవడం లేదు. ఆర్‌బీఐ లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి 2,50,000 డాలర్లను విదేశాలకు పంపుకోవచ్చు. తన పెట్టుబడులకు ఈ పరిమితి సరిపోతుందని, తన పోర్ట్‌ఫోలియోపై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని కేడియా వివరించారు. అంతెందుకు హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లలో చాలా మందికి విదేశీ పెట్టుబడులు లేవనే చెప్పుకోవాలి. వారంతా మన ఈక్విటీలు, రియల్‌ ఎస్టేట్, బంగారంపైనే ఎక్కువగా పెట్టుబడులు కలిగి ఉన్నారు.

అత్యవసర నిధి  
అత్యవసర నిధి ఎవరికైనా ఉండాల్సిందే. అవసర సమయంలో రుణం కోసం పరుగెత్తే విధంగా ఉండకూడదు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులను కూడా తాకకూడదు. అందుకే కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా నిధిని లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుకోవాలి. విజయ్‌ కేడియా అయితే అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోలేదు. దీన్ని కూడా ఆయన పెట్టుబడి మార్గంగా మలుచుకున్నారు. కంపెనీల నుంచి డివిడెండ్లు, గోదాముల రూపంలో రెంటల్‌ ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆయనకు తగినన్ని ఆదాయ మార్గాలున్నాయి. రిషికేశ్, గోవా, కేరళలో ఆయనకు యోగా, వెల్‌నెస్‌ కేంద్రాలు మూడున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement