లిస్టులో 11 ఇష్యూలు
5 మెయిన్‌బోర్డు, 6 ఎస్‌ఎంఈల పబ్లిక్ ఇష్యూలు
రూ. 18,500 కోట్ల సమీకరణలో కంపెనీలు
న్యూఢిల్లీ: ఐపీవోల జాతరతో ఈ వారమంతా మార్కెట్ సందడిగా ఉండనుంది. చిన్నా, పెద్దవి కలిపి మొత్తం 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. రూ. 18,500 కోట్లు సమీకరించబోతున్నాయి. విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, ఫిన్‌టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం మీద అయిదు పెద్ద సంస్థల ఇష్యూలు, ఆరు చిన్న–మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) ఇష్యూలు వీటిలో ఉన్నాయి. ఆరు ఎస్‌ఎంఈలు సుమారు రూ. 150 కోట్లు సమీకరించనున్నాయి.
వివిధ రంగాలకు చెందిన సంస్థల ఐపీవోలు.. కొత్త షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానాల్లో ఉండనున్నాయి. ప్రస్తుత షేర్‌హోల్డర్లు తమ వాటాలను విక్రయించుకునేందుకు, సంస్థలు విస్తరణ ప్రణాళికల కోసం నిధులను సమీకరించుకునేందుకు, రుణాలను తిరిగి చెల్లించివేసేందుకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు కంపెనీలకు ఈ ఇష్యూలు ఉపయోగపడనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు, ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ బై–ఎలక్షన్ల ఫలితాలతో మార్కెట్లో సానుకూల సెంటిమెంటు నెలకొందని, ఐపీవోలు విజయవంతమయ్యేందుకు ఇది దోహదపడగలదని ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ ట్రేడ్‌జినీ సీవోవో డి. త్రివేశ్ తెలిపారు.
2024లో ఇప్పటివరకు రూ. 1.4 లక్షల కోట్ల సమీకరణ..
ఈ ఏడాది ఇప్పటివరకు 78 మెయిన్ బోర్డ్ కంపెనీలు, పబ్లిక్ ఇష్యూల ద్వారా దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో హ్యుందాయ్ మోటర్ ఇండియా, స్విగ్గీ, ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి దిగ్గజ ఇష్యూలు ఉన్నాయి. 2023లో 57 సంస్థలు రూ. 49,436 కోట్లు సమీకరించాయి. గత కొన్నాళ్లుగా ఇటు ఇష్యూయర్లు అటు ఇన్వెస్టర్లలోను ప్రైమరీ మార్కెట్లపై గణనీయంగా ఆసక్తి పెరిగింది. గడిచిన అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు పొందారు. 2021–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యలో వచి్చన 236 ఐపీవోలు .. రిటైల్ ఇన్వెస్టర్లకు సగటున 27 శాతం మేర లిస్టింగ్ లాభాలు అందించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఇష్యూల వివరాలు..
→ విశాల్ మెగా మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ ఇష్యూలు డిసెంబర్ 11న ప్రారంభమై 13న ముగుస్తాయి. ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవోలు డిసెంబర్ 12న, 13న ప్రారంభమవుతాయి.
→ విశాల్ మెగామార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమీకరిస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ కేదారా క్యాపిటల్‌కి చెందిన సమాయత్ సరీ్వసెస్ ఓఎఫ్‌ఎస్ కింద షేర్లను విక్రయిస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 74–78గా నిర్ణయించారు.
→ సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోకి సంబంధించి ధర శ్రేణి రూ. 522 నుంచి రూ. 549 వరకు ఉంటుంది. కంపెనీ మొత్తం రూ. 3,043 కోట్లు సమీకరిస్తోంది. ఇందులో రూ. 950 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్‌ఎస్ కింద ప్రమోటర్లు, ఇన్వెస్టర్ షేర్‌హోల్డర్లు, ఇతర షేర్‌హోల్డర్లు 3.81 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
→ మొబిక్విక్ ఐపీవో రూ. 572 కోట్లు సమీకరిస్తోంది. ఇందుకోసం 2.05 కోట్ల షేర్లను తాజాగా జారీ చేస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 265–279 వరకు ఉంటుంది.
→ ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఐపీవో పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో ఉంటుంది. ఇష్యూ పరిమాణం రూ. 2,500 కోట్లు.
→ ఇక ఎస్‌ఎంఈ ఐపీవోల విషయానికొస్తే ధనలక్ష్మి క్రాప్ సైన్స్ (డిసెంబర్ 9–11) టాస్ ది కాయిన్ లిమిటెడ్.. జంగిల్ క్యాంప్స్ ఇండియా (రెండూ డిసెంబర్ 10–12), సుప్రీమ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్.. పర్పుల్ యునైటెడ్ సేల్స్ (డిసెంబర్ 11–13), యశ్ హైవోల్టేజ్ (డిసెంబర్ 12–16) సంస్థలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment