బర్గర్‌ కింగ్‌ ఐపీవోకు రిటైలర్ల క్యూ | Burger king ipo attracts retail investors | Sakshi
Sakshi News home page

బర్గర్‌ కింగ్‌ ఐపీవోకు రిటైలర్ల క్యూ

Published Fri, Dec 4 2020 9:00 AM | Last Updated on Fri, Dec 4 2020 11:26 AM

Burger king ipo attracts retail investors - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్‌(QSR) చైన్ల దిగ్గజం బర్గర్‌ కింగ్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 59-60కాగా.. రెండో రోజు గురువారానికల్లా 9.4 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 38 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించడం గమనార్హం! ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్‌ఆర్‌ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. వెరసి 7.44 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. గురువారం(3) వరకూ దాదాపు 70 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖయ్యాయి. ఐపీవో నిధులలో కొంతమేర బర్గర్‌ కింగ్‌ రెస్టారెంట్స్‌ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూకి ముందు రోజు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకుంది.

ఐదేళ్లలో.. 
గ్లోబల్‌ క్యూఎస్‌ఆర్‌ చైన్‌ సంస్థ బర్గర్‌ కింగ్‌ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్‌ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్‌ కింగ్‌ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్‌ బ్రాండ్లలో నెట్‌వర్క్‌ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌.. డోమినోస్‌ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌..  మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement