న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు హోనసా కన్జూమర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. బలహీన మార్కెట్ పరిస్థితుల కారణంగా ఐపీవోను పక్కనపెట్టినట్లు మీడియాలో వెలువడిన వార్తల నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్లు మామాఎర్త్, ద డెర్మా కో మాతృ సంస్థ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఐపీవోకు అనుమతి పొందే బాటలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌పై సెబీతో చర్చిస్తున్నట్లు కంపెనీ సీఈవో, సహవ్యవస్థాపకుడు వరుణ్ అలగ్ వెల్లడించారు.
నిబంధనల ప్రకారం సెబీ అనుమతి పొందాక ఐపీవో చేపట్టేందుకు 12 నెలల గడువు ఉంటుందని, తదుపరి బ్యాంకర్లతో చర్చిస్తామని తెలియజేశారు. 2022 డిసెంబర్‌లో కంపెనీ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 4.68 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్లను ఆఫర్ చేయనున్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లలో వరుణ్, ఘజల్ అలగ్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా, రోహిత్ కుమార్ బన్సల్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment