ఈ ఏడాదీ ‘బుల్’ దూకుడే..
* స్టాక్ మార్కెట్లో కొత్త రికార్డులకు సంవత్ 2071 రెడీ: నిపుణులు
* ఐటీ, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ హవా
* సిమెంట్, ఇన్‌ఫ్రా రంగాలకు డిమాండ్
న్యూఢిల్లీ: హిందూ కొత్త సంవత్సరం 2,071లో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పుతాయని పలువురు నిపుణులు అంచనా వేశారు. ఈ దీపావళి రోజున మొదలైన 2,071 తొలి రోజునే మార్కెట్లు లాభాలు ఆర్జించిన నేపథ్యంలో విశ్లేషకుల అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత ఏడాదిలో(దీపావళి నుంచి దీపావళికి) ఇన్వెస్టర్లకు లాభాలపంట పండుతుందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఇటీవల కొంతమేర జోరు తగ్గినప్పటికీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీ స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. ఇటీవలే ముగిసిన 2,070 ఏడాదిలో మార్కెట్ ప్రామాణిక సూచీలు చరిత్రాత్మక గరిష్ట స్థాయిలను అందుకున్న కారణంగా నిపుణుల అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. సెన్సె క్స్ 5,590 పాయింట్లు(26%) పురోగమించి తొలిసారి 27,300ను దాటగా, నిఫ్టీ సైతం 8,180 పాయింట్ల మైలురాయిని అధిగమించిన విషయం విదితమే.
రిటైల్ ఇన్వెస్టర్లు వస్తారు
స్టాక్ సూచీలు కొత్త రికార్డులను అందుకుంటున్నకొద్దీ మార్కెట్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్ల రాక పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వెరసి ఈ ఏడాది రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా జత కలుస్తాయని అంచనా వేశారు. పూర్తిగా ఎఫ్‌ఐఐల పెట్టుబడులపైనే ఆధారపడుతున్న దేశీ మార్కెట్లకు రిటైలర్లరాక బలాన్నిస్తుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో డెరైక్టర్ ఎస్‌కే గోయల్ విశ్లేషించారు. ప్రస్తుత హిందూ సంవత్సరం 2,071లో మార్కెట్ పురోగమించే పరిస్థితులున్నప్పటికీ, భారీ హెచ్చుతగ్గులకు కూడా అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటికే ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న ఐటీ, ఫార్మా, ఆటో, వినియోగ వస్తువులు, బ్యాంకింగ్ రంగాలు ఇకపై కూడా ముందంజలో ఉంటాయని అంచనా వేశారు. మరోవైపు కొత్త పట్టణాల నిర్మాణంపై ప్రధాని మోడీ దృష్టిపెట్టిన కారణంగా సిమెంట్, ఇన్‌ఫ్రా రంగాల షేర్లకు డిమాండ్ పుడుతుందని పేర్కొన్నారు.
ఇకపై సంస్కరణల వేగం: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరలేపుతుందన్న అంచనాలు మార్కెట్లలో పెరిగాయని నిపుణులు తెలిపారు. దీంతో రాజ్యసభలోనూ బిల్లులను సులభంగా పాస్ చేయించేందుకు వీలు చిక్కుతుందని చెప్పారు. తద్వారా వేగవంత నిర్ణయాలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ అంశాలన్నీ ఎఫ్‌ఐఐలకు నమ్మకాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. సుస్థిర ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ రికవరీ వంటివి మార్కెట్లలో తదుపరి ర్యాలీకి దారిచూపుతాయని జియోజిత్ బీఎన్‌పీ రీసెర్చ్‌హెడ్ అలెక్స్ మాథ్యూస్ అభిప్రాయపడ్డారు.
‘ముహూరత్’ లాభాలతో మార్కెట్ షురూ
దీపావళి రోజైన గురువారం గంటంపావు పాటు జరిగిన ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు లాభా లను పంచింది. వెరసి నిఫ్టీ మళ్లీ 8,000 పాయింట్ల మైలురాయికిపైన నిలిచింది. 19 పాయింట్ల లాభంతో 8,014 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా 64 పాయింట్లు పెరిగి 26,851 వద్ద స్థిరపడింది. ప్రధానంగా చిన్న షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1%పైగా జంప్‌చేశాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,979 లాభపడగా, 533 నష్టపోయాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో విప్రో 3.6% క్షీణించింది. అయితే మరోవైపు బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ, రిలయన్స్, హిందాల్కో, ఎల్‌అండ్‌టీ, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్ 1.5-0.5% మధ్య బలపడ్డాయి. దీపావళి బలిప్రతిపద కారణంగా శుక్రవారం మార్కెట్లు పనిచేయలేదు.