జాబితాలో సాత్విక్ గ్రీన్ ఎనర్జీ
ఏజిస్ వొపాక్ టెర్మినల్స్ సైతం
సెబీకి ప్రాథమిక పత్రాల దాఖలు
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. జాబితాలో ఎల్‌పీజీ, కెమికల్స్ స్టోరేజీ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్‌తోపాటు.. సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ చేరాయి. వివరాలు చూద్దాం..
రూ. 3,500 కోట్లపై దృష్టి
ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకంటే ముందుగా షేర్ల జారీ ద్వారా రూ. 700 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఐపీవో పరిమాణం ఆమేర తగ్గవచ్చు.
ఇష్యూ నిధుల్లో రూ. 2,027 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. వీటితో మంగళూరువద్ద క్రియోజెనిక్ ఎల్‌పీజీ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనుంది. మిగిలిన నిధులను కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీలో ప్రస్తుతం వొపాక్ ఇండియా బీవీకి 50.1 శాతం, ఏజిస్ లాజిస్టిక్స్‌కు 47.31 శాతం చొప్పున వాటా ఉంది. 2024 జూన్‌కల్లా దేశవ్యాప్తంగా 18 స్టోరేజీ ట్యాంకులను నిర్వహిస్తోంది. పెట్రోలియం, వెజిటబుల్ ఆయిల్, లూబ్రికెంట్స్, ఎల్‌పీజీ, ప్రొపేన్, బ్యుటేన్ తదితరాల నిల్వకు వీటిని వినియోగించవచ్చు.
రూ. 1,150 కోట్లకు రెడీ
సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా రూ. 1,150 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో రూ. 850 కోట్లు తాజా ఈక్విటీ జారీ ద్వారా, మరో రూ. 300 కోట్లు ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకోనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 90 శాతంగా నమోదైంది.
ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 553 కోట్లు ఒడిషాలో 4 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుపై వెచి్చంచనుంది. మరో రూ. 96 కోట్లు అనుబంధ సంస్థ సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. 2024 జూన్‌కల్లా 1.8 గిగావాట్ల నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ప్రధానంగా సోలార్ ప్రాజెక్టులకు ఎండ్‌టు ఎండ్ ఈపీసీ సరీ్వసులను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 246 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment