2 IPOs to raise a whopping Rs 7,000 crore! EbixCash, Survival Technologies - Sakshi
Sakshi News home page

2 కంపెనీల ఐపీవోలకు సెబీ ఓకే

Published Tue, Apr 25 2023 6:37 AM | Last Updated on Tue, Apr 25 2023 11:50 AM

2 IPOs to raise a whopping Rs 7000 crore - Sakshi

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా నిధుల సమీకరణకు నాస్‌డాక్‌ లిస్టెడ్‌ కంపెనీ ఎబిక్స్‌ ఇంక్‌ అనుబంధ సంస్థ ఎబిక్స్‌క్యాష్‌ లిమిటెడ్, స్పెషాలిటీ కెమికల్‌ తయారీ కంపెనీ సర్వైవల్‌ టెక్నాలజీస్‌లను అనుమతించింది. స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించమంటూ ఈ రెండు కంపెనీలు 2022 మార్చి, డిసెంబర్‌ మధ్య కాలంలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి.  

రూ. 6,000 కోట్లపై కన్ను
ఐపీవో ద్వారా ఎబిక్స్‌క్యాష్‌ లిమిటెడ్‌ రూ. 6,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అనుబంధ సంస్థలు ఎబిక్స్‌ ట్రావెల్స్, ఎబిక్స్‌క్యాష్‌ వరల్డ్‌ మనీ.. వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనుంది. అంతేకాకుండా ఎబిక్స్‌ మారిషస్‌ జారీ చేసిన తప్పనిసరిగా మార్పడికి లోనయ్యే డిబెంచర్ల చెల్లింపులతోపాటు.. వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సైతం వెచ్చించనుంది. కంపెనీ పేమెంట్‌ సొల్యూషన్స్, ట్రావెల్, ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్, బీపీవో సర్వీసులు, స్టార్టప్‌ల ఏర్పాటులో టెక్నాలజీ ఆధారిత డిజిటల్‌ ప్రొడక్టులు, సర్వీసులను అందిస్తోంది.  

రూ. 1,000 కోట్లకు సై
ఐపీవోలో భాగంగా సర్వైవల్‌ టెక్నాలజీస్‌ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్, ఇతర సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ సర్వీసెస్‌(సీఆర్‌ఏఎంఎస్‌– క్రామ్స్‌) విభాగంలో ప్రధానంగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ గ్రూప్‌ల నుంచి ఎంపిక చేసిన ఉత్పత్తులను కంపెనీ రూపొందిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement