2024లో సరికొత్త రికార్డ్
మొత్తం 91 ఇష్యూలు
రూ. 1.6 లక్షల కోట్ల సమీకరణ
2025లో మరింత దూకుడుకు చాన్స్
స్టాక్ మార్కెట్లో ఐపీఓలు దుమ్ముదులిపేస్తున్నాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్నాయి. కేవలం లిస్టింగ్ మాత్రమే కాదు బంపర్ లాభాలతో ఇన్వెస్టర్లను రారమ్మని ఊరిస్తున్నాయి. ఈ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్ స్థాయిలో క్యూ కట్టారు. వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ బ్రేక్ అయింది.
ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూసినప్పటికీ ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సెన్సెక్స్ (బీఎస్‌ఈ) తొలిసారి సెపె్టంబర్ 27న 85,978 పాయింట్లకు చేరగా.. నిఫ్టీ (ఎన్‌ఎస్‌ఈ) 26,277ను తాకింది. ఈ బాటలో ఐపీవో మార్కెట్ మరింత కళకళలాడింది. ప్రధాన విభాగంలో ఏకంగా 91 కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. తద్వారా మొత్తం రూ. 1,60,500 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇందుకు ఆరి్థక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీగా పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, లావాదేవీల సులభతర నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో పలు ఐపీవోలకు గరిష్ట స్థాయిలో బిడ్డింగ్ లభించగా.. లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలిచాయి. 17 మాత్రమే నష్టాలతో ముగిశాయి.
భారీ ఇష్యూల తీరిలా...
2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ రూ. 11,327 కోట్లు, ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్‌ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజనీర్స్, బీఎల్‌ఎస్ ఈసరీ్వసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్‌ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్‌ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి.
వచ్చే ఏడాదీ మెరుపుల్...
సెబీకి దాఖలైన 89 కంపెనీల ఐపీవో దరఖాస్తుల ప్రకారం 2025లో రూ. 2.5 లక్షల కోట్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా. వీటిలో ఇప్పటికే 34 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. ఈ జాబితాలో రిలయన్స్ జియో, ఎన్‌ఎస్‌ఈ ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఇండియా, టాటా క్యాపిటల్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, హీరో ఫిన్‌కార్ప్, ఎన్‌ఎస్‌డీఎల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, కెనరా రోబెకో, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ వంటివి . దీంతో కొత్త ఏడాది ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయనే ఆసక్తి నెలకొంది!
సగటు పరిమాణం అప్...
ఈ ఏడాది చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. దీంతో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,700 కోట్లను దాటింది. 2023లో ఇది కేవలం రూ. 867 కోట్లుగా నమోదైంది. ఏడాది చివరి నెల (డిసెంబర్)లోనూ 15 కంపెనీలు ఐపీవోలకు రాగా.. సెకండరీ మార్కెట్లో నికర అమ్మకందారులుగా నిలుస్తూనే విదేశీ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కట్టడం విశేషం! ఈ నెల 24 వరకూ ముగిసిన 90 ఇష్యూల ద్వారా అన్‌లిస్టెడ్ కంపెనీలు రూ.1.6 లక్షల కోట్లను సమీకరించాయి.
సోమవారం (23న) ప్రారంభమైన యూనిమెక్ ఏరోస్పేస్ మరో రూ. 500 కోట్లు అందుకోనుంది. గతేడాది (2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు మాత్రమే సమీకరించాయి. ఈ బాటలో మరోపక్క ఎస్‌ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్‌డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్‌ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్‌ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది!
Comments
Please login to add a commentAdd a comment