Trading stocks
-
ముహూరత్ ట్రేడింగ్‌లో జోష్.. లాభాల స్వీకరణకే మొగ్గు
ముంబై: స్టాక్ మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతూనే ఉంది. సానుకూల వాతావరణంలో జరిగే ముహూరత్ ట్రేడ్‌పై కూడా కరెక్షన్ ఎఫెక్ట్ పడింది. దీంతో దేశీ సూచీలు ఓ దశలో తారాజువ్వలా రివ్వునపైకి లేచినా చివరకు మోస్తారు లాభాలతోనే ముగిశాయి. దాదాపు పది నెలలుగా కొనసాగుతున్న బుల్ జోరుకు కొంత కాలంగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. నెలల తరబడి పెట్టుబడి పెడుతూ వచ్చిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీపావళి రోజున కొత్త సంవత్ 2078కి స్వాగతం పలుకుతూ గురువారం రాత్రి 6:15 నుంచి 7:15 గంటల వరకు ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడ్‌ను నిర్వహించారు. ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో ఫుల్ జోష్ కనిపించింది. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 60,067 దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 పాయింట్ల దగ్గర ముగిసింది. ఓ దశలో నాలుగు వందల పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడినా.. వెంటనే ఇన్వెస్టర్లు లాభాల కోసం అమ్మకాలు చేపట్టారు. దీంతో చివరకు 295 పాయింట్ల లాభం దగ్గర సెన్సెక్స్ ముగిసింది. ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ టాప్ 30 కంపెనీల్లో 25 కంపెనీలు లాభాలతో మార్కెట్‌ను ముగించాయి. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. -
మళ్లీ లాభాల్లోకి మార్కెట్
ముంబై: నాలుగు రోజుల నష్టాల ముగింపు తర్వాత స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల పట్టాలెక్కింది. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించవచ్చనే ఆశలతో సోమవారం స్టాక్ సూచీలు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. మెటల్, ఆర్థిక, ఐటీ, ఇంధన రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 534 పాయింట్లు పెరిగి 59,299 వద్ద నిలిచింది. నిఫ్టీ 159 పాయింట్లు ర్యాలీ చేసి 17,691 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణతలు సూచీల ర్యాలీని అడ్డుకోలేకపోయాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. గతవారంలో పతనాన్ని చూసిన మెటల్ షేర్లకు అధిక డిమాండ్ లభించింది. ప్రైవేటీకరణ ఆశలతో ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. ఫార్మాస్యూటికల్స్, స్పెషాలిటీ కెమికల్ కౌంటర్లకు కొనుగోళ్లతో కళకళలాడాయి. క్యూ2 ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించనున్న ఐటీ షేర్లలో కన్సాలిడేషన్ చోటు చేసుకుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండు శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.860 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.228 కోట్ల షేర్లను కొన్నారు. చైనా ఎవర్‌గ్రాండే గ్రూప్ రుణ సంక్షోభం, ద్రవ్యోల్బణ ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 74.31 వద్ద స్థిరపడింది. సూచీల భారీ ర్యాలీతో స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులో రూ.3.17 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కె ట్ విలువ రూ.266.77 లక్షల కోట్లకు చేరింది. ‘‘వారం రోజుల స్థిరీకరణ తర్వాత స్టాక్ మార్కెట్ బౌన్స్‌బ్యాక్ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(జూలై–సెప్టెంబర్)ఫలితాలను అక్టోబర్ 8న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ బోణీ చేయనుంది. తొలి దశతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థపై మలి దశ కోవిడ్ ప్రభావం తక్కువగా ఉన్నందున క్యూ2లో కార్పొరేట్లు మెరుగైన ఆర్థిక గణాంకాలు ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పండుగ సీజన్లో డిమాండ్ మరింత ఊపందుకోవచ్చనే ఆశలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు స్టాక్ సూచీల బౌన్స్ బ్యాక్‌కు కారణమయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా... ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.., దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 377 పాయింట్ల లాభంతో 59 వేలపై 59,143 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 17600 పైన 17,616 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుస నాలుగురోజు మార్కెట్ పతనంతో దిగివచ్చిన షేర్లను కొనుగోళ్లు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. తొలి సెషన్లో సెన్సెక్స్ 782 పాయింట్లు ఎగసి 59,548 వద్ద, నిఫ్టీ 219 పాయింట్లు ర్యాలీ చేసి 17,751 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు, యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో సూచీలు కొంతమేర లాభాల్ని కోల్పోయాయి. మిగిలిన లాభాల్ని చివరి వరకు నిలుపుకోవడంలో సూచీలు సఫలమయ్యాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►కోవిడ్ ఔషధ తయారీ అనుమతులు లభించడంతో దివీస్ ల్యాబ్స్ షేరు ఎనిమిది శాతం లాభపడి రూ.5221 వద్ద ముగిసింది. ►ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ వార్తలతో ఎన్టీపీసీ షేరు ర్యాలీ కొనసాగుతోంది. ఇంట్రాడేలో 6.5% ఎగసింది. చివరికి 4% లాభంతో రూ.146 వద్ద స్థిరపడింది. ►వ్యాపార రికవరీ ఆశలతో టాటా మోటార్స్ షేరు 3% పెరిగి రూ.342 వద్ద నిలిచింది. ►ఇన్వెస్కో–గోయెంకా పంచాయితీ బొంబై హైకోర్టుకు చేరిన నేపథ్యంలో జీ ఎంటర్టైన్ మెంట్ 2% పెరిగి రూ.301 వద్ద ముగిసింది. -
ఈ చిన్న షేర్లు మార్కెట్లనే మించాయ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 510 పాయింట్లు జంప్‌చేసి 40,268 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లనే మించుతూ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో జామ్నా ఆటో ఇండస్ట్రీస్, మ్యాగ్మా ఫిన్‌కార్ప్, ప్రిజమ్ జాన్సన్, యాంబర్ ఎంటర్ప్రైజెస్, సువెన్ ఫార్మాస్యూటికల్స్, సుందరం ఫైనాన్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. జామ్నా ఆటో ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 93,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.53 లక్షల షేర్లు చేతులు మారాయి. మ్యాగ్మా ఫిన్‌కార్ప్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 40 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.3 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.84 లక్షల షేర్లు చేతులు మారాయి. ప్రిజమ్ జాన్సన్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం లాభపడి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 55,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 76,000 షేర్లు చేతులు మారాయి. యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.6 శాతం జంప్‌చేసి రూ. 2,239 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,353 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,500 షేర్లు చేతులు మారాయి. సువెన్ ఫార్మాస్యూటికల్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7.5 శాతం దూసుకెళ్లి రూ. 323 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 332 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 27,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 15,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి. సుందరం ఫైనాన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం ర్యాలీతో రూ. 1590 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1610ను అధిగమించింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,300 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో కేవలం 1,300 షేర్లు చేతులు మారాయి. -
భారీ అమ్మకాలతో ఈ చిన్న షేర్లు బోర్లా
ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని స్టాల్ క్యాప్ కౌంటర్లలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు తెరతీశారు. దీంతో నేషనల్ ఫెర్టిలైజర్స్, టీపీఎల్ ప్లాస్టెక్, ఇండియాబుల్స్ వెంచర్స్, శాంతి గేర్స్, రినైసెన్స్ గ్లోబల్ భారీ నష్టాలతో కుప్పకూలాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. వివరాలు చూద్దాం.. నేషనల్ ఫెర్టిలైజర్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతంపైగా కుప్పకూలి రూ. 36 దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4.19 లక్షల షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 6.71 లక్షల షేర్లు చేతులు మారాయి. టీపీఎల్ ప్లాస్టెక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం దిగజారి రూ. 117 దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2,600 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 13,000 షేర్లు చేతులు మారాయి. ఐబీ వెంచర్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం పతనమై రూ. 35 దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 72,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 57,000 షేర్లు చేతులు మారాయి. శాంతి గేర్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం పడిపోయి రూ. 85 దిగువన ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5,200 షేర్లుకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 18,000 షేర్లు చేతులు మారాయి. రినైసెన్స్ గ్లోబల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం తిరోగమించి రూ. 269 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 750 షేర్లు మాత్రమేకాగా.. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా 6,800 షేర్లు చేతులు మారాయి. -
భారీ ట్రేడింగ్‌తో ఈ షేర్ల హైజంప్
అంతర్జాతీయ సంకేతాలకుతోడు దేశీయంగానూ సెంటిమెంటు బలపడటంతో మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 35,191కు చేరగా.. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 10,380 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో మిశ్ర ధాతు నిగమ్(మిధానీ), ఇమామీ లిమిటెడ్, బిర్లా కార్పొరేషన్, మయూర్ యూనికోటర్స్, తాల్‌బ్రోస్ ఆటోమోటివ్, బనారస్ బీడ్స్ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం.. మిశ్ర ధాతు నిగమ్ పీఎస్‌యూ రంగ కంపెనీ మిశ్ర ధాతు నిగమ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 219 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 222 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 2.17 లక్షల షేర్లు కాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.76 లక్షల షేర్లు చేతులు మారాయి. \ ఇమామీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం పురోగమించి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 228 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 46,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.26 లక్షల షేర్లు చేతులు మారాయి. బిర్లా కార్పొరేషన్ సిమెంట్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 602 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 612 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 19,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 16,000 షేర్లు చేతులు మారాయి. మయూర్ యూనికోటర్స్ సింథటిక్ లెదర్ ప్రొడక్టుల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 206 సమీపంలో ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 3,600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3.19 లక్షల షేర్లు చేతులు మారాయి. తాల్‌బ్రోస్ ఆటోమోటివ్ ఆటో విడిభాగాల తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 120 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 7,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 31,000 షేర్లు చేతులు మారాయి. బనారస్ బీడ్స్ ఇమిటేషన్ ఫ్యాషన్ జ్యువెలరీ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 46.3 వద్ద ఫ్రీజయ్యింది.బీఎస్ఈలో గత నెల రోజుల సగటు పరిమాణం 3,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 5,000 షేర్లు చేతులు మారాయి. -
షేర్లలోనూ ‘రాణి’స్తున్నారు...
స్టాక్స్ ట్రేడింగ్‌లోనూ మహిళల ముందంజ చిన్న మొత్తాలతో సిప్ చేస్తూ పెద్ద సంపద మార్కెట్లు పడ్డా భయపడకుండా పెట్టుబడి దీర్ఘకాలం వేచి ఉండటంతోనే విజయం మన పార్లమెంట్లో సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశమైతే ఇప్పటిదాకా మహిళలకు రాలేదు. కాకపోతే ప్రతి ఇంట్లోనూ బడ్జెట్ చూసేది మహిళలే. అదేకాదు!!దేశ ఆర్థిక వ్యవస్థ... ప్రత్యేకించి బ్యాంకింగ్ వ్యవస్థ విపరీతమైన కుదుపులకు లోనవుతున్న ఈ తరుణంలో దేశంలో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు అగ్రశ్రేణి బ్యాంకులన్నిటినీ విజయవంతంగా నడిపిస్తున్నదీ మహిళలే. అరుంధతీ భట్టాచార్య (ఎస్బీఐ), ఉషా అనంత సుబ్రమణియన్ (పీఎన్బీ), ప్రైవేటు బ్యాంకుల్ని చందా కొచ్చర్ (ఐసీఐసీఐ), శిఖా శర్మ (యాక్సిస్), నైనాలాల్ కిద్వాయ్ (హెచ్ఎస్బీసీ), కల్పనా మోర్పారియా (జేపీ మోర్గాన్)... ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితాకు అంతుండదు. అంతెందుకు!! స్టాక్ మార్కెట్ దిగ్గజం ఎన్ఎస్ఈకి సారథ్యం వహిస్తున్న చిత్రా రామచంద్రన్ దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. బ్యాంకుల్ని, ఆర్థిక సంస్థల్ని నడిపించటమే కాదు... సాధారణ ఇన్వెస్టర్లుగానూ రాణించగలమని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. ఖాళీ సమయం, చేతిలో మిగిలే డబ్బు... ఈ రెండింటినీ పెట్టి చక్కగా ఆర్జిస్తున్నారు. అలాంటి నలుగురు మహిళల ఆర్థిక అనుభవాలు... ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఈ వారం ప్రాఫిట్ ప్లస్‌లో మీ కోసం... - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగంట పడినప్పుడు భయపడలేదు... స్టాక్ మార్కెట్లన్నాక హెచ్చుతగ్గులు సహజం. నేను గత ఇరవై ఏళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎగుడు దిగుళ్లు చూశా. కానీ స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడకుండా ధైర్యంగా నిలబడ్డా. ఇన్వెస్ట్ చేయటం మాత్రం మానలేదు. అందుకే మంచి లాభాలను ఆర్జించాను. ముఖ్యంగా 2002, 2008లో వచ్చిన సంక్షోభ సమయాల్లో నేను ఇన్వెస్ట్ చేసిన షేర్లు బాగా పడిపోయాయి. భయపడి నష్టానికి విక్రయించకుండా ఓపిగ్గా ఎదురు చూశా. ఇప్పుడవి తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఇలా ఒడిదుడుకుల సమయంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు దూరంగా ఉండి... వేచి చూసే ధోరణి అవలంబించడమే నా విజయ సూత్రంగా భావిస్తా. ఇరవై ఏళ్ల క్రితం సుమారు రూ.5లక్షలతో మొదలు పెట్టిన పెట్టుబడి విలువ ఇప్పుడు రూ.కోటి దాటిందంటే ఓపిక, సహనమే కారణమంటాను. కేవలం ఒకే రంగానికి సంబంధించిన షేర్లలో ఇన్వెస్ట్ చేయకుండా పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకున్నా. ఇందుకోసం పేపర్లు, టీవీలతో పాటు జెన్‌మనీ సూచనలు కూడా తీసుకున్నా. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో 20కిపైగా కంపెనీల షేర్లున్నాయి. కొన్ని షేర్లలో నేను కొన్నాక ట్రేడింగ్ కూడా ఆగిపోయినవి ఉన్నాయి. అందుకే ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న షేర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి నేను చెప్పే సలహా ఏమిటంటే.. ఎవరో కొన్నారని కొనడం కాకుండా, నిపుణుల సలహా తీసుకోవాలి. స్వల్పకాలంలో ఎక్కువ సంపాదిద్దామనే అత్యాశకు పోకుండా దీర్ఘకాలం వేచి చూస్తే తప్పక లాభాలొస్తాయి. - జి.రామలక్షి, హైదరాబాద్ మార్కెట్లు పడ్డప్పుడు ఇన్వెస్ట్ చేయండి... ఎంసీఏ పూర్తి చేశాక ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చెయ్యాలనిపించింది. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేశా. మిగిలిన మహిళల్లానే ఉద్యోగం చేసి సొంత కాళ్లపై నిలబడాలన్నది నా ఆలోచన. కానీ పిల్లలపైన, వారి చదువుపైన ఫోకస్ చెయ్యటంతో ఉద్యోగం కుదరలేదు. అందుకే ఇంటి దగ్గర కూర్చొని ఎంతో కొంత సంపాదించడం ఎలా?... అని ఆలోచిస్తున్న తరుణంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని మా వారు సూచించారు. దీంతో మూడేళ్లుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్చే యడం మొదలు పెట్టా. ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు ట్రేడింగ్ కూడా చేస్తున్నా. ఇందుకోసం నేనైతే ఎవరి సలహాలూ తీసుకోవటం లేదు. ప్రతి రోజూ వార్తలు చూడటం, పేపర్లు చదవడం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక పరిణామాలపై అవగాహన పెంచుకుంటున్నా. దానికి అనుగుణంగా లావాదేవీలు నిర్వహిస్తున్నా. మార్కెట్లు బాగా ఒడిదుడుకులకు లోనైనప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేస్తుంటాను. అదే స్టాక్ మార్కెట్ పడినప్పుడు దీర్ఘకాలిక దృష్టితో షేర్లు కొంటాను. వేరెవరితోనూ సంబంధం లేకుండా... పిల్లలు స్కూలుకు వెళ్ళి వచ్చేలోపు ఉన్న ఖాళీ సమయంలోనే ట్రేడింగ్ చేస్తుంటా. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో రూ.4 లక్షల విలువైన షేర్లున్నాయి. బ్యాంకులు, సీడ్ కంపెనీలు, ఐటీ రంగ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశా. నా మూడేళ్ల అనుభవంలో అర్థమైన విషయం ఏమిటంటే... ట్రేడింగ్‌లో ఏమీ మిగలదని. ట్రేడింగ్‌లో ఒకేరోజు రూ. 3 లక్షలు లాభం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ... మిగిలిన రోజుల్లో వచ్చిన నష్టాలను కలుపుకుంటే దానికది సరిపోతుంది. అందుకే నేను మిగిలిన మహిళలకు ఇచ్చే సలహా ఏంటంటే... ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. మార్కెట్లు బాగా పడినప్పుడు షేర్లు కొనండి. ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల కంటే షేర్లే ఎక్కువ రాబడిని అందిస్తాయని నేైనె తే గట్టిగా నమ్ముతున్నాను. - వై. హరిప్రియ రెడ్డి, హైదరాబాద్ ఫండ్స్‌తో నెలవారీ ఖర్చులు.. నెలనెలా కొంచెం కొంచెం పెట్టుబడి పెడితే చాలు. దీర్ఘకాలంలో చక్కని నిధి ఏర్పడుతుంది. ఈ విషయం మనకు మ్యూచ్‌వల్ ఫండ్లు నేర్పిస్తాయి. గృహిణినే అయినా నేను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రెగ్యులర్ ఆదాయాన్ని ఆర్జిస్తున్నా. దీనికోసం నేను పెద్దగా ఇన్వెస్ట్ చేసింది కూడా లేదు. ప్రతి నెలా ఇంటి ఖర్చులకు పోగా మిగిలిన దాన్లో కొంత మొత్తాన్ని సిప్ ఫండ్స్‌లో కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. 1995లో కేవలం రూ.500తో మొదలు పెట్టా. ఇపుడు నా పోర్ట్‌ఫోలియో రూ. 7 లక్షలు దాటింది. అంతే కాదు!! ప్రతినెలా డివిడెండ్ రూపంలో వస్తున్న డబ్బులు నా ఖర్చులకు అక్కరకొస్తున్నాయి. సిప్ విధానంలో మూడేళ్లలో రూ.15,000 ఇన్వెస్ట్ చేస్తే అది ఐదేళ్లకు మూడు రెట్లయింది. ఆ మొత్తాన్ని నేను లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో... డివిడెండ్ చెల్లించే వాటిలో తిరిగి ఇన్వెస్ట్ చేశాను. 2008 నాటికి నేను ఇన్వెస్ట్ చేసిన మొత్తం డివిడెండ్ రూపంలో వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు నా పోర్టుఫోలియోలో ఉన్నదల్లా లాభమే. అది కూడా అసలుకన్నా ఎక్కువ పెరిగింది. అలాగే పుట్టిన రోజున పుట్టింటివారు ఇచ్చిన డబ్బులను కూడా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. కొన్ని సందర్భాల్లో చీరల వంటి అనవసర ఖర్చులు తగ్గించుకొని మరీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. ఇక నా పోర్ట్‌ఫోలియో విషయానికొస్తే ఎక్కువ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. కేవలం ఐదు ఫండ్స్‌తో డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నా. దీర్ఘకాలం డివిడెండ్ల కోసం మంచి రేటింగ్ ఉన్న లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశా. ఇవి మార్కెట్ బాగున్నప్పుడు ఏటా యూనిట్‌కు 4-5 శాతం డివిడెండ్ అందిస్తాయి. అదే మార్కెట్ పరిస్థితులు బాగోలేనప్పుడు డివిడెండ్ ఒక శాతం లోపు ఉంటుంది. అలాగే నెలావారి ఖర్చుల కోసం బ్యాలెన్స్డ్ ఫండ్, తక్కువ కాలపరిధి ఉన్న డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశా. ఇవి బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడినే అందిస్తున్నాయి. నేను మార్కెట్ ఒడిదుడుకులను అసలు పట్టించుకోను. మార్కెట్ పెరిగిందా? పడిందా? అన్నది చూడకుండా డబ్బు ఉన్నప్పుడల్లా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. నా సుదీర్ఘ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనుభవాన్ని బట్టి నేను చెప్పేది ఏమిటంటే.. స్వల్ప కాలంలో రెట్టింపు డబ్బును సంపాదించాలన్న అత్యాశతో కాకుండా దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేస్తే చాలు. బ్యాంకు వడ్డీరేటు కంటే ఎక్కువ రాబడి తప్పకుండా వస్తుంది. చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరో అయిపోతుందని చెబుతుంటారు. దాంతో నేను ఏకీభవించను. ఇన్వెస్ట్ చేసి కనీసం నాలుగేళ్లు వేచి ఉండగలిగితే నష్టాలుండవు. అదే ఎనిమిదేళ్లు దాటితే రెట్టింపు లాభాలను అందుకోగలమన్నది నా అభిప్రాయం. - ఎ.కవితా రాణి, హైదరాబాద్