ముంబై: స్టాక్ మార్కెట్‌లో కరెక‌్షన్ కొనసాగుతూనే ఉంది. సానుకూల వాతావరణంలో జరిగే ముహూరత్ ట్రేడ్‌పై కూడా కరెక‌్షన్ ఎఫెక్ట్ పడింది. దీంతో దేశీ సూచీలు ఓ దశలో తారాజువ్వలా రివ్వునపైకి లేచినా చివరకు మోస్తారు లాభాలతోనే ముగిశాయి.
దాదాపు పది నెలలుగా కొనసాగుతున్న బుల్ జోరుకు కొంత కాలంగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. నెలల తరబడి పెట్టుబడి పెడుతూ వచ్చిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీపావళి రోజున కొత్త సంవత్ 2078కి స్వాగతం పలుకుతూ గురువారం రాత్రి 6:15 నుంచి 7:15 గంటల వరకు ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడ్‌ను నిర్వహించారు.
ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో ఫుల్ జోష్ కనిపించింది. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 60,067 దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 పాయింట్ల దగ్గర ముగిసింది. ఓ దశలో నాలుగు వందల పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడినా.. వెంటనే ఇన్వెస్టర్లు లాభాల కోసం అమ్మకాలు చేపట్టారు. దీంతో చివరకు 295 పాయింట్ల లాభం దగ్గర సెన్సెక్స్ ముగిసింది.
ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ టాప్ 30 కంపెనీల్లో 25 కంపెనీలు లాభాలతో మార్కెట్‌ను ముగించాయి. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పేయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment